సాక్షి, హైదరాబాద్: ఆది నుంచీ అనేక మలు పులు తిరుగుతూ వస్తున్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఎస్.ఎ.సంపత్ కుమార్‌ల సభా బహిష్కరణ వ్యవహారంలో మంగళవారం సంచలన పరిణామం చోటు చేసుకుంది. ఎమ్మెల్యేల సభా బహిష్కరణ తీర్మానాన్ని, వారు ప్రాతినిధ్యం వహిస్తున్న అసెంబ్లీ స్థానాలు ఖాళీ అయినట్టు ప్రకటిస్తూ జారీ చేసిన నోటిఫికేషన్‌ను రద్దు చేస్తూ తానిచ్చిన తీర్పును అమలు చేయకపోవడంపై హైకోర్టు ఆగ్రహించింది. తీర్పును అమలు చేయనందుకు కోర్టు ధిక్కారం కింద ఎందుకు నోటీసులు జారీ చేయరాదో వివరణ ఇవ్వాలంటూ స్పీకర్ సిరికొండ మధుసూదనాచారికి షోకాజ్ నోటీసులు జారీ చేసింది! అంతేగాక కోర్టు ధిక్కార వ్యాజ్యంలో సహ ప్రతివాదిగా చేర్చి, ఫాం 1 నోటీసులిచ్చి వ్యక్తిగత హాజరుకు ఆదేశాలు ఎందుకివ్వరాదో కూడా తెలియజేయాలని నోటీసుల్లో స్పీకర్‌కు స్పష్టం చేసింది. బహిష్కరణ నోటిఫికేషన్ ఉపసంహరణకు స్పీకర్ అనుమతివ్వకపోవడం ఎలా చూసినా కోర్టు తీర్పును అమలు చేయకపోవడమేనని తేల్చి చెప్పింది. ఈ వ్యవహారంలో కోర్టు తీర్పు పట్ల స్పీకర్ ఉద్దేశపూర్వక నిర్లక్ష్యం ప్రదర్శించారని ఆక్షేపించింది.
‘‘ఇందుకు కోర్టు ధిక్కార పిటిషన్‌లో స్పీకర్‌ను నేరుగా ప్రతివాదిగా చేర్చే అవకాశమున్నా అలా చేయకుండా నిగ్రహం పాటిస్తున్నాం. అలా ఎందుకు చేర్చకూడదో చెప్పాల్సిందిగా స్పీకర్‌ను కోరుతున్నాం’అని షోకాజ్ నోటీసుల్లో పేర్కొంది. న్యాయమూర్తి జస్టిస్ బి.శివశంకరరావు మంగళవారం ఈ మేరకు సంచలన ఉత్తర్వులు జారీ చేశారు. ఓ స్పీకర్‌కు నోటీసులు జారీ చేయడం, అది కూడా కోర్టు ధిక్కారం కింద ఎందుకు చర్యలు తీసుకోరాదో వివరించాలని కోరడం హైకోర్టు చరిత్రలో ఇదే తొలిసారి. కోమటిరెడ్డి, సంపత్ భద్రతను పునరుద్ధరించకపోవడంపైనా న్యాయమూర్తి స్పందించారు. డీజీపీ, నల్లగొండ, జోగులాంబ గద్వాల్ జిల్లాల ఎస్పీలను సుమోటోగా ధిక్కార పిటిషన్‌లో ప్రతివాదులుగా చేర్చారు. ఫాం 1 నోటీసు జారీ చేసి ఎందుకు కోర్టు ధిక్కార చర్యలు తీసుకోరాదో స్వయంగా హాజరై వివరణ ఇవ్వాలని ఆదేశించారు. ఈ వ్యవహారంలో అధికారులంతా మోసగించే ఆలోచలు చేశారని న్యాయమూర్తి తీవ్రస్థాయిలో ఆక్షేపించారు. కోర్టు తీర్పును అమలు చేయకుండా ఏ ఒక్కరూ తప్పించుకోజాలరన్నారన్నారు. తీర్పును అమలు చేసి న్యాయవ్యవస్థ ప్రతిష్టను కాపాడాల్సిందన్నారు. ‘‘బహిష్కరణ తీర్మానం రద్దుతో వారి శాసనసభ్యత్వాలు వాటంతటవే పునరుద్ధరణ అవుతాయి. ఇందుకు ప్రత్యేక ఆదేశాలేవీ అవసరం లేదు. మా తీర్పుతో ఎమ్మెల్యేలిద్దరూ చట్ట ప్రకారం అన్ని సౌకర్యాలకూ అర్హులు. అందులో భాగంగా వారికి గతంలో ఉన్న భద్రతను పునరుద్ధరించాల్సిన బాధ్యత అధికారులపై ఉంది. కానీ ఎస్పీలు తమకు ఆదేశాలు రాలేదంటూ మౌనం వహించారు. కోర్టు తీర్పు ఉన్నాక వారికింకా ఏ ఆదేశాలు అవసరమో అర్థం కాకుండా ఉంది. బహిష్కరణ తీర్మానాన్ని ఉపసంహరించుకోలేదని, కాబట్టి ఎమ్మెల్యేలకు భద్రతను పునరుద్ధరించాల్సిన అవసరం లేదని డీజీపీ నేతృత్వంలోని కమిటీ అభిప్రాయపడింది. ఇదెంతమాత్రమూ సరికాదు’’అని న్యాయమూర్తి స్పష్టం చేశారు. 2018 జనవరి నుంచి ఈ రోజు దాకా కోమటిరెడ్డి, సంపత్‌కుమార్ తీసుకున్న అలవెన్సులు, సమర్పించిన బిల్లుల వివరాలను ముందుంచాలని రిజిస్ట్రీని ఆదేశిస్తూ విచారణను ఈ నెల 28కి వాయిదా వేశారు.
కార్యదర్శులకు ఫాం 1 నోటీసులు
మరోవైపు తమ బహిష్కరణను రద్దు తీర్పును అమలు చేయకపోవడంపై అసెంబ్లీ కార్యదర్శి వి.నరసింహాచార్యులు, న్యాయ శాఖ కార్యదర్శి వి.నిరంజన్‌రావులకు కోర్టు ధిక్కార చట్టం కింద ఫాం 1 నోటీసులను జస్టిస్ శివశంకరరావు జారీ చేశారు. వ్యక్తిగతంగా కోర్టు ముందు హాజరై వివరణ ఇవ్వాలని వారికి స్పష్టం చేశారు. తదుపరి విచారణను సెప్టెంబర్ 17కు వాయిదా వేశారు. వీరిద్దరు కూడా కోర్టు ధిక్కరణకు పాల్పడ్డారనేందుకు ప్రాథమిక ఆధారాలున్నాయని వ్యాఖ్యానించారు.
ఇప్పటిదాకా జరిగింది ఇదీ...
కోమటిరెడ్డి, సంపత్‌కుమార్‌లను బహిష్కరిస్తూ సభ తీర్మానం చేసింది. ఆ వెంటనే వారు ప్రాతినిధ్యం వహిస్తున్న నల్లగొండ, ఆలంపూర్ అసెంబ్లీ స్థానాలు ఖాళీ అయినట్లు ప్రకటిస్తూ నోటిఫికేషన్ జారీ చేశారు. వీటిని సవాలు చేస్తూ వారు హైకోర్టును ఆశ్రయించారు. బహిష్కరణ తీర్మానాన్ని, నోటిఫికేషన్‌ను రద్దు చేస్తూ ఏప్రిల్ 17న జస్టిస్ శివశంకరరావు తీర్పు ఇచ్చారు. దీనిపై అసెంబ్లీ, న్యాయ శాఖ కార్యదర్శులు అప్పీళ్లు దాఖలు చేయలేదు. వారికి బదులు 12 మంది టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు అప్పీల్ దాఖలు చేశారు. వారికి ఆ అర్హత లేదంటూ అప్పీల్‌ను ధర్మాసనం కొట్టేసింది. అయినా అసెంబ్లీ, న్యాయశాఖ కార్యదర్శులు కోర్టు తీర్పును అమలు చేయకపోవడంతో కోమటిరెడ్డి, సంపత్ వారిపై కోర్టు ధిక్కార పిటిషన్ దాఖలు చేశారు. దానిపై విచారణ జరిపిన జస్టిస్ శివశంకరరావు ఇద్దరు కార్యదర్శులూ కోర్టు ధిక్కారానికి పాల్పడ్డారని, అందుకు ప్రాథమిక ఆధారాలున్నాయని పేర్కొన్నారు. వారికి ఫాం 1 నోటీసులిస్తానని స్పష్టం చేశారు. దాంతో కార్యదర్శులు ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం ముందు 61 రోజుల ఆలస్యంతో వేర్వేరుగా అప్పీళ్లు దాఖలు చేశారు. ధర్మాసనం వారికి అనుకూలంగా ఉత్తర్వులివ్వకుండా విచారణను ఈ నెల 16కి వాయిదా వేసింది. ఈ నేపథ్యంలో కోర్టు ధిక్కార పిటిషన్‌పై విచారణ జరిపిన జస్టిస్ శివశంకరరావు మంగళవారం మధ్యాహ్నం రెండు వేర్వేరు ఉత్తర్వులు జారీ చేశారు. స్పీకర్, డీజీపీ, ఇద్దరు ఎస్‌పీలకు నోటీసులిస్తూ 83 పేజీలతో ఉత్తర్వులు, ఇరువురు కార్యదర్శులకు వ్యక్తిగత హాజరుకు ఫాం 1 నోటీసులిస్తూ మరో ఉత్తర్వు ఇచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment