చండీగఢ్: శంభు సరిహద్దును వారం రోజుల్లోగా తెరవాలని పంజాబ్, హర్యానా రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టు బుధవారం హర్యానా ప్రభుత్వాన్ని ఆదేశించింది. పంజాబ్-హర్యానాలను కలిపే ఈ శంభు సరిహద్దు వద్ద ఫిబ్రవరి 13న రైతులు భారీగా నిరసనలను ప్రారంభించడంతో హర్యానా ప్రభుత్వం దీనిని మూసివేసింది. గత అయిదు నెలలుగా ఈ సహరిహద్దు మూసే ఉంది. అదే విధంగా రాష్ట్రంలో శాంతి భద్రతలను కాపాడాలని రైతు సంఘాలను హైకోర్టు కోరింది.
శంభు సరిహద్దు వెంబడి పబ్లిక్ ప్రజల రాకపోకలు, వాహనాలను అనుమతించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ జూలై 6న పంజాబ్- హర్యానా హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు అయ్యింది. దీనిపై నేడు విచారణ చేపట్టిన హైకోర్టు వారం రోజుల్లో శంభు సరిహద్దును తెరవాలని హర్యానా ప్రభుత్వాన్ని ఆదేశించింది.
ఇది రాజధాని న్యూఢిల్లీని పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కశ్మీర్‌లను కలుపుతున్నందున మూసివేయడం వల్ల సామాన్య ప్రజలకు చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయి.
జూలై 3న నిరసన వ్యక్తం చేస్తున్న రైతులను ఒప్పించాలని హర్యానా రవాణా మంత్రి అసీమ్ గోయెల్ కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌ను కోరారు. అసీమ్ గోయెల్ మాట్లాడుతూ.., “రైతులు అంబాలా జిల్లా సరిహద్దులో ఉన్న శంభు గ్రామం దగ్గర అయిదున్నర నెలల క్రితం ఆందోళనను ప్రారంభించిన తర్వాత జాతీయ రహదారిపై ట్రాఫిక్ నిలిచిపోయింది. రైతుల ఆందోళన ప్రారంభమైనప్పటి నుంచి ఈ సరిహద్దు మూసివేశారు. ఇది సాధారణ ప్రజలకు అసౌకర్యాన్ని కలిగించింది.
ముఖ్యంగా అంబాలాలోని వ్యాపారవేత్తలు తమ వ్యాపారం నిర్వహించడంలో ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. కేంద్ర ప్రభుత్వం ఆందోళన చేస్తున్న రైతులతో చర్చలు జరిపి శంభు సరిహద్దు గుండా రహదారిని తెరవడానికి వారిని శాంతింపజేయాలి. ఇది సమీపంలో నివసించే ప్రజలకు ఉపశమనం కలిగిస్తుంది, అలాగే ఇది వ్యాపారవేత్తలు తమ పనిని నిర్వహించడానికి సులభతరం చేస్తుంది” అని పేర్కొన్నారు
అయితే రైతులు రహదారిని దిగ్బంధించలేదని, ఫిబ్రవరిలో బారికేడ్లు వేసి తమ ఢిల్లీ చలో మార్చ్‌ను ప్రభుత్వమే ఆపిందని కిసాన్ మజ్దూర్ మోర్చా నాయకుడు సర్వన్ సింగ్ పంధేర్ తెలిపారు. తమ డిమాండ్లను ఆమోదించాలని ప్రభుత్వంపై ఒత్తిడి చేసేందుకు రైతులు ఢిల్లీ చలో మార్చ్ ప్రారంభించినట్లు పేర్కొన్నారు. ఫిబ్రవరి 13 నుంచి తమ పాదయాత్రను భద్రతా దళాలు అడ్డుకోవడంతో రైతులు పంజాబ్, హర్యానా మధ్య శంభు, ఖనౌరీ సరిహద్దు పాయింట్ల వద్ద నిరసనలు చేస్తున్నారని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment