
చండీగఢ్: పంజాబ్‌లో జైలు శిక్ష అనుభవిస్తున్న సమయంలో గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ కస్టడీలో ఉండి ఓ టీవీ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూపై రాష్ట్ర హోంశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ఇంటర్వ్యూపై విచారణ జరిపిన పంజాబ్ హోంశాఖ.. ఇంటర్వ్యుకు సహకరించిన పోలీసులు అధికారులపై చర్యలు తీసుకుంది.
అందులో భాగంగా ఇద్దరు డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (డీఎస్పీలు)సహా ఏడుగురు పోలీసు అధికారులను సస్పెండ్ చేసింది. అయితే ఈ ఇంటర్వ్యూ 2023లో పంజాబ్ జైలులో ఖైదీగా ఉన్న సమయంలో జరగటం గమనార్హం. ఈ ఇంటర్వ్యులో పంజాబీ గాయకుడు సిద్ధూ మూసేవాలా హత్యలో లారెన్స్ బిష్ణోయ్ పాత్రపై ప్రశ్నించారు. ఇంటర్వ్యూ ప్రసారమైన అనంతరం సెప్టెంబరు, 2023లో పంజాబ్ , హర్యానా హైకోర్టు ఈ అంశాన్ని సుమోటోగా స్వీకరించింది. పోలీసు కస్టడీలో ఉన్న ఖైదీకి ఇంటర్వ్యూ ఎలా ఏర్పాటు చేశారని మండిపడింది.
ఇక..ఈ సంఘటన పంజాబ్ జైలు వ్యవస్థలో భద్రతా ప్రోటోకాల్‌లకు సంబంధించి తీవ్రమైన ఆందోళనలను లేవనెత్తింది. జైలు నుంచి రికార్డ్ చేసిన ఇంటర్వ్యూను అనుమతించిన వైఫల్యాలపై పోలీసు శాఖ అంతర్గత దర్యాప్తును ప్రారంభించింది.
Comments
Please login to add a commentAdd a comment