జైల్లో లారెన్స్‌ బిష్ణోయ్‌ ఇంటర్యూ: పంజాబ్‌ ప్రభుత్వానికి హైకోర్టు చీవాట్లు | High Court Slams Punjab For Lawrence Bishnoi Jail Interview | Sakshi
Sakshi News home page

జైల్లో లారెన్స్‌ బిష్ణోయ్‌ ఇంటర్యూ: పంజాబ్‌ ప్రభుత్వానికి హైకోర్టు చీవాట్లు

Published Wed, Oct 30 2024 2:49 PM | Last Updated on Wed, Oct 30 2024 3:49 PM

 High Court Slams Punjab For Lawrence Bishnoi Jail Interview

జైల్లో ఉన్న గ్యాంగ్‌స్టర్‌ లారెన్స్‌ బిష్ణోయ్‌తో ఇంటర్వ్యూ ఏర్పాటు చేయడంపై పంజాబ్‌ పోలీసులపై పంజాబ్‌, హర్యానా హైకోర్టు తీవ్రస్థాయిలో మండిపడింది. లారెన్స్ బిష్ణోయ్ భటిండా జైల్లో పోలీసు కస్టడీలో ఉండగా.. వీడియో కాన్ఫరెన్సింగ్‌ ద్వారా ఇంటర్వ్యూ ఇచ్చారు. దీని రెండు విడుతల్లో మార్చి 2023లో ఒక జాతీయ ఛానెల్‌లో ప్రసారం చేశారు.

కాగా జైలు ప్రాంగణంలో ఖైదీలు మొబైల్‌ ఫోన్‌లను వినియోగించడంపై దాఖలైన వ్యాజ్యంపై న్యాయమూర్తులు అనుపిందర్ సింగ్ గ్రేవాల్, జస్టిస్ లపితా బెనర్జీలతో కూడిన ధర్మాసనం బుధవారం తాజాగా విచారణ చేపట్టింది. బిష్ణోయ్‌ ఇంటర్వ్యూ కేసులో సిట్‌ దాఖలు చేసిన రద్దు నివేదిక పోలీసు అధికారులకు, గ్యాంగ్‌స్టర్‌కు మధ్యం సంబంధం ఉందనే అనుమానాలను లేవనెత్తుతందని హైకోర్టు పేర్కొంది. 

‘పోలీసు అధికారులు నేరస్థుడిని ఎలక్ట్రానిక్ పరికరాన్ని ఉపయోగించడానికి అనుమతించారు. ఇంటర్వ్యూను నిర్వహించడానికి స్టూడియో లాంటి సదుపాయాన్ని కల్పించారు. ఇవన్నీ నేరస్థుడికి అందించడం ద్వారా మీరు నేరాన్ని ప్రోత్సహించారు. కావున ఈ కేసులో తదుపరి దర్యాప్తు అవసరం’ అని కోర్టు పేర్కొంది.

బిష్ణోయ్ ఇంటర్వ్యూకు అనుమతించిన సీనియర్ అధికారులపై క్రమశిక్షణా చర్యలకు ఆదేశిస్తూ 2024 ఆగస్టు నాటి ఉత్తర్వును పాటించడంలో విఫలమైనందుకు పంజాబ్ ప్రభుత్వాన్ని కోర్టు  మందలించింది.  అంతేగాక సస్పెండ్ చేసిన ఏడుగురు అధికారులలో ఐదుగురు జూనియర్ ర్యాంక్‌కు చెందినవారేననిని, కేవలం ఇద్దరే డిప్యూటీ సూపరింటెండెంట్ ర్యాంక్‌ అధికారులని తెలిపింది. ఈ మేరకు మానవ హక్కుల కమిషన్ చీఫ్ ప్రబోధ్ కుమార్ నేతృత్వంలోని ముగ్గురు సభ్యుల బృందంతో తాజా దర్యాప్తునకు హైకోర్టు ఆదేశించింది.

ఇదిలా ఉండగా  జైల్లో బిష్ణోయ్‌ ఇంటర్వ్యూకి సహకారం పోలీసు కస్టడీలో ఉన్న గ్యాంగ్‌స్టర్‌ లారెన్స్‌ బిష్ణోయ్‌ టీవీ ఇంటర్వ్యూ ఇచ్చేందుకు అవకాశం ఇచ్చిన ఇద్దరు డీఎస్పీలు సహా ఏడుగురు పోలీసు అధికారులను పంజాబ్‌ ప్రభుత్వం సస్పెండ్‌ చేసిన సంగతి తెలిసిందే.  2022 సెప్టెంబరు 3, 4 తేదీల్లో పోలీస్‌ కస్టడీలో ఉండగా లారెన్స్‌ వీడియో కాన్ఫరెన్సింగ్‌ ద్వారా ఓ ప్రైవేట్‌ టీవీ చానల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చినట్లు, ఈ ఇంటర్వ్యూ రెండు భాగాలుగా గత ఏడాది మార్చిలో ప్రసారమైనట్లు సిట్‌ ధ్రువీకరించింది. దీంతో పంజాబ్‌ హోం శాఖ కార్యదర్శి గుర్‌కిరత్‌ కిర్పాల్‌ సింగ్‌ ఈ నెల 25న ఈ అధికారులను సస్పెండ్‌ చేస్తూ ఆదేశాలు ఇచ్చారు.

 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement