స్వచ్ఛ సిద్దిపేటకు రాజముద్ర
♦ వంద శాతం మరుగుదొడ్ల నిర్మాణం
♦ దేశంలో తొలి నియోజకవర్గంగా రికార్డు
♦ అధికారికంగా ప్రకటించిన స్పీకర్ మధుసూదనాచారి
♦ రాష్ట్రమంతటా ఇదేస్ఫూర్తి కొనసాగించాలని పిలుపు
♦ ‘రాజముద్ర’కు సంకేతంగా బ్యాండ్ కొట్టిన మండలి చైర్మన్ స్వామిగౌడ్
సిద్దిపేట జోన్: వంద శాతం వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణంతో దేశంలోనే కొత్త చరిత్ర సృష్టించిన మెదక్ జిల్లా సిద్దిపేట నియోజకవర్గానికి శుక్రవారం రాజముద్ర పడింది. శాసనసభ స్పీకర్ మధుసూదనాచారి అధికారిక ప్రకటన చేయగా.. శాసన మండలి చైర్మన్ స్వామిగౌడ్ రాజముద్రకు సంకేతంగా బ్యాండ్ కొట్టి సంబురాలు నిర్వహించారు. నియోజకవర్గ పరిధిలోని 64,733 నివాస గృహాలకు 58,202 వ్యక్తిగత మరుగుదొడ్లు ఉండగా నెల రోజుల్లోనే స్వచ్ఛ భారత్, స్వచ్ఛ తెలంగాణలో భాగంగా నియోజకవర్గంలో 5,531 మరుగుదొడ్లను నిర్మించి వంద శాతం లక్ష్యాన్ని చేరుకున్నారు. దీంతో దేశంలోనే బహిరంగ మలవిసర్జన లేని నియోజకవర్గంగా సిద్దిపేటను అధికారికంగా ప్రకటించారు.
ఈ సందర్భంగా స్థానిక పత్తి మార్కెట్ యార్డులో నిర్వహించిన సమావేశంలో స్పీకర్ మాట్లాడారు. వంద శాతం వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మాణం కావడం అభినందనీయమని, సిద్దిపేట నేడు రాష్ట్రానికి మరో స్ఫూర్తి దాయకంగా నిలిచిందని కితాబిచ్చారు. అసాధ్యాలను సాధ్యం చేసే ఘనతను సిద్దిపేట దక్కించుకోవడం గొప్ప విషయమని పేర్కొన్నారు. వంద శాతం మరుగుదొడ్ల నిర్మాణ పథకం సిద్దిపేటకే పరిమితం కాకుండా రాష్ట్ర మంతా విస్తరించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఇదే స్ఫూర్తితో తన నియోజకవర్గం భూపాలపల్లిలో వంద శాతం మరుగుదొడ్ల నిర్మాణానికి కృషి చేస్తానన్నారు. సమాజాన్ని ఆలోచింపజేసే కార్యక్రమాన్ని చేపట్టి విజయవంతమైన సిద్దిపేటకు హరీశ్‌రావులాంటి నాయకుడు దొరకడం ఈ ప్రాంత ప్రజల అదృష్టమన్నారు.
సిద్దిపేట అంటే.. ఒక చరిత్ర, ఒక ఉద్యమం, ఒక శక్తి, అభివృద్ధి అని ఆయన అభివర్ణించారు. అంతకుముందు గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి జ్యోతి ప్రజ్వలన చేసి అధికారికంగా ప్రకటన చేశారు. ప్రకటన కొనసాగుతున్న సేపు పత్తిమార్కెట్ యార్డులో బాణా సంచాల మోత, ప్రజా ప్రతినిధుల, అధికారుల కరతాళ ధ్వనులతో సంబురాలు అంబురాన్ని అంటాయి. కార్యక్రమంలో హోంశాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డి, భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు, ఎంపీ ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్సీలు యాదవరెడ్డి, ఫారూక్‌హుస్సేన్, సుధాకర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ భూపాల్‌రెడ్డి, సీఎం ఓఎస్‌డీలు దేశపతి శ్రీనివాస్, ప్రియాంక నర్గీస్, కలెక్టర్ రోనాల్డ్ రాస్ తదితరులు పాల్గొన్నారు.