లండన్: మాస్కులు తప్పనిసరి సహా పలు కోవిడ్ ఆంక్షలను ఇంగ్లండ్ గురువారం ఎత్తేసింది. బూస్టర్ డోస్ టీకా తీవ్రమైన అనారోగ్యంతోపాటు ఆస్పత్రుల్లో చేరడాన్ని తగ్గించిందని బ్రిటన్ ప్రభుత్వం ప్రకటించిన అనంతరం ఇంగ్లండ్ ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో గురువారం నుంచి ఇంగ్లండ్‌లో ఎవ్వరూ మాస్కులు ధరించాల్సిన అవసరం లేదు. ఇక నైట్ క్లబ్బులు, ఇతర వేదికలకు కోవిడ్ పాసులు కూడా అవసరం లేదని తెలిపింది.
ఇక ఇంటినుంచే పని, స్కూళ్లలో ఫేస్ మాస్కుల నిబంధనను గత వారమే ప్రభుత్వం ఎత్తివేసింది. ఓమిక్రాన్ వేరియంట్ వేగవంతమైన వ్యాప్తిని అడ్డుకోవడానికి, బూస్టర్ డోస్ వేసుకోవడానికి సమయమిస్తూ డిసెంబర్ మొదటివారం నుంచే ‘ప్లాన్ బి’ చర్యలు ప్రారంభించింది. అందరికీ బూస్టర్ డోసు టీకాలు వేయడంతోపాటు, నిర్ధారణ పరీక్షలు, యాంటీ వైరల్ చికిత్సలను అందించడంలో యూరప్ బలంగా పనిచేసిందని ఆరోగ్య కార్యదర్శి సాజిద్ జావీద్ తెలిపారు. వైరస్ పూర్తిగా నిర్మూలనయ్యే అవకాశం లేదని, వైరస్‌తో సహజీవనం నేర్చుకున్నామని ఆయన తెలిపారు.
దేశంలో ఒమిక్రాన్ తగ్గుముఖం పడుతున్నా.. పిల్లలు, వృద్ధుల్లో ఎక్కువగా ఉందని పేర్కొన్నారు. 12 ఏళ్లు పైబడినవారందరికీ వ్యాక్సినేషన్ 84 శాతం పూర్తయ్యిందని, అర్హత ఉన్నవాళ్లంతా రెండో డోసు తీసుకున్నారని, 81 శాతం మంది బూస్టర్ డోసు కూడా తీసుకున్నారని వెల్లడించారు. ఆస్పత్రుల్లో చేరిక, ఐసీయూ చికిత్సలో ఉన్నవారి సంఖ్య స్థిరంగా కొనసాగుతోందని, కొత్త సంవత్సరం సమయంలో రోజుకు రెండులక్షలున్నా ఇప్పుడు లక్షకు పడిపోయాయని తెలిపారు. మరోవైపు గురువారం యూకేలో 96,871 కొత్త కేసులు నమోదయ్యాయి. 338 మరణాలు సంభవించాయి.
గతవారమే ప్రకటన
ఒమిక్రాన్ బారిన పడినవారి సంఖ్య గరిష్ట స్థాయికి చేరుకుందని ప్రధాని బోరిస్ జాన్సన్ గత వారమే ప్రకటించారు. అయితే... తమ వినియోగదారులను ఫేస్ మాస్కులు ధరించమని కోరతామని కొన్ని దుకాణదారులు, రవాణా సంస్థలు ప్రకటించిన నేపథ్యంలో ప్రభుత్వం చట్టపరమైన చర్యల నుంచి తప్పుకొంది. ఇక అయితే రాజధానిలోని బస్సులు, సబ్ వే రైళ్లలో ఇప్పటికీ మాస్కులు వసరమని లండన్ మేయర్ సాధిక్ ఖాన్ తెలిపారు. ఇక ఒమిక్రాన్ సోకి వారికి ఐదురోజుల ఐసోలేషన్ సరిపోతుందన్నారు. కోవిడ్ 19ను ఫ్లూలాగా పరిగణించి దీర్ఘకాలిక ప్రణాళిక తయారు చేస్తున్నట్లు అక్కడి ఆరోగ్యాధికారులు తెలిపారు. స్కాట్లాండ్, వేల్స్, ఉత్తర ఐర్లాండ్‌లు సొంత ప్రజారోగ్య నియమాలను రూపొందించుకున్నాయి. అదేవిధంగా వారి వైరస్ నిబంధనలను కొంత సడలించాయి.
Comments
Please login to add a commentAdd a comment