న్యూఢిల్లీ: ముంబైలో ఎస్సీపీ నేత బాబా సిద్ధిఖీ హత్య దరిమిలా దీనివెనక లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ హస్తముందనే వార్తలు వినిపిస్తున్నాయి. గ్యాంగ్‌స్టర్లు లారెన్స్ బిష్ణోయ్, గోల్డీ బ్రార్‌లపై జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) విచారణ కొనసాగిస్తోంది. ఈ నేపధ్యంలోనే గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్, గోల్డీ బ్రార్‌తో సహా పలువురు పేరుమోసిన గ్యాంగ్‌స్టర్లపై ఎన్‌ఐఎ ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. ఇందులో పలు కీలక వివరాలున్నాయి.
లారెన్స్ బిష్ణోయ్‌కు సంబంధించిన టెర్రర్ సిండికేట్ మునుపెన్నడూ లేని విధంగా విస్తరించిందని ఎన్‌ఐఏ తన ఛార్జ్ షీట్‌లో పేర్కొంది. దావూద్ ఇబ్రహీం 90వ దశకంలో చిన్న చిన్న నేరాలకు పాల్పడుతూ, తన నెట్‌వర్క్‌ను ఏ విధంగా అభివృద్ధి చేసుకున్నాడో.. అదే మార్గాన్ని లారెన్స్ బిష్ణోయ్ కూడా అనుసరించాడు. దావూద్ ఇబ్రహీం డ్రగ్స్ స్మగ్లింగ్, టార్గెట్ కిల్లింగ్, దోపిడీ రాకెట్‌లతో తన సామ్రాజ్యాన్ని విస్తరించాడు. ఆ తర్వాత పాక్ ఉగ్రవాదులతో పొత్తు పెట్టుకుని, తన నెట్‌వర్క్ విస్తరించాడు. కాగా దావూద్ ఇబ్రహీం ఏర్పాటు చేసిన డి కంపెనీ మాదిరిగానే బిష్ణోయ్ గ్యాంగ్ చిన్న చిన్న నేరాలు చేస్తూ ఇప్పుడు ఆరు దేశాలకు విస్తరించింది.
బిష్ణోయ్ గ్యాంగ్‌లో 700 మందికి పైగా షూటర్లు ఉన్నారని, వారిలో 300 మంది పంజాబ్‌కు చెందినవారని ఎన్‌ఐఎ తెలిపింది. బిష్ణోయ్, గోల్డీ బ్రార్ గ్యాంగ్‌లు సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లను విరివిగా వినియోగించుకుంలాయి. బిష్ణోయ్ ముఠా 2020-21 మధ్యకాలంలో దోపిడీల ద్వారా కోట్లాది రూపాయలు కొల్లగొట్టింది. ఆ డబ్బును హవాలా ద్వారా విదేశాలకు తరలించింది.
ఎన్‌ఐఏ తెలిపిన వివరాల ప్రకారం బిష్ణోయ్ గ్యాంగ్ ఒకప్పుడు పంజాబ్‌కు మాత్రమే పరిమితమైంది. ఆ తరువాత గోల్డీ బ్రార్‌తో జతకట్టి హర్యానా, ఢిల్లీ, రాజస్థాన్ ముఠాలతో పొత్తు పెట్టుకుంది. బిష్ణోయ్ గ్యాంగ్ ప్రస్తుతం ఉత్తర భారతదేశం, పంజాబ్, ఉత్తరప్రదేశ్, హర్యానా, మహారాష్ట్ర, ఢిల్లీ, రాజస్థాన్, జార్ఖండ్‌లలో విస్తరించింది. సామాజిక మాధ్యమాలు, ఇతర పద్ధతుల ద్వారా వీరు యువతను తమ ముఠాలో చేర్చుకుంటారు. ఈ ముఠా అమెరికా, అజర్‌బైజాన్, పోర్చుగల్, అరబ్, రష్యా వరకూ వ్యాపించింది.
కొద్ది రోజుల క్రితం లారెన్స్ బిష్ణోయ్, గోల్డీ బ్రార్ సహా మొత్తం 16 మంది గ్యాంగ్‌స్టర్లపై ఎన్ఐఏ కోర్టులో ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. దానిలోని వివరాల ప్రకారం గోల్డీ బ్రార్ కెనడా, పంజాబ్, ఢిల్లీలో ముఠాలను నిర్వహిస్తున్నాడు. రోహిత్ గోద్రా రాజస్థాన్, మధ్యప్రదేశ్, అరబ్ కంట్రీలోని ముఠాలను పర్యవేక్షిస్తుంటాడు. అన్మోల్ బిష్ణోయ్ పోర్చుగల్, అమెరికా, ఢిల్లీ , మహారాష్ట్ర, బీహార్, పశ్చిమ బెంగాల్‌లకు కమాండ్‌గా ఉన్నాడు. ఈ ముఠాకు ఆయుధాలు మధ్యప్రదేశ్‌లోని మాల్వా, మీరట్, ముజఫర్‌నగర్, యూపీలోని అలీగఢ్, బీహార్‌లోని ముంగేర్, ఖగారియా నుంచి వచ్చి చేరుతుంటాయి. అలాగే పాక్‌లోని పంజాబ్ జిల్లాతో పాటు అమెరికా, రష్యా, కెనడా, నేపాల్ దేశాల నుంచి కూడా ఈ ముఠాకు ఆయుధాలు అందుతుంటాయని ఎన్‌ఐఏ గుర్తించింది.
ఇది కూడా చదవండి: సల్మాన్‌కు దగ్గరైనందుకే సిద్ధిఖీ హత్య?
Comments
Please login to add a commentAdd a comment