'రమ్య కుటుంబాన్ని సీఎం వద్దకు తీసుకెళ్తా'
హైదరాబాద్: రమ్య కుటుంబ సభ్యులకు జరిగిన అన్యాయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకెళతానని వెస్ట్ జోన్ డీసీపీ వెంకటేశ్వరరావు, టాస్క్ ఫోర్స్ డీసీపీ లింబారెడ్డి అన్నారు. పంజాగుట్ట కారు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్న రమ్య తాత కూడా చనిపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. తమకు న్యాయం జరిగే వరకు మృతదేహాన్ని తీసుకెళ్లనివ్వబోమన్నారు.
అంతకుముందే రమ్య, ఆమె బాబాయ్ రాజేశ్ చనిపోయిన విషయం తెలిసిందే. దీంతో తీవ్రంగా కలత చెందిన కుటుంబ సభ్యులు రమ్య తాత మధుసూదనాచారి మృతదేహం వద్ద తీవ్రంగా విలపిస్తూ నిరసనకు దిగారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు డీసీపీ వెంకటేశ్వరరావు, టాస్క్ ఫోర్స్ డీసీపీ లింబారెడ్డి వారి కుటుంబ సభ్యులతో చర్చలు జరిపారు. అవి సఫలం కావడంతో మృతేదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రి మార్చురీకి తరలించారు.
న్యాయం చేస్తాం: తలసాని
రమ్య కుటుంబ సభ్యులకు న్యాయం చేస్తామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. వైద్య ఖర్చులను భరించే విషయంపై ముఖ్యమంత్రితో చర్చిస్తామని చెప్పారు. రమ్య కుటుంబ సభ్యులను ముఖ్యమంత్రి కేసీఆర్ వద్దకు తీసుకెళ్తానని ఆయన చెప్పారు. ప్రమాదానికి కారణమైన వారిపై చట్టపరంగా చర్యలు ఉంటాయని తలసాని అన్నారు. భవిష్యత్ లో ఇలాంటి ఘటనలు పునరావృతంకాకుండా చూసుకుంటామని చెప్పారు.