చిన్నారి రమ్య కుటుంబంలో మరో విషాదం
హైదరాబాద్: మందు బాబుల నిర్లక్ష్యానికి ఇటీవల మృతిచెందిన రమ్య కుటుంబంలో మరో విషాద సంఘటన చోటుచేసుకుంది. అదే ప్రమాదంలో రమ్యతో పాటు తీవ్రంగా గాయపడిన ఆమె తాత మధుసూధనాచారి(65) చికిత్స పొందుతూ మృతిచెందారు. ఈ నెల 1న బంజారాహిల్స్ రోడ్ నంబర్-3లోని పంజగుట్ట హిందూశ్మశాన వాటికముందు జరిగిన ఘోర కారు ప్రమాదంలో మధుసూదనాచారి తీవ్రంగా గాయపడ్డారు. పీకలదాకా మద్యం సేవించిన యువకులు వస్తున్న కారు డివైడర్‌ను ఢీకొని మధుసూదనాచారి కుటుంబం ప్రయాణిస్తున్నకారుపై పడింది. ఈ దుర్ఘటనలో పమ్మి రాజేష్(34) అక్కడికక్కడే మృతి చెందాడు. కారులో ఉన్న చిన్నారి రమ్య(8)కి తీవ్ర గాయాలు కావడంతో కేర్ ఆస్పత్రిలో చేర్చగా బ్రెయిన్ డెడ్ అయి కోమాలోకి వెళ్లి 9 రోజుల తర్వాత మృతిచెందింది. పక్కనే కూర్చున్న మధుసూదనాచారి(65) వెన్నుపూస విరగడంతో ఆయనను యశోద ఆస్పత్రిలో చేర్చారు. ఆరోగ్యం విషమించడంతో వారం రోజులుగా ఐసీయూలోనే చికిత్స అందిస్తున్నారు. 18 రోజులపాటూ మృత్యువుతో పొరాడి సోమవారం ఉదయం తుదిశ్వాస విడిచారు.
పాప పక్కనే కూర్చొని మొదటి రోజు స్కూల్ కబుర్లు వింటున్న తల్లి రాధిక(32) ఈ ప్రమాదంలో కుడి కాలు విరిగి ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. డ్రైవర్ సీటు పక్కన కూర్చున్న రాజేష్ సోదరుడు రమేష్(40) ఈ ప్రమాదంలో వెన్నెముక విరిగి చికిత్స పొందుతున్నారు. ఇప్పటికే రమ్య, రాజేష్‌లు మృతిచెందగా.. ఈ రోజు ఇంటి పెద్దదిక్కైన మధుసూధనాచారి కూడా అనంత లోకాలకు వెళ్లిపోవడంతో.. కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
'నా కూతురిని, తమ్ముడిని పోగొట్టుకున్నా. ఇప్పుడు తండ్రిని కూడా కోల్పోయా. దీనికి కారణమైన నిందితులను కఠినంగా శిక్షించాలి' అని రమ్య తండ్రి రమణ అన్నారు.