
సాక్షి, హైదరాబాద్: శాసనసభ సమావేశాల తీరుపై విపక్ష సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. స్పీకర్ సభ నడిపే తీరు గౌరవంగా లేదంటూ ఆయన చాంబర్‌కు వెళ్లి నిరసన తెలిపారు. ఈ పరిస్థితి మారకపోతే తాము శాసనసభకు రావాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. బుధవారం ప్రశ్నోత్తరాల అనంతరం శాసనసభాపతి మధుసూదనాచారితో కాంగ్రెస్ సభ్యులు భేటీ అయ్యారు. బీజేపీ, టీడీపీ, సీపీఎం సభ్యులతో కలసి స్పీకర్‌తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా సభ జరుగుతున్న తీరుపై కాంగ్రెస్ సభ్యులు తమ అసంతృప్తిని వ్యక్తం చేశారు.
ప్రతిపక్ష నాయకుడికి గౌరవం ఇవ్వకపోవడంతో సభకు హుందాతనం పోతోందని స్పీకర్‌కు విన్నవించారు. సభా నాయకుడికి, ప్రధాన ప్రతిపక్ష నాయకుడికి మధ్య సమన్వయం చేయాలని సూచించారు. ప్రతిపక్ష నేతకు మైక్ ఇవ్వకుండా స్పీకర్ ఏకపక్షంగా వ్యవహరించటం సరికాదన్నారు. స్పీకర్, శాసనసభ గురించి మాట్లాడే పరిస్థితి రావటం దురదృష్టకరమని ఆవేదన వ్యక్తం చేశారు. సభ నిర్వహణ సజావుగా లేకపోతే బాధ్యత స్పీకర్‌దేనని, ఇది మీ గౌరవానికి కూడా మంచిదికాదని స్పీకర్‌కు విన్నవించారు. అసెంబ్లీ ప్రభుత్వ సచివాలయం కాదని, అన్ని రాజకీయ పార్టీలకు వేదిక లాంటిదని విపక్ష సభ్యులు స్పీకర్ దృష్టికి తీసుకెళ్లారు.