
‘చిత్రం’పై చిక్కిన అర్చకుడు, సస్పెన్షన్ వేటు
భద్రాచలం రామాలయ అర్చకుడు మధుసూదనాచార్యులుపై సస్పెన్షన్ వేటు పడింది.
భద్రాచలం: భద్రాచలం రామాలయ అర్చకుడు మధుసూదనాచార్యులుపై సస్పెన్షన్ వేటు పడింది. రామాలయం గర్భగుడిలో మూలవిరాట్ ఫొటోలను తీసిన అర్చకుడిని దేవస్థానం అధికారులు గుర్తించారు. అతనిపై సస్పెన్షన్ వేటు వేయడంతో పాటు సరైన పర్యవేక్షణ చేయకపోవడంతోనే ఇలా జరిగిందని భావించి ఆలయ ప్రధాన అర్చకుడితో పాటు మరో ముఖ్య అర్చకుడిని సంజాయిషీ కోరుతూ ఆలయ ఈఓ ప్రభాకర్ శ్రీనివాస్ బుధవారం రాత్రి ఉత్తర్వులు ఇచ్చారు.
గర్భగుడిలోని మూలవరులను సెల్‌ఫోన్‌తో ఫొటోలు తీసి బయటికి పంపించడంతో అవి సామాజిక మాధ్యమాల్లో విస్త్రతంగా చక్కర్లు కొట్టాయి. దీనిపై పత్రికలలో వార్తలు రావడంతో స్పందించిన ఈఓ విచారణకు ఆదేశించారు. ఆలయ సూపరింటెండెంట్ భవాని రామకృష్ణ దీనిపై విచారణ చేపట్టారు.
గర్భగుడిలోని మూలవరులకు బెంగుళూరుకు చెందిన భక్తుడు బంగారు ఆభరణాలు సమర్పించగా వాటిని శుక్రవారం రోజున అలంకరించి భక్తులకు దర్శనం కల్పించారు. ఇప్పటి వరకు మూడు శుక్రవారాలలో మాత్రమే స్వామి వారికి బంగారు కవచాలను అలంకరించగా, ఆయా రోజుల్లో గర్భగుడిలో విధులను నిర్వహించిన అర్చకుల నుంచి విచారణ అధికారి భవాని రామకృష్ణ వివరాలను రాబట్టారు. మూడు శుక్రవారాలలో స్వామి వారి అలంకరణను నిశితంగా పరిశీలించారు. కాగా సెల్‌ఫోన్‌లో బయటకు వచ్చిన ఫొటోలు ఈనెల 16న తీసినట్టుగా గుర్తించారు. ఆ రోజు ఆలయ విధుల్లో ఉన్న మదన్‌మోహనాచార్యులు గర్భగుడిలో మూలవరుల మూర్తులను సెల్‌ఫోన్ ద్వారా తీసినట్లు వెల్లడయింది. దీన్ని తీవ్రంగా పరిగణించిన ఈఓ ఆయనపై సస్పెన్షన్ వేటు విధించారు.
అర్చకుల పనితీరును ఎప్పటికప్పుడు పర్యవేక్షించాల్సిన ప్రధాన అర్చకుడు, మరో ముఖ్య అర్చకుడు ఈ విషయంలో బాధ్యతారాహిత్యంగా వ్యవహరించారని భావించి.. ఇందుకు గల కారణాలపై వివరణ కోరుతూ సంజాయిషీ నోటీసు జారీ చేశారు. ఎంతో పవిత్రంగా భావించే స్వామి వార్ల మూలవరుల ఫొటోను అర్చకుడే సెల్‌ఫోన్ ద్వారా తీసి సామాజిక మాధ్యమాల్లో ఇతరులకు పంపించటంపై భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటువంటి పరిణామాలు మరోసారి జరగకుండా దేవస్థాన అధికారులు కఠినంగా వ్యవహరించాలని కోరుతున్నారు.