panjagutta road accident
-
'రమ్య కుటుంబాన్ని సీఎం వద్దకు తీసుకెళ్తా'
హైదరాబాద్: రమ్య కుటుంబ సభ్యులకు జరిగిన అన్యాయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకెళతానని వెస్ట్ జోన్ డీసీపీ వెంకటేశ్వరరావు, టాస్క్ ఫోర్స్ డీసీపీ లింబారెడ్డి అన్నారు. పంజాగుట్ట కారు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్న రమ్య తాత కూడా చనిపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. తమకు న్యాయం జరిగే వరకు మృతదేహాన్ని తీసుకెళ్లనివ్వబోమన్నారు. అంతకుముందే రమ్య, ఆమె బాబాయ్ రాజేశ్ చనిపోయిన విషయం తెలిసిందే. దీంతో తీవ్రంగా కలత చెందిన కుటుంబ సభ్యులు రమ్య తాత మధుసూదనాచారి మృతదేహం వద్ద తీవ్రంగా విలపిస్తూ నిరసనకు దిగారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు డీసీపీ వెంకటేశ్వరరావు, టాస్క్ ఫోర్స్ డీసీపీ లింబారెడ్డి వారి కుటుంబ సభ్యులతో చర్చలు జరిపారు. అవి సఫలం కావడంతో మృతేదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రి మార్చురీకి తరలించారు. న్యాయం చేస్తాం: తలసాని రమ్య కుటుంబ సభ్యులకు న్యాయం చేస్తామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. వైద్య ఖర్చులను భరించే విషయంపై ముఖ్యమంత్రితో చర్చిస్తామని చెప్పారు. రమ్య కుటుంబ సభ్యులను ముఖ్యమంత్రి కేసీఆర్ వద్దకు తీసుకెళ్తానని ఆయన చెప్పారు. ప్రమాదానికి కారణమైన వారిపై చట్టపరంగా చర్యలు ఉంటాయని తలసాని అన్నారు. భవిష్యత్ లో ఇలాంటి ఘటనలు పునరావృతంకాకుండా చూసుకుంటామని చెప్పారు. -
ఆస్పత్రి వద్ద రమ్య బంధువుల ఆందోళన
హైదరాబాద్: యశోద ఆస్పత్రి వద్ద చిన్నారి రమ్య బంధువులు ఆందోళన చేపట్టారు. పంజాగుట్టలో ఈనెల 1న జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రమ్య తాత మధుసూదనాచారి సోమవారం తెల్లవారుజామున మృతి చెందారు. పోలీసులు ఆయన మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించేందుకు ప్రయత్నించగా కుటుంబసభ్యులు, బంధువులు అడ్డుకున్నారు. ప్రమాదానికి కారణమైన నిందితులను తమకు చూపించాలని వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. అప్పటి వరకు మృతదేహాన్ని తీసుకెళ్లడానికి వీల్లేదంటూ వారు ఆందోళన చేస్తున్నారు. -
'18 రోజుల పాటు నరకం అనుభవించారు'
హైదరాబాద్: తమ కుటుంబం తీరని శోకంలో మునిగిపోయిందని రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన రమ్య తాత మధుసూదనాచారి కూతురు నాగమణి పేర్కొన్నారు. ప్రమాదానికి కారకుడైన శ్రావిల్ తో పాటు మిగిలిన ఐదుగురు విద్యార్థులను శిక్షించాలని ఆమె డిమాండ్ చేశారు. కాలేజీలో వారి సర్టిఫికెట్లను రద్దు చేయాలన్నారు. మైనర్లకు మద్యం అమ్మిన బార్‌పై చర్యలు తీసుకోవాలన్నారు. తమకు మార్గదర్శకుడైన తండ్రిని కోల్పోయామని ఆవేదన చెందారు. 'ఆస్పత్రిలో మా నాన్న 18 రోజుల పాటు నరకం అనుభవించారు. మాతో మాట్లాడాలని ప్రయత్నించి మాట్లాడలేకపోయారు. చేత్తో రాద్దామన్న రాయలేని పరిస్థితి. ఆయన చేతులు విరిగిపోయాయి. ఇలాంటి పరిస్థితి పగవాళ్లకు కూడా రావొద్ద'ని నాగమణి అన్నారు. 'ప్రమాదం జరిగిన రోజు మా నాన్నను నిమ్స్ లో చేర్చుకోవడం ఆలస్యమైంది. నిమ్స్ డాక్టర్ల నిర్లక్ష్యం కూడా ఉంది. స్నేహితుల దగ్గర అప్పులు చేసి వైద్యం చేయించాం. ఇలాంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా ప్రభుత్వం చర్యలు చేపట్టాలి. ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ వచ్చేవరకు మా నాన్న మృతదేహాన్ని తరలించమ'ని మధుసూదనాచారి కుమారుడు, రమ్య తండ్రి వెంకటరమణ అన్నారు. ఈ నెల 1న బంజారాహిల్స్ రోడ్ నంబర్-3లోని పంజగుట్ట హిందూశ్మశాన వాటికముందు జరిగిన ఘోర కారు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన మధుసూదనాచారి(65) సోమవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. -
చిన్నారి రమ్య కుటుంబంలో మరో విషాదం
హైదరాబాద్: మందు బాబుల నిర్లక్ష్యానికి ఇటీవల మృతిచెందిన రమ్య కుటుంబంలో మరో విషాద సంఘటన చోటుచేసుకుంది. అదే ప్రమాదంలో రమ్యతో పాటు తీవ్రంగా గాయపడిన ఆమె తాత మధుసూధనాచారి(65) చికిత్స పొందుతూ మృతిచెందారు. ఈ నెల 1న బంజారాహిల్స్ రోడ్ నంబర్-3లోని పంజగుట్ట హిందూశ్మశాన వాటికముందు జరిగిన ఘోర కారు ప్రమాదంలో మధుసూదనాచారి తీవ్రంగా గాయపడ్డారు. పీకలదాకా మద్యం సేవించిన యువకులు వస్తున్న కారు డివైడర్‌ను ఢీకొని మధుసూదనాచారి కుటుంబం ప్రయాణిస్తున్నకారుపై పడింది. ఈ దుర్ఘటనలో పమ్మి రాజేష్(34) అక్కడికక్కడే మృతి చెందాడు. కారులో ఉన్న చిన్నారి రమ్య(8)కి తీవ్ర గాయాలు కావడంతో కేర్ ఆస్పత్రిలో చేర్చగా బ్రెయిన్ డెడ్ అయి కోమాలోకి వెళ్లి 9 రోజుల తర్వాత మృతిచెందింది. పక్కనే కూర్చున్న మధుసూదనాచారి(65) వెన్నుపూస విరగడంతో ఆయనను యశోద ఆస్పత్రిలో చేర్చారు. ఆరోగ్యం విషమించడంతో వారం రోజులుగా ఐసీయూలోనే చికిత్స అందిస్తున్నారు. 18 రోజులపాటూ మృత్యువుతో పొరాడి సోమవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. పాప పక్కనే కూర్చొని మొదటి రోజు స్కూల్ కబుర్లు వింటున్న తల్లి రాధిక(32) ఈ ప్రమాదంలో కుడి కాలు విరిగి ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. డ్రైవర్ సీటు పక్కన కూర్చున్న రాజేష్ సోదరుడు రమేష్(40) ఈ ప్రమాదంలో వెన్నెముక విరిగి చికిత్స పొందుతున్నారు. ఇప్పటికే రమ్య, రాజేష్‌లు మృతిచెందగా.. ఈ రోజు ఇంటి పెద్దదిక్కైన మధుసూధనాచారి కూడా అనంత లోకాలకు వెళ్లిపోవడంతో.. కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. 'నా కూతురిని, తమ్ముడిని పోగొట్టుకున్నా. ఇప్పుడు తండ్రిని కూడా కోల్పోయా. దీనికి కారణమైన నిందితులను కఠినంగా శిక్షించాలి' అని రమ్య తండ్రి రమణ అన్నారు.