‘డైలాగ్స్‌ పలకడంలో ఆయనకు ఆయనే సాటి’ | tsr Kakatiya Kala Vaibhava Mahotsavam in Telangana | Sakshi
Sakshi News home page

‘డైలాగ్స్‌ పలకడంలో ఆయనకు ఆయనే సాటి’

Published Thu, Jan 18 2018 1:05 AM | Last Updated on Mon, Oct 8 2018 3:41 PM

tsr Kakatiya Kala Vaibhava Mahotsavam in Telangana - Sakshi

బాలకృష్ణ, టీయస్సార్, మధుసూదనాచారి, విద్యాసాగర్‌ రావు, మోహన్‌బాబు, స్వామి గౌడ్, గీతారెడ్డి, మాడుగుల నాగఫణి శర్మ

‘‘ఇలాంటి కార్యక్రమాన్ని ఇంత చక్కగా నిర్వహించడం సుబ్బరామిరెడ్డిగారికే సాధ్యం. కళాకారులను సన్మానించడానికి ఆయన 120 ఏళ్లు జీవించి ఉండాలి’’ అని మహారాష్ట్ర గవర్నర్‌ సి.హెచ్‌. విద్యాసాగర్‌ రావు అన్నారు. ‘కళాబంధు’ టి. సుబ్బరామిరెడ్డి బుధవారం ‘కాకతీయ కళా వైభవ మహోత్సవం’ నిర్వహించారు. ఈ సందర్భంగా నటుడు మంచు మోహన్‌బాబుని ‘విశ్వ నట సార్వభౌమ’ అవార్డుతో సత్కరించారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన విద్యాసాగర్‌ రావు మాట్లాడుతూ– ‘‘భారతదేశంలో అత్యధికులు మాట్లాడే భాష హిందీ తర్వాత తెలుగే అని మనం సగర్వంగా చెప్పుకోవాలి.

మారుమూల ప్రాంతాల్లోని పేద కళాకారులను సైతం గుర్తించి సన్మానం చేయాలని సుబ్బరామిరెడ్డిగారికి నేను మనవి చేస్తున్నా. ప్రపంచంలోని తెలుగువారందర్నీ కలిపి ఓ వెబ్‌సైట్‌ తయారు చేయాలి. తెలుగు భాషకు సంబంధించిన చరిత్ర, అన్ని విషయాలు అందులో ఉండేలా చూడాలి. తెలుగు భాష పేద విద్యార్థులకు ఎంత ఉపయోగపడుతుందనే విషయం మరచిపోకూడదు. సిటీల్లో గ్రాడ్యుయేషన్‌ వరకూ చదవాలంటే కొన్ని లక్షల రూపాయలు ఖర్చు అవుతాయి. పల్లె ప్రాంతంలో అయితే దాదాపు ఖర్చు లేకుండానే వాళ్లు చదువుకుంటున్నారు.

కానీ, గ్రాడ్యుయేషన్‌ తర్వాత ఇంజినీరింగ్‌ కావొచ్చు.. కలెక్టర్‌ కావొచ్చు.. ధనిక విద్యార్థులతో పోటీ పడుతున్నారు గ్రామీణ విద్యార్థులు. ఈ శక్తి వారికి ఎలా వచ్చిందంటే తల్లిలా ఉండే తెలుగు భాషవల్లే. తెలుగు భాష వల్ల కొన్ని వేల రూపాయల సబ్సిడీ దొరుకుతోంది. అటువంటి భాషను మనం ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. కులరహిత సమాజం కోసం అందరూ కృషి చేయాలి. పదునైన పదజాలాన్ని పలకడంలో తనకు తానే సాటి అని నిరూపించుకున్నారు మోహన్‌బాబుగారు. డైలాగులంటే ఎన్టీఆర్‌ తర్వాత గుర్తుకు వచ్చే వ్యక్తి మోహన్‌బాబుగారే’’ అన్నారు.

తెలంగాణ రాష్ట్ర శాసనసభ స్పీకర్‌ మధుసూదనాచారి మాట్లాడుతూ– ‘‘మోహన్‌బాబు నటన అద్భుతం. ఐదు తరాల ప్రేక్షకుల అభిమానం సొంతం చేసుకున్న ఆయన ‘విశ్వ నట సార్వభౌమ’ అవార్డుకు సంపూర్ణ అర్హులు’’ అన్నారు. తెలంగాణ శాసనమండలి చైర్మన్‌ స్వామి గౌడ్‌ మాట్లాడుతూ– ‘‘మోహన్‌బాబుగారి సినిమాలు భారతీయులు.. ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్ర ప్రజల గుండెల్లో చెక్కబడి ఉంటాయని చెప్పగలను. ఆయన జీవితం అంతా కళారంగానికే అంకితం చేశారు’’ అన్నారు. సుబ్బరామిరెడ్డి మాట్లాడుతూ– ‘‘మోహన్‌బాబు 42 ఏళ్లలో 600 చిత్రాలకు పైగా నటించారు.

భారతదేశ చలనచిత్ర రంగంలో విలన్‌గా ఉండి హీరో అయ్యి 150 సినిమాలు (హీరోగా) చేసిన ఘనత మోహన్‌బాబుది. ఎంత గొప్ప నటుడో అంత ఖలేజా, దమ్ము ఉన్న మనిషి. 14వేల మంది విద్యార్థులున్న కాలేజీ పెట్టి 4వేల మందికి ఉచితంగా విద్య అందిస్తున్నారు. అటువంటి మోహన్‌బాబుని ‘విశ్వ నట సార్వభౌమ’ అవార్డుతో సత్కరించుకోవడం సంతోషం’’ అన్నారు. అవార్డు గ్రహీత మోహన్‌బాబు మాట్లాడుతూ– ‘‘మంచి వ్యక్తి అయిన విద్యాసాగర్‌ రావు నా ఆత్మీయులు కావడం సంతోషం.

ఓరుగల్లు అంటే వరంగల్‌.. పౌరుషాల గడ్డ. ఆ ప్రాంతం గురించి నాకు పెద్దగా తెలియదు కానీ. కులమతాలకు అతీతంగా తెలుగు వారంతా కలిసి మెలసి ఉండాలని పోరాడిన వీర వనిత రుద్రమదేవి గురించి తెలుసు. డబ్బున్న వాళ్లు ఎందరో ఉంటారు. అందరికీ ఇటువంటి కార్యక్రమాలు చేయాలనే ఆలోచన రాదు. పూర్వం రాజులు చేసేవారు.  ఇప్పుడు సుబ్బరామిరెడ్డిగారు చేస్తున్నారు. ఎన్నో కష్ట నష్టాలు ఎదుర్కొని నేనీ స్థాయికి వచ్చా. భక్తవత్సలం నాయుడు అయిన నన్ను మా గురువు దాసరిగారు మోహన్‌బాబుగా మార్చారు.

1982లో శ్రీ లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్‌ని స్థాపించి అన్నగారు ఎన్టీఆర్‌తో కొబ్బరికాయ కొట్టించాను. 1992లో నా ఆస్తులు తాకట్టు పెట్టి ‘మేజర్‌ చంద్రకాంత్‌’ సినిమా తీస్తే అది సిల్వర్‌ జూబ్లీ హిట్‌ అయింది. మళ్లీ అన్నగారిని ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోబెట్టా. ఆ మహానుభావుడు నన్ను రాజ్యసభకు పంపారు. అందరికీ కోపం ఉంటుంది. కానీ, నాకు ఎక్కువ ఉంటుంది. ‘తన కోపమే తన శత్రువు’ అన్నట్టు నా కోపం నాకు నష్టాన్ని కలిగించిందే తప్ప ఎవరికీ నష్టం కలిగించలేదు’’ అన్నారు.

హీరో బాలకృష్ణ మాట్లాడుతూ– ‘‘ఇప్పటికీ లలిత కళలు బతికి ఉన్నాయంటే సుబ్బరామిరెడ్డిగారిలాంటి వారివల్లే. ‘కాకతీయ కళా పరిషత్‌’ స్థాపించిన తొలిసారి మోహన్‌బాబుగారిని సత్కరించుకోవడం మా చలనచిత్ర రంగాన్ని సన్మానించడంగా నేను భావిస్తున్నా’’ అన్నారు. హాస్య నటుడు బ్రహ్మానందం మాట్లాడుతూ– ‘‘ఏ నుంచి జెడ్‌ వరకూ మోహన్‌బాబుగారికి అభిమానులే’’ అన్నారు. ఈ సందర్భంగా దివంగత నటులు టీఎల్‌  కాంతారావు కుటుంబానికి సుబ్బరామిరెడ్డి రూ.5 లక్షలు ఆర్థిక సాయం అందజేశారు.

పలువురు కళాకారులను ఈ వేదికపై సత్కరించారు. దర్శకులు కె.రాఘవేంద్రరావు, కోదండరామిరెడ్డి, బి.గోపాల్, హీరోలు మంచు విష్ణు, మనోజ్, నటులు అలీ, సంగీత దర్శకుడు కోటి, నటీమణులు జయప్రద, జయసుధ, మంచు లక్ష్మి, హీరోయిన్లు శ్రియ, ప్రగ్యా జైస్వాల్, ఎంపీ జితేందర్‌ రెడ్డి, ఎమ్మెల్యేలు కిషన్‌రెడ్డి, ఎర్రబెల్లి దయాకరరావు, డీకే అరుణ, ఎమ్మెల్సీ షబ్బీర్‌ హుస్సేన్‌తో పాటు డి.శ్రీనివాస్, దానం నాగేందర్, గీతారెడ్డి, పొంగులేటి సుధాకర్‌రెడ్డి వంటి రాజకీయ ప్రముఖులు పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement