35శాఖల అధికారులతో సమీక్షించిన కలెక్టర్
ఆకస్మిక తనిఖీలు ఉంటాయి జాగ్రత్త!
జిల్లా యంత్రాంగానికి దిశానిర్దేశం
సాక్షి, నాగర్‌కర్నూల్ :
ఇప్పుడిప్పుడే పురుడు పోసుకున్న నాగర్‌కర్నూల్ కొత్త జిల్లాలో పరిపాలన పట్టాలెక్కుతోంది. రాష్ట్రంలోనే విస్తీర్ణంలో రెండో పెద్ద జిల్లాగా అవతరించిన కందనూలు కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టిన ఈ.శ్రీధర్ శరవేగంగా జిల్లాలోని ప్రభుత్వ యంత్రాంగాన్ని పాలనకు సంసిద్ధులను చేస్తున్నారు. ఇందులోభాగంగా ఆయన జిల్లాలోని 35ప్రధాన శాఖల అధికారులతో మూడు రోజుల్లో సమీక్షా సమావేశాలను పూర్తిచేశారు. కొత్త జిల్లాలో పాలనలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, సమస్యలపై స్పందించాల్సిన తీరును జిల్లా యంత్రాంగానికి చెవిలో గూడు కట్టుకుని వివరిస్తున్నారు. తాజాగా జిల్లాలోని 20మంది తహసీల్దార్లు, మరో 20మంది ఎంపీడీఓలతో గురువారం వేర్వేరుగా జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయంలో ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేసి వారికి దిశానిర్దేశం చేశారు. గ్రామస్థాయి నుంచి అధికారులను అప్రమత్తం చేయాలని, ప్రజలకు ఎక్కడా ఎలాంటి పాలనాపరమైన ఇబ్బందులు కలగకుండా చూడాలని కలెక్టర్ ఆదేశించారు. చిన్న జిల్లా కావడంతో పాలనా సౌలభ్యం మెరుగైందని, మండలాలు పాలనకు అనుకూలంగా మారాయని, తహసీల్దార్లు మండల స్థాయిలో మెరుగైన పాలన అందించాలని సూచించారు.
గ్రామాల్లో సంక్షేమ పథకాలు సమర్థవంతంగా అమలు చేయడంలోఎంపీడీఓలదే కీలకపాత్ర అని, ఎక్కడా ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లకు లోనుకాకుండా పనిచేయాలన్నారు. ప్రభుత్వపరంగా మంజూరయ్యే నిధులన్నీ ప్రజా అవసరాలకు ఉపయోగపడేలా చర్యలు తీసుకోవాలని కోరారు. కార్యాలయాల్లో అవినీతికి ఆస్కారం లేకుండా ఆయా మండలాల అధికారులే చర్యలు చేపట్టాలని, మాట వినని వారెవరైనా ఉంటే తమ దృష్టికి తేవాలన్నారు. జిల్లాలోని మూడు రెవెన్యూ డివిజన్లతోపాటు 20మండలాల్లో మొత్తం 200 గ్రామాలు ఉన్నాయని, వీటితో అధికారులందరికీ ప్రత్యక్ష సంబంధాలు ఉండాలని కలెక్టర్ సూచించారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు. మరో పది రోజుల్లో అసలైన పరిపాలన ప్రారంభమవుతుందని ఈ సందర్భంగా కలెక్టర్ అన్నారు. ఈ సమావేశంలో ఇతర శాఖల అధికారులూ పాల్గొన్నారు.
స్పీకర్‌ను కలసిన ప్రజాప్రతినిధులు
అచ్చంపేట రూరల్: తెలంగాణ శాసనసభ స్పీకర్ మధుసూదనాచారి జన్మదినం సందర్భంగా గురువారం అచ్చంపేట కౌన్సిలర్లు డాక్టర్ విష్ణుమూర్తి, అంతటి శివ, పులిజాల ఎంపీటీసీ సభ్యుడు జ్యోతి రామాచారి శుభాకాంక్షలు తెలిపారు. హైదరాబాద్ నగరంలోని ఆయన స్వగృహంలో స్పీకర్‌ను కలిసి పుష్పగుచ్ఛం అందజేసి నల్లమల ప్రాంతంలోని సమస్యలను స్పీకర్ దృష్టికి తీసుకెళ్లినట్లు వారు తెలిపారు.