
సస్పెండ్ చేయిస్తా..
పేదలకు అన్యాయం చేస్తే సహించేది లేదు
ఎంపీడీఓపై స్పీకర్ ఆగ్రహం
చిట్యాల : స్థానిక ఎంపీడీఓ త్రివిక్రమరావుపై స్పీకర్ సిరికొండ మధుసూదనాచారి ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘మెదడు పని చేస్తలేదా.. డబ్బులు బాగా వసూలు చేస్తున్నావట.. కేసు పెట్టించి.. సస్పెండ్ చేయిస్తా’ అంటూ మండిపడ్డారు. బీసీ కార్పొరేషన్ రుణాల ఎంపికలో ఎంపీడీఓ, చల్లగరిగె కాకతీయ గ్రామీణ బ్యాంకు మేనేజర్ శ్రీనివాస్ మధ్య దళారులతో కుమ్మక్కై పేదలకు అన్యాయం చేశారని నైన్‌పాక గ్రామానికి చెందిన ఈర్ల మల్లక్క, మరికొంత మంది స్పీకర్ దృష్టికి తీసుకెళ్లారు.
ఆశవర్కర్, ఈజీఎస్ ఫీల్డ్ అసిస్టెంట్, ఏఎన్‌ఎం, ఐకేపీ సీఏ, నర్సరీ ఎంపికలో అధికారులు అర్హులకు అన్యాయం చేశారని పలువురు ఏకరువు పెట్టారు. దీంతో స్పీకర్ ఎంపీడీఓపై ఆగ్రహం వ్యక్తం చేశారు. డబ్బు తీసుకుని అర్హులకు అన్యాయం చేస్తే సహించేది లేదని ఘాటుగా హెచ్చరించారు. ఇకనైనా జాగ్రత్తగా ఉండాలని సూచిం చారు.