సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితిలో టికెట్ల చిచ్చు కొనసాగుతోంది. అభ్యర్థిత్వం కావాలని కొందరు, అభ్యర్థులను మార్చాలని మరికొందరు అధిష్టానానికి డిమాండ్లు వినిపిస్తున్నారు. 20కిపైగా అసెంబ్లీ నియోజకవర్గాల్లో అసమ్మతి కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. అసమ్మతి, అసంతృప్త నేతలతో అభ్యర్థులు చర్చలకు ప్రయత్నిస్తున్నా వారు అంగీకరించకపోవడంతో మంత్రి కేటీఆర్‌కు విన్నవించుకుంటున్నారు. కేటీఆర్‌తో చర్చల సమయంలో అన్నింటికీ అంగీకరిస్తూనే నియోజకవర్గానికి వెళ్లాక మాత్రం అభ్యర్థులకు పోటాపోటీగా కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. కొన్ని నియోజకవర్గాల్లో అసమ్మతి నేతలు కేటీఆర్‌తో చర్చలకు సైతం రావడంలేదు.
ఆశావహులు ఎందరో...
టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ ఒకేసారి 105 అభ్యర్థులను ప్రకటించారు. టీఆర్‌ఎస్‌కు ఉన్న 90 మంది ఎమ్మెల్యేలలో 83 మందికి అభ్యర్థులుగా మళ్లీ అవకాశం ఇచ్చారు. జాబితా ప్రకటించగానే కొందరు అభ్యర్థుల పేర్లు మారతాయనే ప్రచారం మొదలైంది. దీంతో టికెట్ ఆశించి భంగపడ్డ అసమ్మతి నేతలు అభ్యర్థుల కంటే ముందే ప్రచారంలోకి దిగారు. మరికొన్ని నియోజకవర్గాల్లో అభ్యర్థిని మారిస్తేనే పార్టీ విజయం సాధిస్తుందని అసమ్మతి వ్యక్తం చేస్తున్నారు.
20కిపైగా నియోజకవర్గాల్లో రెబల్స్...
- శాసనసభ స్పీకర్ మధుసూదనచారి భూపాలపల్లిలో ప్రచారం ప్రారంభించకముందే అసమ్మతి నేత గండ్ర సత్యనారాయణరావు ప్రచారంలోకి దిగారు. టీఆర్‌ఎస్ టికెట్ ఇస్తామని కేటీఆర్, కరీంనగర్ ఎంపీ వినోద్‌కుమార్ హామీ ఇచ్చినందునే పార్టీలో చేరానని, కానీ తనకు అన్యాయం జరిగిందని చెబుతున్నారు.
- ములుగులో మంత్రి చందులాల్‌ను మార్చాలని ద్వితీయశ్రేణి నేతలు డిమాండ్ చేస్తున్నారు. పోరిక గోవింద్ నాయక్, తాటి కృష్ణ, రూప్‌శంకర్‌లలో ఒకరికి టికెట్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.
- స్టేషన్ ఘన్‌పూర్ నియోజకవర్గంలో తాజా మాజీ ఎమ్మెల్యే టి. రాజయ్యను తొలగించి ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరికి టికెట్ ఇవ్వాలని ద్వితీయశ్రేణి నేతలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
- పాలకుర్తి నియోజకవర్గంలో టీఆర్‌ఎస్ అధికారిక అభ్యర్థి ఎర్రబెల్లి దయాకర్‌రావుకు పోటీగా టీఆర్‌ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తక్కళ్లపల్లి రవీందర్‌రావు ప్రచారాన్ని ప్రారంభించారు.
- జనగామ అభ్యర్థి ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డిని మారిస్తేనే టీఆర్‌ఎస్ గెలుస్తుందని, అభ్యర్థిని మార్చకుంటే ప్రచారం చేయబోమని ద్వితీయశ్రేణి నేతలు ప్రకటనలు చేస్తున్నారు.
- మహబూబాబాద్ అభ్యర్థి శంకర్ నాయక్‌ను మార్చాలంటూ ప్రచారంలో అడ్డుకుంటున్నారు.
- వేములవాడలో టీఆర్‌ఎస్ అభ్యర్థి రమేశ్‌బాబును తప్పించి ఎవరికి టికెట్ ఇచ్చినా పార్టీని గెలిపించుకుంటామని ద్వితీయశ్రేణి నేతలు చెబుతున్నారు. కరీంనగర్ జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ తుల ఉమ ఇక్కడ టికెట్ ఆశిస్తున్నారు.
- రామగుండంలో తాజా మాజీ ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణతోపాటు కోరుకంటి చందర్ ఎవరికి వారు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
- ఆలేరులో గొంగడి సునీతను మార్చకుంటే ఆమెను ఓడిస్తామని కార్యకర్తలు హెచ్చరిస్తున్నారు.
- ఖానాపూర్‌లో రేఖానాయక్‌కు పోటీగా రమేశ్ రాథోడ్ సిద్ధమయ్యారు. లంబాడీ వర్గం నేతలకు టికెట్ ఇవ్వడాన్ని ఆదివాసీలు వ్యతిరేకిస్తున్నారు.
- నల్లగొండ అభ్యర్థి కంచర్ల భూపాల్‌రెడ్డికి పోటీగా దుబ్బాక నరసింహారెడ్డి ప్రచారం చేస్తున్నారు.
- మునుగోడు తాజా మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డికి పోటీగా వేనేపల్లి వెంకటేశ్వర్‌రావు ప్రచారం చేస్తున్నారు. కచ్చితంగా పోటీలో ఉంటానని ప్రకటిస్తున్నారు.
- దేవరకొండ నియోజకవర్గంలో తాజా మాజీ ఎమ్మెల్యే రవీంద్రకుమార్‌కు మళ్లీ టికెట్ ఇవ్వగా జిల్లా పరిషత్ చైర్మన్ బాలూనాయక్ పోటీలో స్వతంత్ర అభ్యర్థిగా దిగేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు.
- మిర్యాలగూడలో తాజా మాజీ ఎమ్మెల్యే భాస్కర్‌రావుకు టికెట్ ఇవ్వగా గత ఎన్నికల్లో టీఆర్‌ఎస్ తరఫున పోటీ చేసి ఓడిపోయిన అలుగుబెల్లి అమరేందర్‌రెడ్డి సైతం టికెట్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ సొంతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు.
- నాగార్జునసాగర్‌లో నియోజకవర్గ ఇన్‌చార్జి నోముల నర్సింహయ్యకు టికెట్ కేటాయించడంపై పార్టీ నేతలు భగ్గుమన్నారు. స్థానికుడికే టికెట్ ఇవ్వాలని ఎం.సి. కోటిరెడ్డి, బొల్లెపల్లి శ్రీనివాసరాజు భారీ కార్యక్రమాన్ని నిర్వహించారు.
- ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో టీఆర్‌ఎస్ అధికారిక అభ్యర్థి మంచిరెడ్డి కిషన్‌రెడ్డికి వ్యతిరేకంగా గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన కంచర్ల చంద్రశేఖర్‌రెడ్డి పోటీ చేసేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు.
- రాజేంద్రనగర్ సెగ్మెంట్‌లో పార్టీ అభ్యర్థి టి. ప్రకాశ్‌రెడ్డికి పోటీగా టికెట్ ఆశించి భంగపడ్డ తోకల శ్రీశైలంరెడ్డి బరిలో ఉంటారని చెబుతున్నారు.
- షాద్‌నగర్ అభ్యర్థి అంజయ్య యాదవ్‌కు పోటీగా వి.శంకర్, అందె బాబయ్యలలో ఒకరు పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారు.
- మక్తల్ అభ్యర్థి చిట్టెం రామ్మోహన్‌రెడ్డికి వ్యతిరేకంగా మహబూబ్‌నగర్ ఎంపీ జితేందర్‌రెడ్డి అనుచరులుగా ముద్రపడిన ఆరుగురు నేతలు ఒక్కటయ్యారు. తమలో ఒకరికి టికెట్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.
- పటాన్‌చెరు టికెట్ మహిపాల్‌రెడ్డికే ఇవ్వగా పార్టీ నేతలు సఫాన్‌దేవ్, కె. బాల్‌రెడ్డి, గాలి అనిల్‌కుమార్ టికెట్ ఆశిస్తూ బలప్రదర్శనకు సిద్ధమవుతున్నారు.
- నారాయణఖేడ్‌లో తాజా మాజీ ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డికి వ్యతిరేకంగా ఎమ్మెల్సీ రాములు నాయక్ టికెట్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.
- ఆందోల్‌లో నియోజకవర్గ నేతలకు చెప్పకుండా పార్టీ అభ్యర్థిని ఖరారు చేసినందుకు నిరసనగా టీఆర్‌ఎస్ ఏకైక జెడ్పీటీసీ సభ్యురాలు మమత బ్రహ్మం పార్టీకి రాజీనామా చేశారు.
- సత్తుపల్లి అభ్యర్థి పిడమర్తి రవికి పోటీగా గత ఎన్నికల్లో ద్వితీయ స్థానంలో నిలిచిన మట్టా దయానంద్ ప్రచారాన్ని మొదలుపెట్టారు.
- వైరా అభ్యర్థి మదన్ లాల్‌ను మార్చాలని అసంతృప్తులు డిమాండ్ చేస్తున్నారు.
చల్లారని అసమ్మతి
Published Wed, Sep 19 2018 3:06 AM | Last Updated on Wed, Sep 19 2018 3:17 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment