ఆర్టీసీని ఆదరించండి | speaker madhusudhana chary visits bhupalpally | Sakshi
Sakshi News home page

ఆర్టీసీని ఆదరించండి

Published Tue, Jun 27 2017 4:37 PM | Last Updated on Mon, Aug 20 2018 6:47 PM

ఆర్టీసీని ఆదరించండి - Sakshi

ఆర్టీసీని ఆదరించండి

 కార్లు ఉన్నా బస్సుల్లో ప్రయాణించండి
 ప్రజలకు పిలుపునిచ్చిన స్పీకర్‌ ‘సిరికొండ’
 భూపాలపల్లి నుంచి వరంగల్‌కు బస్సులో ప్రయాణించిన  మధుసూదనాచారి
 
శాయంపేట(భూపాలపల్లి): తెలంగాణ ప్రభుత్వం ప్రజలకు మెరుగైన రవాణా సౌక్యం కల్పిస్తోంది.. ఆర్టీసీ బస్సుల్లోనే ప్రయాణించి సంస్థను ఆదరించాలని స్పీకర్‌ సిరికొండ మధుసూదనాచారి పిలుపునిచ్చారు. స్పీకర్‌గా ఉన్నప్పటికీ తాను నెలలో ఒకసారైనా ఆర్టీసీ పల్లెవెలుగు బస్సులోనే ప్రయాణిస్తానని, టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు సైతం దీనిని పాటించాలని సూచించారు. భూపాలపల్లి జిల్లా కేంద్రం నుంచి రేగొండ మండల పరిధి గ్రామాలు, శాయంపేట మండలంలోని గంగిరేణిగూడెం, వసంతాపూర్, ప్రగతిసింగారం, పత్తిపాక, శాయంపేట, మాందారిపేట మీదుగా హన్మకొండకు ఆర్టీసీ బస్సును సోమవారం పునరుద్ధరించారు. ఈ సందర్భంగా స్పీకర్‌ మాట్లాడుతూ  గతంలో ఈ రూట్‌లో ఆర్టీసీ బస్సు నడిచినప్పటికీ ఆదరణలేక నిలిపివేశారని, ఇన్నాళ్లుకు పునరుద్ధరించినందుకు ఆనందంగా ఉందన్నారు.
 
తెలంగాణ రాకముందు భూపాలపల్లిలో 37 బస్సులు మాత్రమే ఉండేవని, ప్రత్యేక రాష్ట్రంలో మరో 57 కొత్త బస్సులు అందించామని చెప్పారు. అత్యధికంగా గ్రామీణ ప్రజలకు జీవితకాలంలో ఎక్కువ సేవచేసేది ఆర్టీసీ మాత్రమేనని, ప్రతి ఒక్కరూ ఈ సేవలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. మనలో ఎంత మం దికి కార్లు, ద్విచక్రవాహనాలు ఉన్నప్పటికీ బస్సులో ప్రయాణించాల ని, తద్వారా వాతావరణ కాలుష్యం నుంచి గ్రామాలను కాపాడుకోవచ్చని పేర్కొన్నారు. ఆర్టీసీ బస్సులో ప్రయాణం సురక్షితమని, రోడ్డు ప్రమాదాలను సైతం నివారించవచ్చని తెలిపారు. ప్రజలు ఆదరించకపోతే మళ్లీ బస్సు నిలిపివేసే ప్రమాదం ఉందని, దీంతో సామాన్యులు ఇబ్బందులు పడే పరిస్థితి ఏర్పడుతుందన్నారు. త్వరలో పెద్దకోడెపాక, కొప్పుల గ్రామాలకు సైతం బస్సు ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement