
గతంకంటే భిన్నంగా సమావేశాలు
అసెంబ్లీ సమావేశాలపై స్పీకర్ మధుసూదనాచారి
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ సమావేశాలు గతం కంటే ఎంతో భిన్నంగా జరుగుతున్నాయని శాసనసభ స్పీకర్ ఎస్.మధుసూదనాచారి అన్నారు. కొత్త రాష్ట్రమైనా కేవలం మూడేళ్లలో ఎన్నో రంగాల్లో అభివృద్ధిలో పురోగమిస్తోందని, మూడేళ్లుగా సాగుతున్న అసెంబ్లీ సమావేశాల తీరు సంతృప్తికరంగా ఉందని ఆయన పేర్కొన్నారు. రాష్ట్ర అసెంబ్లీ మీడియా సలహా కమిటీ (ఎంఏసీ) తొలి సమావేశం సోమవారం అసెంబ్లీ సమావేశ మందిరంలో జరిగింది.శాసన మండలి చైర్మన్ స్వామిగౌడ్, ఎంఏసీ చైర్మన్ వి.సూరజ్‌కుమార్, కమిటీ సభ్యులు, శాసనసభ కార్యదర్శి రాజసదారాం ఇందులో పాల్గొన్నారు.
మీడియా లాంజ్‌లో ఏర్పాట్లు, అసెంబ్లీ గ్యాలరీ పాసులు, సీట్ల కేటాయింపు, పార్కింగ్, శాసనసభ వార్తలను కవర్ చేసే మీడియా ప్రతినిధులకు ఓరియంటేషన్ తదితర అంశాలపై చర్చ జరిగింది. ప్రస్తుత అసెంబ్లీ సమావేశాలను ప్రజలంతా చూస్తున్నారని, ఈ నేపథ్యంలోనే సమస్యలపై ఎప్పటికప్పుడు చర్చించి మీడియా కమిటీ సహకారంతో ముందుకు సాగుదామని స్పీకర్ అన్నారు. తరచూ ఇలాంటి సమావేశాల ద్వారా సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించుకోవచ్చని స్వామిగౌడ్ అభిప్రాయపడ్డారు. జర్నలిస్టుల సంక్షేమం కోసం ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటోందని ఆయన చెప్పారు.