మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ గురించి చాలా మందికి తెలిసే ఉంటుంది. ఒకప్పుడు ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడైన ఈయన ప్రస్తుతం నాలుగో స్థానంలో ఉన్నారు. బ్లూమ్‌బెర్గ్ ప్రకారం బిల్‌గేట్స్ సంపద 141 బిలియన్ డాలర్లు. ప్రపంచంలోని సంపన్నులు ఎక్కువ పన్నులు చెల్లించాలని తాను కోరుకుంటున్నట్లు బిల్ గేట్స్ చెప్పారు.
తాజాగా దావోస్‌లో జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్‌లో బిల్‌గేట్స్ మాట్లాడుతూ సంపన్న దేశాలు అభివృద్ధి చెందుతున్న దేశాలకు ఎక్కువ డబ్బును విరాళంగా ఇవ్వాలని పిలుపునిచ్చారు. ఆర్థిక అసమానతలను సరిదిద్దడంలో ఈ చర్య సహాయపడుతుందన్నారు. కాగా ఏడాది క్రితమే ఆయన రెడ్డిట్‌లో తన 'ఆస్క్ మీ ఎనీథింగ్' ఫోరమ్‌లో చేసిన వ్యాఖ్యలో సంపన్నులకు పన్నులు ఎక్కువగా పెంచకపోవడంపై ఆశ్చర్యం వ్యక్తం చేశారు.
సంపద పన్ను విధించాలని ప్రపంచ దేశాలకు పిలుపునిస్తూ 250 మందికి పైగా అల్ట్రా-రిచ్ వ్యక్తులు బహిరంగ లేఖ విడుదల చేసినట్లు బిజినెస్ ఇన్‌సైడర్ నివేదించింది. బ్లూమ్‌బెర్గ్ ఇండెక్స్ ప్రకారం.. ప్రస్తుతం ప్రపంచంలో నాలుగో అత్యంత సంపన్నడైన బిల్‌గేట్స్.. అత్యధిక సంపదను కలిగి ఉన్న దేశాలు, కంపెనీలు, వ్యక్తులు మరింత ఉదారంగా ముందుకు రావాలన్నారు.
అబిగైల్ డిస్నీ, 'సక్సెషన్' నటుడు బ్రియాన్ కాక్స్ వంటి వారు సంతకం చేసిన ఈ బహిరంగ లేఖలో సంపన్నులకు మరింత పన్ను విధించాలని ప్రపంచ దేశాలకు విజ్ఞప్తి చేశారు. అత్యంత సంపన్నులపై అధిక పన్నులు విధించడం వల్ల వారి జీవన ప్రమాణాలపై ఎటువంటి ప్రభావం ఉండదన్నారు.
Comments
Please login to add a commentAdd a comment