సాక్షి, హరియానా : దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ముర్తల్ గ్యాంగ్ రేప్ ఘటనలకు సంబంధించి హరియానా ప్రభుత్వం ఎట్టకేలకు తుది నివేదికను రూపొందించింది. సీల్డ్ కవర్‌లో దర్యాప్తు వివరాలను గురువారం పంజాబ్ హరియానా హైకోర్టు బెంచ్‌కు సమర్పించింది. గత ఫిబ్రవరిలో జాట్ రిజర్వేషన్ల ఉద్యమం సందర్భంగా హింస చెలరేగిన విషయం తెలిసిందే. ఆ సమయంలో 10 మంది మహిళలపై సామూహిక అత్యాచార కేసులు చోటు చేసుకున్నాయి.
ఈ నివేదికతోపాటు దాడులు, ఆ సమయంలో దాఖలైన ఇతర కేసులకు సంబంధించి కేసు డైరీలను ప్రభుత్వం కోర్టుకు అందించింది. ఓ ఆంగ్ల దిన పత్రిక కథనాల ఆధారంగా హైకోర్టు సుమోటోగా కేసును స్వీకరించిన విషయం తెలిసిందే. కోర్టు ఆదేశాల మేరకు పోలీస్ శాఖ దర్యాప్తు చేపట్టింది. ఇక తదుపరి విచారణను జనవరి 2018కి వాయిదా వేసినట్లు తెలుస్తోంది.
ఫిబ్రవరి 2016లో జాట్ రిజర్వేషన్ల ఉద్యమం హింసాత్మకంగా మారగా.. సోనేపట్ జిల్లాలో తారాస్థాయికి చేరుకుని మహిళలపై అఘాయిత్యాలు చోటు చేసుకున్నాయి. ఎక్కడ పడితే అక్కడ మహిళల దుస్తులు చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. ఈ దృశ్యాలతోపాటు కొందరు బాధితుల కథనం మేరకు ఓ ఆంగ్ల పత్రిక వరుస కథనాలు ప్రచురించింది. అల్లర్లకు సంబంధించి మొత్తం 8 జిల్లాల్లో 2,100 ఎఫ్‌ఐఆర్‌లు నమోదు అయ్యాయి.
Comments
Please login to add a commentAdd a comment