
గందరగోళం లేకున్నా.. వాయిదాలెందుకో?
తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో వాస్తవానికి భారీ గందరగోళానికి అవకాశం లేకున్నా గురువారంనాడు స్పీకర్ తీసుకున్న నిర్ణయం చూస్తే మాత్రం అలాంటిదే ఉందని భ్రమపడాలేమో.
హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో వాస్తవానికి భారీ గందరగోళానికి అవకాశం లేకున్నా గురువారంనాడు స్పీకర్ తీసుకున్న నిర్ణయం చూస్తే మాత్రం అలాంటిదే ఉందని భ్రమపడాలేమో. ఎందుకంటే సభ ప్రారంభమై పట్టుమని పది నిమిషాలు గడవకముందే స్పీకర్ అనూహ్యంగా వాయిదా వేయడం సర్వత్రా చర్చనీయాంశమైంది. బుధవారం ముందు నిర్ణయించినట్లు కాకుండా దాదాపు 11 గంటలు నడిచిన సమావేశం గురువారంనాటికి 11 నిమిషాలు కూడా కొనసాగలేదు. పోని ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే అంశాలతో ప్రతిపక్షాలు వచ్చాయా అంటే అదీ కూడా లేదు. కేవలం కొన్ని వాయిదా తీర్మానాలతో అవి సభలో అడుగుపెట్టాయి.
కనీసం వాటిపై చర్చ చేపడదామని, చేపట్టబోమనో కూడా ప్రభుత్వం చెప్పకుండానే సభ వాయిదా పడింది. రైతులకు మిగిలి ఉన్న రుణమాఫీలను ఏకమొత్తంగా చెల్లించాలని ప్రతిపక్షాలు పట్టుబట్టి గత రాత్రి అసెంబ్లీ ముగిసినా సభలో నుంచి కదలకుండా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఉండిపోయారు. కానీ ప్రభుత్వం నుంచి స్పందన రాకపోగా చివరికి మార్షల్స్ ద్వారా వారిని బయటకు పంపించారు. మరోపక్క, ఎట్టి పరిస్థితుల్లో రైతుల ఆత్మహత్యల ఘటనపై ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలని ప్రతిపక్షాలన్నీ నిర్ణయించగానే అదే విషయంపై రెండు రోజుల చర్చ పెట్టుకుందామని బీఏసీలో నిర్ణయించి ప్రతిపక్షాలకు తమను నిలదీసే అవకాశం లేకుండా ప్రభుత్వం చేసింది.
తాజాగా, ఒక్కోపార్టీ ఒక్కో అంశంపైనా గురువారం వాయిదా తీర్మానాలతో అసెంబ్లీకి వస్తే అనూహ్యంగా స్పీకర్ సభ వాయిదా వేశారు. ఇదంతా చూస్తుంటే, ప్రతిపక్షాలకు అసలు ఏమాత్రం అవకాశం ఇవ్వకూడదనే, తమదే పైచేయిగా ఉండాలనే మొండి ఆలోచనతో ప్రభుత్వం ఉందని ప్రతిపక్షాలు భావిస్తున్నాయి. స్పీకర్ తీరుపై వారంతా పెదవి విరుస్తున్నారు. సభను ఇప్పటికిప్పుడు వాయిదా వేయాల్సిన అవసరం ఏమొచ్చిందని మండిపడుతున్నారు. ఓ రకంగా స్పీకర్ తీసుకున్న సభ వాయిదా నిర్ణయంతో ప్రతిపక్షాలు విస్తుపోయాయనే చెప్పాలి. సభను ఇప్పుడు వాయిదా వేసి తప్పించుకున్నా.. సోమవారంనాటి సమావేశంలో కూడా అవే అంశాలతో వచ్చి అధికార పక్షాన్ని నిలదీస్తామని అంటున్నాయి. దీంతో సభలో మరే దృశ్యం ఆవిష్కృతమవుతుందో తెలుసుకోవాలంటే సోమవారం వరకు ఆగాల్సిందే.