నేను.. నా కథ!
తెలంగాణ ఆకాంక్ష.. అక్షరబద్ధం
►ఆత్మకథ రాస్తున్న సీఎం కేసీఆర్
►ఉద్యమం నుంచి రాష్ట్రావిర్భావం దాకా..
►పుస్తకంలో అనేక కీలక ఘట్టాలు, మలుపులు
►రాజకీయ ప్రస్థానంపై పూర్తి వివరాలు.. పూర్వీకుల స్థానికతపై వివరణ
►సహకారం అందిస్తున్న స్పీకర్ మధుసూదనాచారి
►సంచలనాత్మకంగా నిలుస్తుందంటున్న గులాబీ నేతలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ నుడికారంతో ఆయన మాట్లాడే ప్రతీ మాటా.. పేలే ఒక తూటా ! పల్లెజనం భాషలో వారి మనసుల్లోకి సూటిగా విషయాన్ని చేర్చగల మాటల మాంత్రికుడు.. కటువైన పదజాలం వాడకుం డానే విమర్శలు ఎక్కుపెట్టే నేర్పరితనం.. సమ కాలీన రాజకీయాల్లో సంచలన నేతగా పేరు పడిన ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు మరో సంచలనానికి తెరలేపనున్నారు. టీఆర్‌ఎస్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకా రం.. సీఎం ఆత్మకథ రాసే పనిలో ఉన్నారు. తెలంగాణ ఉద్యమ అనుభవాలు, పోరాటం, కలిసొచ్చిన దోస్తులు.. మధ్యలో చేయిచ్చిన నేస్తాలు.. తన పుట్టుక.. బాల్యం, రాజకీయ అరంగేట్రం.. కాంగ్రెస్, టీడీపీల్లో తన రాజకీయ జీవితం.. ఆ పార్టీలను వీడటానికి దారి తీసిన పరిస్థితులు.. టీఆర్‌ఎస్ ఏర్పాటు.. ప్రత్యేక రాష్ట్ర పోరాటం.. పూర్వీకుల స్థానికతపై నడిచిన వివాదం.. హస్తిన రాజకీయాలు.. సోనియాతో ఒప్పందాలు.. ఇలా ఒక్కటేమిటి ఎన్నో కీలక మలుపులకు అక్షర రూపం ఇవ్వ నున్నారు. ఈ క్రతువులో టీఆర్‌ఎస్ ఆవిర్భావం నుంచి కేసీఆర్‌తో కలిసి నడిచిన శాసన సభ స్పీకర్ ఎస్.మధుసూదనాచారి రచనా సహకా రం అందిస్తున్నారని సమాచారం. తెలంగాణ పోరాట నేపథ్యంలోనే కేసీఆర్ ఆత్మకథ రాస్తు న్నారని, ఇందులో ఇప్పటిదాకా వెలుగు చూడని అనేక అంశాలపై తన మనోగతాన్ని కుండబద్దలు కొట్టనున్నారని అంచనా.
వంశవృక్షంపై పూర్తి సమాచారం
తెలంగాణ ఉద్యమంలో స్థానిక–స్థానికేతర అంశాల చర్చ జరిగినప్పుడు .. కేసీఆర్ తాతలు విజయనగరం నుంచి వచ్చారన్న ప్రచారం విస్తృతంగా జరిగింది. తన పూర్వీకుల స్థాని కతపై పూర్తిస్థాయిలో వివరణ ఇచ్చేందుకు ‘వంశ వృక్షం’ పూర్తి వివరాలను పుస్తకంలో పొందుపరుస్తున్నారని సమాచారం. కాంగ్రెస్ లో రాజకీయ ఓనమాలు దిద్దుకున్న కేసీఆర్ తర్వాత టీడీపీలో ప్రజాప్రతినిధిగా పూర్తిస్థాయి రాజకీయ జీవితం మొదలు పెట్టారు. మంత్రి పదవి దక్కనందుకే టీడీపీ నుంచి బయటకు వచ్చి టీఆర్‌ఎస్ పెట్టారని పెద్ద ఎత్తున ప్రచా రం జరిగింది. తాను టీడీపీ నుంచి బయటకు ఎందుకు రావాల్సి వచ్చింది? టీఆర్‌ఎస్ ఆవి ర్భావానికి దారితీసిన పరిస్థి తులను ఆత్మ కథలో వివరించనున్నారు. పద్నా లుగేళ్ల పాటు అడ్డంకులు, ఆటుపోట్లు ఎదుర్కొంటూ నడిపిన తెలంగాణ ఉద్యమంలో అనేక మలు పులు, రాజకీయ వ్యూహాలు, ఎత్తు గడలు, ఫలి తాలు, విఫల ప్రయోగాలు, గుణ పాఠాలను సవివరంగా పొందుపరుస్తున్నారని తెలిసింది.
సమకాలీన తెలంగాణ ఉద్యమకారులు ఎంత గా ఆయన వ్యూహాల్ని వేలెత్తి చూపినా.. గత పోరాటాలకు భిన్నంగా పూర్తిగా ‘లాబీయింగ్ ’ మంత్రాన్ని నూటికి నూరుశాతం నమ్మడం, అందుటో భాగంగానే నాడు కేంద్రంలో అధికా రంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ నేతలు, ఆ పార్టీ అధినేత సోనియాగాంధీ వద్ద జరిపిన మం త్రాంగం, ఢిల్లీ పెద్దలతో సంబంధాలు.. ఏకాభి ప్రాయం సాధనలో ప్రాంతీయ పార్టీ నేతల మద్దతు కోరడం, ఇందులో కలిసొచ్చిన వారు, చివరల్లో చేయిచ్చిన వారు.. తదితర అంశాలకు అక్షర రూపం ఇస్తున్నారని చెబుతున్నారు. తెలంగాణ పోరాట చరిత్రలో దాగున్న అనేక చీకటి కోణాలను బయట పెట్టడంతో పాటు.. రాష్ట్రావిర్భావం తర్వాత ‘బంగారు తెలంగాణ’ నిర్మాణం కోసం ప్రణాళికలు, చేసిన కసరత్తు తదితరాలకు కేసీఆర్ ఆత్మకథలో చోటు ఉంటుందం టున్నారు. తమ అధినేత రాస్తున్న ఆత్మకత కచ్చితంగా సంచలనాత్మకమవుతుందని గులాబీ నేతలు చెబుతున్నారు.