
చండీగఢ్: ప్రేమ పెళ్లి చేసుకున్న ఓ జంట రక్షణ కల్పించాలని పంజాబ్, హరియాణ హైకోర్టును మంగళవారం ఆశ్రయించగా.. వారికి అనూహ్యంగా రూ.10 వేల జరిమానా పడింది. పెళ్లి ఫొటోల్లో నూతన వధూవరులు, వివాహానికి హాజరైన బంధువులు ముఖానికి మాస్క్‌లు ధరించక పోవడాన్ని కోర్టు గమనించింది. కోవిడ్ నిబంధనల్ని పాటించనందుకు వారికి పెనాల్టీ విధిస్తున్నట్టు న్యాయమూర్తి హరిపాల్ వర్మ తెలిపారు. 15 రోజుల్లో జరిమానా మొత్తాన్ని హోషియాపూర్ డీసీకి అందజేయాలని ఆదేశించారు.
ఆ మొత్తాన్ని హోషియాపూర్‌లో మాస్కుల పంపిణీకి వెచ్చించాలని న్యాయమూర్తి స్పష్టం చేశారు. దాంతోపాటు.. నూతన వధూవరుల ప్రాణాలకు రక్షణ కల్పించాలని గురదాస్‌పూర్ ఎస్‌ఎస్పీకి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. కాగా, అనూహ్యంగా తమకు జరిమానా పండటంతో పెళ్లి కొడుకు, పెళ్లి కూతురు తొలుత ఆందోళన చెందారు. అయితే, కుటుంబ సభ్యుల నుంచి తమకు రక్షణ కల్పించాలని ఎస్‌ఎస్పీకి ఆదేశాలు ఇవ్వడంతో ఊపిరిపీల్చుకున్నారు.
(చదవండి: చిన్న అబద్ధం, పెద్ద శిక్ష పడే అవకాశం!)
Comments
Please login to add a commentAdd a comment