
సాక్షి : ఓవైపు బాణాసంచా అమ్మకాలపై సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో.. అమ్మకదారులు నిరసనలు వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే పంజాబ్ హర్యానా హైకోర్టు శుక్రవారం మరో తీర్పు వెలువరించింది. పటాకులు కాల్చేందుకు కాల పరిమితిని విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది.
దీపావళి రోజు సాయంత్రం 6.30 నుంచి రాత్రి 9.30 వరకు మాత్రమే కాల్చాలని ప్రజలకు సూచిస్తూ ఆ ఉత్తర్వుల్లో పేర్కొంది. పోలీస్ కంట్రోల్ రూమ్ వ్యాన్లు అంతటా తిరుగుతూ పరిస్థితిని సమీక్షించాలని.. ఆదేశాలను ఎవరైనా ఉల్లంఘిస్తే వారిపై చర్యలు తీసుకోవాలని కోర్టు పోలీసులను ఆదేశించింది.
న్యూఢిల్లీ: ఇక గతంలో ఇచ్చిన ఆదేశాలను సవరించాలని దాఖలైన అభ్యర్థనను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. బాణాసంచా వర్తకులు దాఖలు చేసిన పిటిషన్‌ను శుక్రవారం విచారణకు చేపట్టిన కోర్టు.. ఈ విషయంలో ఇప్పటికిప్పుడు ఎలాంటి సడలింపు ఇవ్వలేమని తేల్చి చెప్పింది. దీపావళి తర్వాత పర్యావరణ కాలుష్య స్థాయిలను సమీక్షించి.. కావాలంటే అప్పుడు నిర్ణయం ప్రకటిస్తామని బెంచ్ తెలిపింది. దీనిపై సోషల్ మీడియాలో పలువురు భిన్న అభిప్రాయలు వ్యక్తం చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment