punjab Haryana highcourt
-
జైల్లో లారెన్స్ బిష్ణోయ్ ఇంటర్యూ: పంజాబ్ ప్రభుత్వానికి హైకోర్టు చీవాట్లు
జైల్లో ఉన్న గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్‌తో ఇంటర్వ్యూ ఏర్పాటు చేయడంపై పంజాబ్ పోలీసులపై పంజాబ్, హర్యానా హైకోర్టు తీవ్రస్థాయిలో మండిపడింది. లారెన్స్ బిష్ణోయ్ భటిండా జైల్లో పోలీసు కస్టడీలో ఉండగా.. వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా ఇంటర్వ్యూ ఇచ్చారు. దీని రెండు విడుతల్లో మార్చి 2023లో ఒక జాతీయ ఛానెల్లో ప్రసారం చేశారు.కాగా జైలు ప్రాంగణంలో ఖైదీలు మొబైల్ ఫోన్లను వినియోగించడంపై దాఖలైన వ్యాజ్యంపై న్యాయమూర్తులు అనుపిందర్ సింగ్ గ్రేవాల్, జస్టిస్ లపితా బెనర్జీలతో కూడిన ధర్మాసనం బుధవారం తాజాగా విచారణ చేపట్టింది. బిష్ణోయ్ ఇంటర్వ్యూ కేసులో సిట్ దాఖలు చేసిన రద్దు నివేదిక పోలీసు అధికారులకు, గ్యాంగ్‌స్టర్‌కు మధ్యం సంబంధం ఉందనే అనుమానాలను లేవనెత్తుతందని హైకోర్టు పేర్కొంది. ‘పోలీసు అధికారులు నేరస్థుడిని ఎలక్ట్రానిక్ పరికరాన్ని ఉపయోగించడానికి అనుమతించారు. ఇంటర్వ్యూను నిర్వహించడానికి స్టూడియో లాంటి సదుపాయాన్ని కల్పించారు. ఇవన్నీ నేరస్థుడికి అందించడం ద్వారా మీరు నేరాన్ని ప్రోత్సహించారు. కావున ఈ కేసులో తదుపరి దర్యాప్తు అవసరం’ అని కోర్టు పేర్కొంది.బిష్ణోయ్ ఇంటర్వ్యూకు అనుమతించిన సీనియర్ అధికారులపై క్రమశిక్షణా చర్యలకు ఆదేశిస్తూ 2024 ఆగస్టు నాటి ఉత్తర్వును పాటించడంలో విఫలమైనందుకు పంజాబ్ ప్రభుత్వాన్ని కోర్టు మందలించింది. అంతేగాక సస్పెండ్ చేసిన ఏడుగురు అధికారులలో ఐదుగురు జూనియర్ ర్యాంక్‌కు చెందినవారేననిని, కేవలం ఇద్దరే డిప్యూటీ సూపరింటెండెంట్ ర్యాంక్ అధికారులని తెలిపింది. ఈ మేరకు మానవ హక్కుల కమిషన్ చీఫ్ ప్రబోధ్ కుమార్ నేతృత్వంలోని ముగ్గురు సభ్యుల బృందంతో తాజా దర్యాప్తునకు హైకోర్టు ఆదేశించింది.ఇదిలా ఉండగా జైల్లో బిష్ణోయ్ ఇంటర్వ్యూకి సహకారం పోలీసు కస్టడీలో ఉన్న గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ టీవీ ఇంటర్వ్యూ ఇచ్చేందుకు అవకాశం ఇచ్చిన ఇద్దరు డీఎస్పీలు సహా ఏడుగురు పోలీసు అధికారులను పంజాబ్ ప్రభుత్వం సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. 2022 సెప్టెంబరు 3, 4 తేదీల్లో పోలీస్ కస్టడీలో ఉండగా లారెన్స్ వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా ఓ ప్రైవేట్ టీవీ చానల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చినట్లు, ఈ ఇంటర్వ్యూ రెండు భాగాలుగా గత ఏడాది మార్చిలో ప్రసారమైనట్లు సిట్ ధ్రువీకరించింది. దీంతో పంజాబ్ హోం శాఖ కార్యదర్శి గుర్కిరత్ కిర్పాల్ సింగ్ ఈ నెల 25న ఈ అధికారులను సస్పెండ్ చేస్తూ ఆదేశాలు ఇచ్చారు. -
Supreme Court: అనవసర మాటలొద్దు
న్యూఢిల్లీ: గతంలో సుప్రీంకోర్టు ఇచి్చన ఉత్తర్వులను ఉద్దేశిస్తూ పంజాబ్ హరియాణా హైకోర్టు న్యాయమూర్తి చేసిన వ్యాఖ్యలపై సర్వోన్నత న్యాయస్థానం తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసింది. ఎగువ కోర్టు పట్ల ఎనలేని గౌరవం చూపాలని, న్యాయ క్రమశిక్షణ పాటించాలని హితవు పలికింది. హరియాణాలోని గుర్గావ్లో ఒక భూవివాదానికి సంబంధించిన కేసులో మే మూడో తేదీన సుప్రీంకోర్టు ఒక ఉత్తర్వులు జారీచేసింది. అయితే జూలై 17వ తేదీన ఒక కేసును విచారిస్తున్న సందర్భంగా పంజాబ్, హరియాణా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రాజ్బీర్ సహరావత్ సుప్రీంకోర్టును విమర్శించారు. ‘‘ హైకోర్టుల అధికారాలకు సుప్రీంకోర్టు యథాలాపంగా అడ్డు తగులుతోంది. ఇక తామే ‘సుప్రీం’ అన్నట్లుగా సుప్రీంకోర్టులో విపరీత ధోరణి కనిపిస్తోంది’’ అని జడ్జి సహరావత్ అన్నారు. అయితే ఆరోజు హైకోర్టులో కేసు విచారణ ప్రత్యక్ష ప్రసారం కావడంతో సంబంధిత వీడియో వైరల్‌గా మారింది. విషయం తెల్సుకున్న సుప్రీంకోర్టు ఈ అంశాన్ని సూమోటోగా స్వీకరించింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ హృషికేశ్ రాయ్‌ల ప్రత్యేక ధర్మాసనం ఈ అంశాన్ని బుధవారం విచారించింది. ‘‘ కింద కోర్టులు సుప్రీంకోర్టు తీర్పులను శిరసావహించాల్సిందే. ఇందులో వేరే ఆప్షన్ ఎంచుకునే అవకాశమే లేదు. ఎందుకంటే ఇది రాజ్యాంగబద్ధ విధి నిర్వహణ. కోర్టుల్లో తీర్పులపై పిటిషనర్లు, కక్షిదారులు అసంతృప్తి వ్యక్తంచేయొచ్చుగానీ జడ్జీలు తమ సొంత వ్యాఖ్యానాలు చేయకూడదు. దేశంలో ఇక ఏ న్యాయస్థానంలోనూ ఇలాంటివి పునరావృతం కాబోవని భావిస్తున్నాం. కేసు విచారణల ప్రత్యక్ష ప్రసారాల కాలంలో జడ్జీలు ఏవైనా వ్యాఖ్యానాలు చేసేటపుడు సంయమనం పాటించాలి. అనవసర మాటలొద్దు’’ అని హైకోర్టు జడ్జికి ధర్మాసనం మౌఖిక ఆదేశాలిచి్చంది. జిల్లా కోర్టులు మొదలు హైకోర్టు, సుప్రీంకోర్టు దాకా రాజ్యాంగంలోని ప్రతి అంగంలోనూ క్రమశిక్షణ అనేది కొనసాగాలని ధర్మాసనం వ్యాఖ్యానించింది. హైకోర్టు జడ్జి వ్యాఖ్యలు ఖచి్చతంగా కోర్టు ధిక్కారమేనని పేర్కొన్న సుప్రీంకోర్టు.. ఆ జడ్జిపై చర్యలు తీసుకునేందుకు మాత్రం నిరాకరించింది. -
సుప్రీంకోర్టుపై హైకోర్టు జడ్జి విమర్శలు.. నేడు విచారించనున్న సీజేఐ
న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు విచిత్ర పరిస్థితిని ఎదుర్కోనుంది. తనకు సంబంధించిన కేసును తానే విచారించనుంది. పంజాబ్ హర్యానా హైకోర్టు జడ్జి జస్టిస్ షెరావత్ తమపై చేసిన విమర్శలను చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్‌తో కూడిన ఐదుగురు సభ్యుల ధర్మాసనం బుధవారం(ఆగస్టు7) విచారించనుంది. హైకోర్టు జడ్జి వ్యాఖ్యలపై సుప్రీంకోర్టు ఎలా స్పందించనుందనేది సర్వత్రా ఆసక్తిగా మారింది. ఓ కోర్టు ధిక్కార కేసులో తానిచ్చిన ఆదేశాలపై సుప్రీం స్టే ఇవ్వడంపై పంజాబ్ హర్యానా హైకోర్టు జడ్జి షెరావత్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. సుప్రీం కోర్టు తనను కాస్త ఎక్కువ ఊహించుకుంటోందని, అదే సమయంలో హైకోర్టును కాస్త తక్కువ అనుకుంటోందని వ్యాఖ్యానించారు.సుప్రీంకోర్టుకు రాజ్యాంగంలో ప్రత్యేక స్థాయి ఉందని, ఎప్పుడు పడితే ఎలా పడితే అలా ఆదేశాలిచ్చేందుకు వీలు లేదని అన్నారు. పంజాబ్ హర్యానా హైకోర్టు జడ్జి జస్టిస్ షెరావత్ చేసిన ఈ వ్యాఖ్యల అంశాన్ని సుప్రీంకోర్టు మంగళవారమే సుమోటోగా విచారణకు స్వీకరించింది. -
శంభు సరిహద్దును తెరవండి.. హర్యానాకు హైకోర్టు ఆదేశాలు
చండీగఢ్: శంభు సరిహద్దును వారం రోజుల్లోగా తెరవాలని పంజాబ్, హర్యానా రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టు బుధవారం హర్యానా ప్రభుత్వాన్ని ఆదేశించింది. పంజాబ్-హర్యానాలను కలిపే ఈ శంభు సరిహద్దు వద్ద ఫిబ్రవరి 13న రైతులు భారీగా నిరసనలను ప్రారంభించడంతో హర్యానా ప్రభుత్వం దీనిని మూసివేసింది. గత అయిదు నెలలుగా ఈ సహరిహద్దు మూసే ఉంది. అదే విధంగా రాష్ట్రంలో శాంతి భద్రతలను కాపాడాలని రైతు సంఘాలను హైకోర్టు కోరింది.శంభు సరిహద్దు వెంబడి పబ్లిక్ ప్రజల రాకపోకలు, వాహనాలను అనుమతించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ జూలై 6న పంజాబ్- హర్యానా హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు అయ్యింది. దీనిపై నేడు విచారణ చేపట్టిన హైకోర్టు వారం రోజుల్లో శంభు సరిహద్దును తెరవాలని హర్యానా ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఇది రాజధాని న్యూఢిల్లీని పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కశ్మీర్‌లను కలుపుతున్నందున మూసివేయడం వల్ల సామాన్య ప్రజలకు చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయి.జూలై 3న నిరసన వ్యక్తం చేస్తున్న రైతులను ఒప్పించాలని హర్యానా రవాణా మంత్రి అసీమ్ గోయెల్ కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌ను కోరారు. అసీమ్ గోయెల్ మాట్లాడుతూ.., “రైతులు అంబాలా జిల్లా సరిహద్దులో ఉన్న శంభు గ్రామం దగ్గర అయిదున్నర నెలల క్రితం ఆందోళనను ప్రారంభించిన తర్వాత జాతీయ రహదారిపై ట్రాఫిక్ నిలిచిపోయింది. రైతుల ఆందోళన ప్రారంభమైనప్పటి నుంచి ఈ సరిహద్దు మూసివేశారు. ఇది సాధారణ ప్రజలకు అసౌకర్యాన్ని కలిగించింది. ముఖ్యంగా అంబాలాలోని వ్యాపారవేత్తలు తమ వ్యాపారం నిర్వహించడంలో ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. కేంద్ర ప్రభుత్వం ఆందోళన చేస్తున్న రైతులతో చర్చలు జరిపి శంభు సరిహద్దు గుండా రహదారిని తెరవడానికి వారిని శాంతింపజేయాలి. ఇది సమీపంలో నివసించే ప్రజలకు ఉపశమనం కలిగిస్తుంది, అలాగే ఇది వ్యాపారవేత్తలు తమ పనిని నిర్వహించడానికి సులభతరం చేస్తుంది” అని పేర్కొన్నారుఅయితే రైతులు రహదారిని దిగ్బంధించలేదని, ఫిబ్రవరిలో బారికేడ్లు వేసి తమ ఢిల్లీ చలో మార్చ్‌ను ప్రభుత్వమే ఆపిందని కిసాన్ మజ్దూర్ మోర్చా నాయకుడు సర్వన్ సింగ్ పంధేర్ తెలిపారు. తమ డిమాండ్లను ఆమోదించాలని ప్రభుత్వంపై ఒత్తిడి చేసేందుకు రైతులు ఢిల్లీ చలో మార్చ్ ప్రారంభించినట్లు పేర్కొన్నారు. ఫిబ్రవరి 13 నుంచి తమ పాదయాత్రను భద్రతా దళాలు అడ్డుకోవడంతో రైతులు పంజాబ్, హర్యానా మధ్య శంభు, ఖనౌరీ సరిహద్దు పాయింట్ల వద్ద నిరసనలు చేస్తున్నారని చెప్పారు. -
ఆమ్ ఆద్మీ పార్టీకి షాక్.. తజీందర్ బగ్గాకు రిలీఫ్
చండీగఢ్: ఆమ్ ఆద్మీ పార్టీకి పంజాబ్, హర్యానా హైకోర్టు షాక్ ఇచ్చింది. బీజేపీ నేతలు తజీందర్ సింగ్ బగ్గా, కుమార్ విశ్వాస్‌లపై నమోదైన ఎఫ్ఐఆర్లను కొట్టివేసింది. వారు తమ హక్కులు, రాజకీయ హోదాకు అనుగుణంగానే మాట్లాడారని, కేజ్రీవాల్‌పై విమర్శలు రాజకీయపరమైనవేనని స్పష్టం చేసింది. ఈమేరకు బుధవారం తీర్పు వెలువరించింది. ఆప్ మాజీ నేతలైన తజీందర్ బగ్గా, కుమార్ విశ్వాస్ కొద్ది రోజుల క్రితం ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారు. ది కశ్మీర్ ఫైల్స్ చిత్రానికి ఢిల్లీలో పన్ను మినాహాయింపు ఇవ్వకపోవడాన్ని తప్పుబడుతూ తీవ్ర విమర్శలు గుప్పించారు. ఈ నేపథ్యంలోనే వీరిపై పంజాబ్ పోలీసులు కేసు నమోదు చేశారు. దీన్ని ఇద్దరూ హైకోర్టులో సవాల్ చేయగా.. న్యాయస్థానం అనుకూలంగా తీర్పునిచ్చింది. తీర్పు అనంతరం తజీందర్ బగ్గా స్పందించారు. సత్యమే గెలుస్తుందని నిరూపితమైందని, అరవింద్ కేజ్రీవాల్‌కు ఇది చెంపపెట్టులాంటి తీర్పు అని విమర్శలు గుప్పించారు. చదవండి: నిప్పంటించుకోబోయిన భార్యాభర్తలు.. రెప్పపాటులో.. -
‘వివాహేతర సంబంధం ఉన్నంత మాత్రాన చెడ్డ తల్లి కాదు’
చండీగఢ్: చెడ్డ మహిళ ఉంటుంది కానీ.. చెడ్డ తల్లి ఉండదని పెద్దల మాట. పేగు తెంచుకుని పుట్టిన బిడ్డల కోసం తల్లి ఏమైనా చేస్తుంది. సమాజం హర్షించనప్పటికి.. బిడ్డల బాగు కోసం ఆమె ఏం చేయడానికికైనా సిద్ధ పడుతుంది. తాజాగా పంజాబ్, హరియాణా కోర్టు కూడా ఇవే వ్యాఖ్యలు చేసింది. వివాహేతర సంబంధం ఉన్నంత మాత్రాన ఓ మహిళను చెడ్డ తల్లిగా పరిగణించలేము అని వ్యాఖ్యనించడమే కాక నాలుగున్నరేళ్ల కుమార్తె కస్టడీని తల్లికి అప్పగించింది. వివాహేతర సంబంధం ఉందని ఆరోపిస్తూ.. భర్త తన దగ్గర నుంచి కుమార్తెను బలవంతంగా తీసుకెళ్లడంతో పంజాబ్‌కు చెందిన ఓ మహిళ హెబియస్ కార్పస్ పిటీషన్ దాఖలు చేసింది. దీని విచారణ సందర్భంగా జస్టిస్ అనుపిందర్ సింగ్ గ్రెవాల్ మాట్లాడుతూ.. ‘‘పితృస్వామ్య వ్యవస్థలో స్త్రీ నైతిక స్వభావంపై నిందలు మోపడం చాలా సహజం. ఎలాంటి ఆధారం లేకుండా మహిళ వ్యక్తిత్వంపై బురద జల్లుతారు. స్త్రీకి వివాహేతర సంబంధం ఉన్నా.. ఉందని ఊహించినా.. దాన్ని ఆధారంగా చేసుకుని ఆమెను మంచి తల్లి కాదని అనడానికి కానీ.. పిల్లలను ఆమె నుంచి దూరం చేయడం కానీ జరగదు’’ అని స్పష్టం చేశారు. కేసు వివరాలు... ఇక కేసు వివరాలకు వస్తే.. పిటీషనర్ పంజాబ్‌కు చెందిన ఫతేగార్ సాహిబ్‌కు, లుధియానాకు చెందిన ఆమె భర్త ఇద్దరు ఆస్ట్రేలియా పౌరులు. 2013లో వీరికి వివాహం కాగా.. 2017లో ఓ కుమార్తె జన్మించింది. పిటీషన్‌దారైన మహిళ 2020, ఫిబ్రవరిలో ఇండియాలో ఉన్న తల్లిదండ్రులను చూడ్డానికి వచ్చినప్పుడు ఆమె దగ్గర నుంచి కుమార్తెను బలవంతంగా వేరు చేశారు. ఈ క్రమంలో సదరు మహిళ తన భర్త ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడని.. కానీ మాత్రం తాను ఆస్ట్రేలియాలో బాగానే స్థిరపడ్డానని.. సొంత ఇల్లు కూడా ఉందని.. కుమార్తెకు ఎలాంటి ఇబ్బంది రాకుండా చూసుకుంటానని పిటీషన్లో తెలిపింది. మైనర్ కుమార్తె బాధ్యతను తనకు అప్పగించేలా తన భర్తను ఆదేశించాల్సిందిగా కోర్టును అభ్యర్థించింది. అంతేకాక సదరు మహిళ ఆస్ట్రేలియా వెళ్లిన తర్వాత కుమార్తె కస్టడీని కోరుతూ.. ఫెడరల్ సర్క్యూట్ కోర్టులో పిటీషన్ దాఖలు చేసింది. మైనర్ బిడ్డను మహిళకు తిరిగి ఇవ్వమని ఆస్ట్రేలియా కోర్టు భర్తను ఆదేశించింది. ఇక భర్త వాదనల ప్రకారం అతడి భార్య తన దగ్గరి బంధువుతో వివాహేతర సంబంధం పెట్టుకుందని.. అందుకే పాపను ఆమె దగ్గర నుంచి తీసుకువచ్చానన్నాడు. ఏడాదిగా తన కుమార్తె నానమ్మ, తాతయ్యల దగ్గర బాగా అలవాటయ్యిందని.. ఇప్పుడు బిడ్డను తన భార్యకు అప్పగిస్తే.. పాపపై ప్రభావం పడుతుందని కోర్టుకు తెలిపాడు. ఈ క్రమంలో కోర్టు.. ‘‘తల్లి నాలుగున్నరేళ్ల కుమార్తెను తనకు అప్పగించాల్సిందిగా కోరుతుంది. రానున్న సంవత్సారల్లో పాప నిర్మాణాత్మక అభివృద్ధిలో తల్లి ప్రేమ, సంరక్షణ, ఆప్యాయత, మార్గదర్శకత్వం అవసరం అవుతాయి. అంతేకాక హిందూ మైనారిటీ, గార్డియన్షిప్ చట్టం, 1956 లోని సెక్షన్ 6 ప్రకారం తల్లి ఐదేళ్ల వయస్సు వరకు పిల్లల సహజ సంరక్షకురాలు” అని న్యాయమూర్తి స్పష్టం చేశారు. చదవండి: భార్య గుట్టు బయటపెట్టిన కాల్ రికార్డింగ్స్! -
హైకోర్టును ఆశ్రయిస్తే రూ.10 వేల ఫైన్!
చండీగఢ్: ప్రేమ పెళ్లి చేసుకున్న ఓ జంట రక్షణ కల్పించాలని పంజాబ్, హరియాణ హైకోర్టును మంగళవారం ఆశ్రయించగా.. వారికి అనూహ్యంగా రూ.10 వేల జరిమానా పడింది. పెళ్లి ఫొటోల్లో నూతన వధూవరులు, వివాహానికి హాజరైన బంధువులు ముఖానికి మాస్క్‌లు ధరించక పోవడాన్ని కోర్టు గమనించింది. కోవిడ్ నిబంధనల్ని పాటించనందుకు వారికి పెనాల్టీ విధిస్తున్నట్టు న్యాయమూర్తి హరిపాల్ వర్మ తెలిపారు. 15 రోజుల్లో జరిమానా మొత్తాన్ని హోషియాపూర్ డీసీకి అందజేయాలని ఆదేశించారు. ఆ మొత్తాన్ని హోషియాపూర్‌లో మాస్కుల పంపిణీకి వెచ్చించాలని న్యాయమూర్తి స్పష్టం చేశారు. దాంతోపాటు.. నూతన వధూవరుల ప్రాణాలకు రక్షణ కల్పించాలని గురదాస్‌పూర్ ఎస్ఎస్పీకి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. కాగా, అనూహ్యంగా తమకు జరిమానా పండటంతో పెళ్లి కొడుకు, పెళ్లి కూతురు తొలుత ఆందోళన చెందారు. అయితే, కుటుంబ సభ్యుల నుంచి తమకు రక్షణ కల్పించాలని ఎస్ఎస్పీకి ఆదేశాలు ఇవ్వడంతో ఊపిరిపీల్చుకున్నారు. (చదవండి: చిన్న అబద్ధం, పెద్ద శిక్ష పడే అవకాశం!) -
ఆ వారసులకు రూ.20 వేల కోట్లు
చండీగఢ్: ఫరీద్ కోట్ మహారాజు హరీందర్ సింగ్ బ్రార్‌కు చెందిన రూ. 20 వేల కోట్ల విలువైన ఆస్తికి వారసులెవరనే విషయంలో పంజాబ్ అండ్ హరియాణా హైకోర్టు సోమవారం కీలక తీర్పును వెలువరించింది. మహారాజు కూతుళ్లు అమృత్ కౌర్, దీపిందర్ కౌర్‌లకు 75%, తల్లి దివంగత మొహిందర్ కౌర్‌కు మిగతా 25% వాటా చెందుతుందని స్పష్టం చేసింది. మొహిందర్ కౌర్ వాటాపై హరీందర్ సింగ్ సోదరుడైన మంజిత్ ఇందర్ సింగ్ వారసులకు హక్కు ఉంటుందని పేర్కొంది. మూడేళ్ల వయసులో హరీందర్ సింగ్ ఫరీద్కోట్ ఎస్టేట్‌కు రాజయ్యారు. ఆ సంస్థానం చివరి రాజు ఆయన నరీందర్ కౌర్‌ను వివాహం చేసుకున్నారు. వారికి ముగ్గురు కూతుళ్లు. ఒక కుమారుడు. కూతుళ్లు అమృత్ కౌర్, దీపిందర్ కౌర్, మహీపిందర్ కౌర్. కుమారుడు హర్మొహిందర్ సింగ్ 1981లో ఒక రోడ్డు ప్రమాదంలో మరణించారు. కూతురు మహీపిందర్ కౌర్ పెళ్లి కాకముందే మరణించారు. మహారాజు హరీందర్ సింగ్ 1989లో చనిపోయారు. అనంతరం ఆయన ఎస్టేట్ ఆస్తులపై వివాదం మొదలైంది. మహారాజు హరీందర్‌కు వంశపారంపర్యంగా వచ్చిన విలువైన ఆస్తులు హిమాచల్‌ప్రదేశ్, ఢిల్లీ, చండీగఢ్, హరియాణాల్లో ఉన్నాయి. వాటి విలువ రూ. 20 వేల కోట్లకు పైనే. కోర్టు కేసు నడుస్తుండగా దీపిందర్ కౌర్ మరణించారు. మహారాజు హరీందర్ సింగ్ మరణం తరువాత ఆయన రాసినట్లుగా చెబుతున్న వీలునామా ఒకటి వెలుగులోకి వచ్చింది. అందులో దీపిందర్ సింగ్ నిర్వహిస్తున్న ‘మహర్వాల్ కేవాజీ ట్రస్ట్’కు ఆస్తి చెందాలని ఉంది. అయితే, ఆ వీలునామా చెల్లదని ముందుగా చండీగఢ్ కోర్టు, ఆ తరువాత తాజాగా హైకోర్టు తేల్చిచెప్పాయి. హిందూ వారసత్వ చట్టం ప్రకారం ఆస్తి పంపకం జరగాలని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రాజ్‌మోహన్ సింగ్ తీర్పునిచ్చారు. ఆ ప్రకారం, ఇద్దరు కూతుళ్లకు, మహారాజు చనిపోయిన సమయంలో జీవించి ఉంది కనుక ఆయన తల్లి మొహిందర్ కౌర్‌కు ఆస్తి చెందుతుందని పేర్కొన్నారు. మొహిందర్ కౌర్ రాసిన వీలునామా ప్రకారం తనకు సంక్రమించే ఆస్తి ఆమె మరో కుమారుడు మంజిత్ ఇందర్ సింగ్ కుటుంబానికి చెందుతుంది. ఎస్టేట్స్ యాక్ట్, 1948 ప్రకారం ఆస్తి అంతా తనకే చెందుతుందని అమృత్ కౌర్ వాదించారు. జేష్టస్వామ్య సంప్రదాయం ప్రకారం.. పెద్ద కుమారుడికి కానీ, లేదా జీవించి ఉన్న పెద్ద సోదరుడి కుటుంబానికి కానీ ఆస్తిపై హక్కు ఉంటుందని మంజిత్ ఇందర్ సింగ్ కుమారుడు భరత్ ఇందర్‌సింగ్ వాదించారు. వీలునామా ప్రకారం ఆస్తి అంతా తాను నిర్వహిస్తున్న ట్రస్ట్‌కు చెందాలని దీపిందర్ సింగ్ కోరారు. వీరి వాదనలను హైకోర్టు తోసిపుచ్చింది. ఆస్తిపై హక్కు కోసం కుట్రపూరితంగా రూపొందించారని పేర్కొంటూ వీలునామాను కొట్టివేసింది. ఫరీద్ కోట్ రాజమహల్ -
కీలక నిర్ణయం తీసుకున్న జస్టిస్ మురళీధర్
చంఢీఘర్: లాయర్లు తనను సంబోధిస్తున్నప్పుడు 'మై లార్డ్', 'యువర్ లార్డ్ షిప్' అనే పదాలను ఉపయోగించరాదని పంజాబ్ హర్యానా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎస్.మురళీధర్ కోరారు. ఈ మేరకు ఆయన సూచించినట్టు చంఢీఘర్‌లోని బార్ అసోసియేషన్ ప్రకటనను విడుదల చేసింది. గతంలో ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తిగా ఉన్న ఆయన ఇటీవలే పంజాబ్ హర్యానా కోర్టుకు బదిలీ అయ్యారు. న్యాయమూర్తులను 'సర్' అని గానీ, 'యువర్ హానర్' అని గానీ సంబోధించాలని చండీఘర్‌లోని హైకోర్టు బార్ అసోసియేషన్ గతంలో తమ లాయర్లకు సూచించింది. అయితే అనేకమంది న్యాయవాదులు తమ జడ్జీలను యువర్ లార్డ్ షిప్, మై లార్డ్, మిలార్డ్ అంటూ సంబోధిస్తూ వస్తున్నారు. తాజాగా జస్టిస్ మురళీధర్ ఈ సూచన చేయడం విశేషం. ఢిల్లీ అల్లర్ల సమయంలో విచారణ సందర్భంగా పోలీసులపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ తర్వాత కొద్ది రోజుల్లోనే ఆయనను పంజాబ్-హర్యానా హైకోర్టుకు న్యాయమూర్తిగా బదిలీ చేశారు. ఈ బదిలీ బీజేపీ నేతలను కాపాడేందుకే అనే ఊహాగానాలు వెలువడ్డాయి. అయితే ఆయన మాత్రం తన బదిలీని హుందాగా స్వీకరించారు. చదవండి: రాత్రికి రాత్రే... ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి బదిలీ -
కోర్టు మెట్లెక్కిన ప్రముఖ హాస్య నటి
చంఢీగర్ : బాలీవుడ్ కామెడీ క్వీన్ భారతీ సింగ్ పంజాబ్, హరియాణా హైకోర్టు తలుపు తట్టారు. క్రిస్టియన్ల మనోభావాలను దెబ్బతీశారనే ఆరోపణలపై బాలీవుడ్ నటి రవీనా టాండన్, ప్రముఖ కొరియోగ్రాఫర్ ఫరా ఖాన్, హాస్యనటి భారతి సింగ్‌పై అమృత్సర్ పోలీసులు కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. కాగా, తనపై దాఖలైన ఎఫ్ఐఆర్ను కొట్టివేయాలని, కేసుకు సంబంధించిన విచారణపై స్టే విధించాలని భారతీ సింగ్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఏ మతానికి చెందిన మనోభావాలను తాను కించపరచలేదని పిటిషన్లో పేర్కొన్నారు. భారతీ సింగ్ దాఖలు చేసిన పిటిషన్ నేడు పంజాబ్, హరియాణ హైకోర్టులో విచారణకు రానుందని ఆమె తరపు లాయర్ అభినవ్ సూద్ తెలిపారు. (చదవండి : చిక్కుల్లో ఆ ముగ్గురు) కాగా, క్రిస్మస్ సందర్భంగా డిసెంబర్లో ప్రసారమైన ఒక టీవీ షోలో రవీనా టాండన్, ఫరా ఖాన్, భారతీ సింగ్ క్రైస్తవ మత భావాలకు వ్యతిరేకంగా అవమానకరమైన, ఉద్దేశపూర్వక వ్యాఖ్యలు చేశారంటూ క్రిస్టియన్ ఫ్రంట్ అజ్నాలా బ్లాక్ అధ్యక్షుడు సోను జాఫర్ అజ్నాలా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా వివిద సెక్షన్ల కింద అమృత్సర్ పోలీసులు ఎఫ్ఐఆర్ దాఖలు చేశారు. ఇక కేసు విచారణలో భాగంగా ఈ ముగ్గురూ తమ ముందు హాజరు కావాలని అమృత్సర్ పోలీసులు మూడు వారాల కింద నోటీసులు ఇచ్చారు. దాంతో రవీనా టాండన్, ఫరా ఖాన్ జనవరి 23న హైకోర్టును ఆశ్రయించగా.. వారిద్దరిపై మార్చి 25 వరకు ఎలాంటి బలవంతపు విచారణ చేపట్టొద్దని కోర్టు మార్గదర్శకాలు జారీ చేసింది. (చదవండి : రెండేళ్లుగా ఇలాగే ఉంది.. అయినా..) -
గ్యాంగ్ రేప్‌లు.. సీల్డ్ కవర్లో నివేదిక
సాక్షి, హరియానా : దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ముర్తల్ గ్యాంగ్ రేప్ ఘటనలకు సంబంధించి హరియానా ప్రభుత్వం ఎట్టకేలకు తుది నివేదికను రూపొందించింది. సీల్డ్ కవర్లో దర్యాప్తు వివరాలను గురువారం పంజాబ్ హరియానా హైకోర్టు బెంచ్‌కు సమర్పించింది. గత ఫిబ్రవరిలో జాట్ రిజర్వేషన్ల ఉద్యమం సందర్భంగా హింస చెలరేగిన విషయం తెలిసిందే. ఆ సమయంలో 10 మంది మహిళలపై సామూహిక అత్యాచార కేసులు చోటు చేసుకున్నాయి. ఈ నివేదికతోపాటు దాడులు, ఆ సమయంలో దాఖలైన ఇతర కేసులకు సంబంధించి కేసు డైరీలను ప్రభుత్వం కోర్టుకు అందించింది. ఓ ఆంగ్ల దిన పత్రిక కథనాల ఆధారంగా హైకోర్టు సుమోటోగా కేసును స్వీకరించిన విషయం తెలిసిందే. కోర్టు ఆదేశాల మేరకు పోలీస్ శాఖ దర్యాప్తు చేపట్టింది. ఇక తదుపరి విచారణను జనవరి 2018కి వాయిదా వేసినట్లు తెలుస్తోంది. ఫిబ్రవరి 2016లో జాట్ రిజర్వేషన్ల ఉద్యమం హింసాత్మకంగా మారగా.. సోనేపట్ జిల్లాలో తారాస్థాయికి చేరుకుని మహిళలపై అఘాయిత్యాలు చోటు చేసుకున్నాయి. ఎక్కడ పడితే అక్కడ మహిళల దుస్తులు చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. ఈ దృశ్యాలతోపాటు కొందరు బాధితుల కథనం మేరకు ఓ ఆంగ్ల పత్రిక వరుస కథనాలు ప్రచురించింది. అల్లర్లకు సంబంధించి మొత్తం 8 జిల్లాల్లో 2,100 ఎఫ్ఐఆర్లు నమోదు అయ్యాయి. -
మూడు గంటలు మాత్రమే కాల్చండి
సాక్షి : ఓవైపు బాణాసంచా అమ్మకాలపై సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో.. అమ్మకదారులు నిరసనలు వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే పంజాబ్ హర్యానా హైకోర్టు శుక్రవారం మరో తీర్పు వెలువరించింది. పటాకులు కాల్చేందుకు కాల పరిమితిని విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. దీపావళి రోజు సాయంత్రం 6.30 నుంచి రాత్రి 9.30 వరకు మాత్రమే కాల్చాలని ప్రజలకు సూచిస్తూ ఆ ఉత్తర్వుల్లో పేర్కొంది. పోలీస్ కంట్రోల్ రూమ్ వ్యాన్లు అంతటా తిరుగుతూ పరిస్థితిని సమీక్షించాలని.. ఆదేశాలను ఎవరైనా ఉల్లంఘిస్తే వారిపై చర్యలు తీసుకోవాలని కోర్టు పోలీసులను ఆదేశించింది. న్యూఢిల్లీ: ఇక గతంలో ఇచ్చిన ఆదేశాలను సవరించాలని దాఖలైన అభ్యర్థనను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. బాణాసంచా వర్తకులు దాఖలు చేసిన పిటిషన్‌ను శుక్రవారం విచారణకు చేపట్టిన కోర్టు.. ఈ విషయంలో ఇప్పటికిప్పుడు ఎలాంటి సడలింపు ఇవ్వలేమని తేల్చి చెప్పింది. దీపావళి తర్వాత పర్యావరణ కాలుష్య స్థాయిలను సమీక్షించి.. కావాలంటే అప్పుడు నిర్ణయం ప్రకటిస్తామని బెంచ్ తెలిపింది. దీనిపై సోషల్ మీడియాలో పలువురు భిన్న అభిప్రాయలు వ్యక్తం చేస్తున్నారు. -
జాట్ కోటా అమలుపై హైకోర్టు స్టే
న్యూఢిల్లీః బీసీ(సీ) కేటగిరీ కింద జాట్లు, ఐదు ఇతర కులాలకు రిజర్వేషన్లు కల్పిస్తూ తీసుకున్ననిర్ణయం రాజ్యాంగ చెల్లుబాటును పంజాబ్ హర్యానా హైకోర్టు సమర్ధించినా దాని అమలుపై స్టే విధించింది. జాట్ కోటాపై దాఖలైన పిటిషన్‌ను కోర్టు జాతీయ బీసీ కమిషన్‌కు నివేదించింది. 2018, మార్చి 31న కమిషన్ తన నివేదికను సమర్పించనుంది. అప్పటివరకూ జాట్లు, ఇతర ఐదు కులాలకు రిజర్వేషన్ల నిర్ణయం అమలును నిలిపివేసింది. గతంలో 2016, మే 26న హైకోర్టు డివిజన్ బెంచ్ జాట్లు, ఇతర కులాలకు రిజర్వేషన్లపై స్టే విధించింది. ఈ నిర్ణయం రాజ్యాంగ చెల్లుబాటును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌పై డివిజన్ బెంచ్ స్టే ఉత్తర్వులు జారీ చేసింది.అయితే దేశంలో భిన్న భౌగోళిక, సాంస్కృతిక పరిస్థితుల నేపథ్యంలో రిజర్వేషన్ విధానాల్లో సారూప్యత ఉండాల్సిన అవసరం లేదని హర్యానా ప్రభుత్వం వాదించింది. ప్రత్యేక పరిస్థితుల్లో ఏ కులానికైనా రిజర్వేషన్లు కల్పించవచ్చని కొన్ని కేసుల్లో సుప్రీం కోర్టు పేర్కొన్న ఉదంతాలను ప్రస్తావించింది.