సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నిరవధికంగా వాయిదా పడ్డాయి. అక్టోబర్ 27న ప్రారంభమైన సమావేశాలు మొత్తం 16 రోజుల పాటు కొనసాగాయి. ఈ సమావేశాల్లో పరిపాలన సంస్కరణలు-నూతన పాలన వ్యవస్థ, గురుకుల పాఠశాలలు, విద్యాసంస్థల్లో మౌలిక సదుపాయాలు, ఫీజు రియింబర్స్ మెంట్, ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ, రైతు సమన్వయ సమితులు, భూరికార్డుల ప్రక్షాళన, కేసీఆర్ కిట్స్, ముస్లిం మైనార్టీల అభివృద్ధి, 24 గంటల విద్యుత్ సరఫరాతో పాలు ఇతర అంశాలపై చర్చించారు. 69 గంటల 25 నిమిషాల పాటు శాసన సభ సమావేశాలు జరగగా .. 11 బిల్లులకు సభ ఆమోదం తెలిపింది. 24 గంటల విద్యుత్ సరఫరా, చేనేత పరిశ్రమ - కార్మికులు, ప్రపంచ తెలుగు మహాసభలు, ఎమ్మార్పీఎస్ నేత భారతి మృతిపై ముఖ్యమంత్రి కేసీఆర్ శాసన సభ వేదికగా ప్రకటనలు చేశారు.
అదేవిధంగా శాసనమండలిలో పలు అంశాలపై మండలి సభ్యులు చర్చ జరిపారు. పలు ప్రభుత్వ బిల్లులకు శాసన మండలి ఆమోదం తెలిపింది. సంక్షేమ, అభివృద్ధి పథకాలపై స్వల్పకాలిక చర్చ నిర్వహించారు. శాసనమండలిని నిరవధిక వాయిదా వేస్తున్నట్లు చైర్మన్ స్వామిగౌడ్ ప్రకటించారు.
మరోసారి అసంబ్లీ
కాగా డిసెంబర్ మొదటి వారంలో మరోసారి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు జరుగనున్నట్టు తెలుస్తోంది. అపుడు పంచాయితీరాజ్ కొత్త చట్టం, ఇతర అంశాలపై చర్చించే అవకాశం ఉంది. ప్రస్తుతం 16 రోజులే సభ జరిగినందున.. మరోమారు సమావేశాలు నిర్వహించేలా ప్రభుత్వం యోచిస్తోంది. దీనిపై అధికార సమాచారం రావాల్సి ఉంది.
కేసీఆర్ మాట తప్పారు
కాగా అసెంబ్లీ సమావేశాలు జరిగిన తీరుపై కాంగ్రెస్ నేతలు అసంతృప్తి వ్యక్తం చేశారు. అసెంబ్లీ సమావేశాలు 50 రోజులపాటు నిర్వహిస్తామని చెప్పిన తెలంగాణ ప్రభుత్వం మధ్యలోనే వాయిదా వేసిందని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు . అన్నీ సమస్యలపై చర్చలు జరుపుతామని తెలిపిన కేసీఆర్ మాట తప్పారని విమర్శించారు. ప్రతిపక్షాలు అడిగిన ఏ సమస్యపైనా ప్రభుత్వం సరిగా స్పందించలేదన్నారు. వడ్డీభారం ప్రభుత్వం భరిస్తుందని సీఎం చెప్పారని.. రైతుల రుణమాఫీ ఎక్కడా జరగలేదన్నారు. వడ్డీ, రుణమాఫీ రైతుల జాబితాను స్పీకర్‌ను ఇచ్చినట్టు ఉత్తమ్ తెలిపారు.
16 రోజులే నడపటం దారుణం
మరోవైపు బీజేపీ శాసనసభాపక్ష నేత కిషన్ రెడ్డి మాట్లాడుతూ 50 రోజులని చెప్పి అసెంబ్లీ సమావేశాలు 16 రోజులే నడపటం దారుణమన్నారు. చాలా అంశాలపై చర్చించకుండానే వాయిదా వేశారన్నారు. బీఏసీ సమావేశం పెట్టకుండానే సభను వాయిదా వేయడం సరికాదన్నారు. సాగునీటి ప్రాజెక్టుల్లో అవినీతిపై చర్చ జరగాల్సిందని అభిప్రాయపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment