చండీగఢ్: చెడ్డ మహిళ ఉంటుంది కానీ.. చెడ్డ తల్లి ఉండదని పెద్దల మాట. పేగు తెంచుకుని పుట్టిన బిడ్డల కోసం తల్లి ఏమైనా చేస్తుంది. సమాజం హర్షించనప్పటికి.. బిడ్డల బాగు కోసం ఆమె ఏం చేయడానికికైనా సిద్ధ పడుతుంది. తాజాగా పంజాబ్, హరియాణా కోర్టు కూడా ఇవే వ్యాఖ్యలు చేసింది. వివాహేతర సంబంధం ఉన్నంత మాత్రాన ఓ మహిళను చెడ్డ తల్లిగా పరిగణించలేము అని వ్యాఖ్యనించడమే కాక నాలుగున్నరేళ్ల కుమార్తె కస్టడీని తల్లికి అప్పగించింది.
వివాహేతర సంబంధం ఉందని ఆరోపిస్తూ.. భర్త తన దగ్గర నుంచి కుమార్తెను బలవంతంగా తీసుకెళ్లడంతో పంజాబ్‌కు చెందిన ఓ మహిళ హెబియస్ కార్పస్ పిటీషన్ దాఖలు చేసింది. దీని విచారణ సందర్భంగా జస్టిస్ అనుపిందర్ సింగ్ గ్రెవాల్ మాట్లాడుతూ.. ‘‘పితృస్వామ్య వ్యవస్థలో స్త్రీ నైతిక స్వభావంపై నిందలు మోపడం చాలా సహజం. ఎలాంటి ఆధారం లేకుండా మహిళ వ్యక్తిత్వంపై బురద జల్లుతారు. స్త్రీకి వివాహేతర సంబంధం ఉన్నా.. ఉందని ఊహించినా.. దాన్ని ఆధారంగా చేసుకుని ఆమెను మంచి తల్లి కాదని అనడానికి కానీ.. పిల్లలను ఆమె నుంచి దూరం చేయడం కానీ జరగదు’’ అని స్పష్టం చేశారు.
కేసు వివరాలు...
ఇక కేసు వివరాలకు వస్తే.. పిటీషనర్ పంజాబ్‌కు చెందిన ఫతేగార్ సాహిబ్‌కు, లుధియానాకు చెందిన ఆమె భర్త ఇద్దరు ఆస్ట్రేలియా పౌరులు. 2013లో వీరికి వివాహం కాగా.. 2017లో ఓ కుమార్తె జన్మించింది. పిటీషన్‌దారైన మహిళ 2020, ఫిబ్రవరిలో ఇండియాలో ఉన్న తల్లిదండ్రులను చూడ్డానికి వచ్చినప్పుడు ఆమె దగ్గర నుంచి కుమార్తెను బలవంతంగా వేరు చేశారు. ఈ క్రమంలో సదరు మహిళ తన భర్త ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడని.. కానీ మాత్రం తాను ఆస్ట్రేలియాలో బాగానే స్థిరపడ్డానని.. సొంత ఇల్లు కూడా ఉందని.. కుమార్తెకు ఎలాంటి ఇబ్బంది రాకుండా చూసుకుంటానని పిటీషన్‌లో తెలిపింది. మైనర్ కుమార్తె బాధ్యతను తనకు అప్పగించేలా తన భర్తను ఆదేశించాల్సిందిగా కోర్టును అభ్యర్థించింది.
అంతేకాక సదరు మహిళ ఆస్ట్రేలియా వెళ్లిన తర్వాత కుమార్తె కస్టడీని కోరుతూ.. ఫెడరల్ సర్క్యూట్ కోర్టులో పిటీషన్ దాఖలు చేసింది. మైనర్ బిడ్డను మహిళకు తిరిగి ఇవ్వమని ఆస్ట్రేలియా కోర్టు భర్తను ఆదేశించింది. ఇక భర్త వాదనల ప్రకారం అతడి భార్య తన దగ్గరి బంధువుతో వివాహేతర సంబంధం పెట్టుకుందని.. అందుకే పాపను ఆమె దగ్గర నుంచి తీసుకువచ్చానన్నాడు. ఏడాదిగా తన కుమార్తె నానమ్మ, తాతయ్యల దగ్గర బాగా అలవాటయ్యిందని.. ఇప్పుడు బిడ్డను తన భార్యకు అప్పగిస్తే.. పాపపై ప్రభావం పడుతుందని కోర్టుకు తెలిపాడు.
ఈ క్రమంలో కోర్టు.. ‘‘తల్లి నాలుగున్నరేళ్ల కుమార్తెను తనకు అప్పగించాల్సిందిగా కోరుతుంది. రానున్న సంవత్సారల్లో పాప నిర్మాణాత్మక అభివృద్ధిలో తల్లి ప్రేమ, సంరక్షణ, ఆప్యాయత, మార్గదర్శకత్వం అవసరం అవుతాయి. అంతేకాక హిందూ మైనారిటీ, గార్డియన్షిప్ చట్టం, 1956 లోని సెక్షన్ 6 ప్రకారం తల్లి ఐదేళ్ల వయస్సు వరకు పిల్లల సహజ సంరక్షకురాలు” అని న్యాయమూర్తి స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment