విశ్వబ్రాహ్మణులు అభివృద్ధి చెందాలి
విశ్వబ్రాహ్మణులు అభివృద్ధి చెందాలి
Published Tue, Aug 16 2016 11:57 PM | Last Updated on Mon, Oct 8 2018 3:44 PM
యాదగిరిగుట్ట: ప్రదేశాల్లో భక్తుల ఆకలి తీరుస్తున్న అన్నదాన సత్రాలు ఎంతో గొప్పవని, అన్ని దానాల కంటే.. అన్నదానం గొప్పదని శాసనసభ స్పీకర్ సిరికొండ మధుసూదనచారి అన్నారు. యాదగిరిగుట్టలో విశ్వబ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేయనున్న అన్నదాన సత్రానికి భువనగిరి ఎంపీ బూర నర్సయ్యగౌడ్, ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్‌రెడ్డిలతో కలిసి ఆయన మంగళవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా స్పీకర్ మాట్లాడుతూ ఇలాంటి అన్నదాన సత్రాలు నిర్మించి అన్నప్రసాదం అందించడంతో ఎంతో మంది భక్తులు, ప్రజలు గుర్తు చేసుకుంటారన్నారు. విశ్వ బ్రాహ్మణుల్లో అనైక్యతతో ప్రస్తుత కాలంలో వారికి డబ్బు, రాజ్యాధికారం లేదన్నారు. ఇకనైనా ఐక్యతతో ముందుకు సాగి అభివృద్ధి చెందాలన్నారు. విశ్వబ్రాహ్మణులకు అనేక రకాలుగా సాయం అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. భువనగిరి ఎంపీ బూర నర్సయ్యగౌడ్, ప్రభుత్వ విప్ గొంగిడి సునీత మాట్లాడుతూ పోటీ ప్రపంచంలో విశ్వబ్రాహ్మణులు పారిశ్రామికంగా సైతం ఎదగాలని సూచించారు. రాష్ట్ర అధ్యక్షుడు కుందారం గణేషాచారి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వేములవాడ మధన్‌మోహన్, రాష్ట్ర కార్యదర్శి వడ్లోజు వెంకటేశ్, గౌరవ అధ్యక్షుడు శివకోటి వీరస్వామి, వడ్లోజు మన్మథాచారి, రాష్ట్ర మాజీ అధ్యక్షుడు పసూనూరి బ్రహ్మనందచారి, మండల అధ్యక్షుడు చెన్నోజు భగవంతాచారి, కందోజు నర్సింహాచారి, శివకోటి భాస్కరాచారి, కందుకూరి నాగభూషణం, కోటగిరి విద్యాధర్‌చారి, జనగాం రత్నయ్యచారి ఉన్నారు.
Advertisement