'18 రోజుల పాటు నరకం అనుభవించారు'
హైదరాబాద్: తమ కుటుంబం తీరని శోకంలో మునిగిపోయిందని రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన రమ్య తాత మధుసూదనాచారి కూతురు నాగమణి పేర్కొన్నారు. ప్రమాదానికి కారకుడైన శ్రావిల్ తో పాటు మిగిలిన ఐదుగురు విద్యార్థులను శిక్షించాలని ఆమె డిమాండ్ చేశారు. కాలేజీలో వారి సర్టిఫికెట్లను రద్దు చేయాలన్నారు. మైనర్లకు మద్యం అమ్మిన బార్పై చర్యలు తీసుకోవాలన్నారు. తమకు మార్గదర్శకుడైన తండ్రిని కోల్పోయామని ఆవేదన చెందారు. 'ఆస్పత్రిలో మా నాన్న 18 రోజుల పాటు నరకం అనుభవించారు. మాతో మాట్లాడాలని ప్రయత్నించి మాట్లాడలేకపోయారు. చేత్తో రాద్దామన్న రాయలేని పరిస్థితి. ఆయన చేతులు విరిగిపోయాయి. ఇలాంటి పరిస్థితి పగవాళ్లకు కూడా రావొద్ద'ని నాగమణి అన్నారు.
'ప్రమాదం జరిగిన రోజు మా నాన్నను నిమ్స్ లో చేర్చుకోవడం ఆలస్యమైంది. నిమ్స్ డాక్టర్ల నిర్లక్ష్యం కూడా ఉంది. స్నేహితుల దగ్గర అప్పులు చేసి వైద్యం చేయించాం. ఇలాంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా ప్రభుత్వం చర్యలు చేపట్టాలి. ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ వచ్చేవరకు మా నాన్న మృతదేహాన్ని తరలించమ'ని మధుసూదనాచారి కుమారుడు, రమ్య తండ్రి వెంకటరమణ అన్నారు. ఈ నెల 1న బంజారాహిల్స్ రోడ్ నంబర్-3లోని పంజగుట్ట హిందూశ్మశాన వాటికముందు జరిగిన ఘోర కారు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన మధుసూదనాచారి(65) సోమవారం ఉదయం తుదిశ్వాస విడిచారు.