అపర కోటీశ్వరుడు, తిరుగులేని విజయం సాధించిన కార్పొరేట్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ (Bill Gates) ఇటీవల వార్తల్లో నిలిచారు. మెలిందా ఫ్రెంచ్ నుండి విడాకులు తీసుకున్న దాదాపు నాలుగు సంవత్సరాల తర్వాత, బిల్ గేట్స్ ఇటీవల ది టైమ్స్ ఆఫ్ లండన్‌తో మాట్లాడుతూ తన నిర్ణయం పట్ల చింతిస్తున్నానని చెప్పారు. అయితే గతం నుంచి బయటకు వచ్చినట్లు కనిపిస్తున్నారు. దాతృత్వవేత్త పౌలా హర్డ్‌తో (Paula Hurd) ఆయన బంధంలో కొనసాగుతున్నారు. ఆమెతో ఉన్న సంబంధం గురించి మొదటిసారిగా బిల్ గేట్స్ పెదవి విప్పారు.
తాజాగా ‘టుడే షో’కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పౌలాతో ఉన్న సంబంధాన్ని బిల్‌గేట్స్ బయటపెట్టారు. "పౌలా వంటి సీరియస్ గర్ల్‌ఫ్రెండ్ ఉండటం నా అదృష్టం. మేము సరదాగా గడుపుతున్నాం. ఒలింపిక్స్‌కు వెళ్తున్నాం. ఇంకా మరెన్నో" అంటూ పేర్కొన్నారు. బిల్ గేట్స్ పౌలా హర్డ్ గురించి బహిరంగంగా మాట్లాడటం ఇదే మొదటిసారి అయినప్పటికీ, ఈ జంట తరచుగా అనేక కార్యక్రమాలలో కలిసి కనిపించారు.
ఎవరీ పౌలా హర్డ్?
పౌలా హర్డ్ (62)ను పౌలా కలుపా అని కూడా పిలుస్తారు. ఇది ఈమె తొలి పేరు. పౌలా గతంలో ఒరాకిల్ సీఈవో మార్క్ హర్డ్‌ను వివాహం చేసుకోగా 2019లో ఆయన అకాల మరణం చెందారు. పౌలా, మార్క్ వివాహం జరిగి 30 సంవత్సరాలు అయింది. వారికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. పౌలా హర్డ్ పరోపకారి. విద్య, ఆరోగ్య సంరక్షణ రంగాలలో ప్రసిద్ధి చెందారు. కాగా బిల్ గేట్స్, మెలిందా ఫ్రెంచ్ వివాహం 27 సంవత్సరాల క్రితం జరిగింది. వారికి ముగ్గురు సంతానం ఉన్నారు. 2021లో వారు విడాకులు తీసుకున్నారు.
బిల్ గేట్స్ ఆత్మకథ
బిల్ గేట్స్(70) స్వీయ చరిత్ర ‘సోర్స్ కోడ్–మై బిగినింగ్స్’ (Source Code: My Beginnings) తాజాగా అమెరికా మార్కెట్‌లోకి విడుదలైంది. మైక్రోసాఫ్ట్ కంపెనీ స్థాపించి 50 ఏళ్లవుతోంది. అదేవిధంగా, తన తండ్రి శత జయంతి సంవత్సరం. ఈ సందర్భాన తన ఎదుగుదలకు కారణమైన తల్లిదండ్రులు, బాల్య స్నేహితుల గురించీ చెప్పాలనిపించినట్లు ఒక సందర్భంలో ఆయనే చెప్పారు.
తన సమకాలికులతో పోలిస్తే బిల్ గేట్స్ ఎప్పుడూ కొన్ని దశాబ్దాలకు ముందు వెళ్లి ఆలోచిస్తారని చాలా మంది అంటుంటారు. అటువంటిది, ఆత్మ కథ కోసం ఆయన కొన్ని దశాబ్దాలు వెనక్కి వెళ్లారు. ఒక మనిషి ఎదుగుదల లేదా పతనాలకు కుటుంబం ప్రభావం ఎలా ఉంటుందో గేట్స్ ఈ పుస్తకంలో వివరించారు. తన స్వీయ రేఖా చిత్రం తాలూకూ స్కెచ్ ఎంతో శ్రద్ధగా గీసి, దానికి అవసరమైన రంగులద్ది ఎంతో ప్రతిభావంతంగా రూపొందించిన పెయింటింగ్‌లా ఉంది ఈ స్వీయచరిత్ర.
తన తండ్రి గేట్స్ సీనియర్ కుటుంబం, సమాజం అంటే ఎంతో నిబద్ధతతో ఉండేవారని ఆయన గుర్తు చేసుకున్నారు. పిల్లలంటే ఎంతో దయతో ప్రేమతో వ్యవహరించేవారని చెప్పారు. ఆయనకు ఒకే ఒకసారి బాగా కోపం వచ్చిందట. అది కూడా తన లోపమేనంటారు బిల్ గేట్స్. డైనింగ్ టేబుల్ దగ్గర ఏదో విషయమై మూర్ఖంగా వాదించేసరికి ఉండబట్టలేక ఆయన గ్లాసులో ఉన్న నీటిని బిల్ గేట్స్‌పై ముఖంపై చిమ్మారట. వెంటనే ‘థాంక్స్ ఫర్ ది షవర్స్’అంటూ బిల్ అక్కడి నుంచి వెళ్లిపోయారట.
ఈ ఘటనను గుర్తు చేసుకుంటూ ఎప్పుడూ శాంతంగా ఉండే తన తండ్రి తన ప్రవర్తన ద్వారా సహనం కోల్పోయేలా చేశానని బిల్ రాశారు. ఎక్కడికి వెళ్లినా పెద్ద వాళ్లతో చొరవగా మాట్లాడటం, వారిని ప్రశ్నలతో వేధించడం, సంతృప్తి కరమైన జవాబు వచ్చే వరకు ప్రశ్నల పరంపరను కొనసాగించడం అలవాటైందని, జీవితంలో ఎదుగుదలకు అది ఎంతగానో తోడ్పడిందని ఆయన చెప్పుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment