- స్పీకర్ మధుసూదనాచారికి సీఎల్పీ వినతి
సాక్షి, హైదరాబాద్: సాగునీటి ప్రాజెక్టులపై సభలో పవర్‌పాయింట్ ప్రజెంటేషన్‌ను అనుమతించడం ద్వారా చట్టసభల ఔన్నత్యాన్ని, గౌరవాన్ని తగ్గించొద్దని కోరుతూ స్పీకర్ ఎస్.మధుసూదనాచారికి కాంగ్రెస్ శాసనసభాపక్షం విజ్ఞప్తి చేసింది. స్పీకర్‌ను ప్రతిపక్ష నేత కె.జానారెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు ఎన్. ఉత్తమ్‌కుమార్ రెడ్డితో పాటు కాంగ్రెస్ శాసనసభ్యులు మంగళవారం కలసి వినతిపత్రాన్ని అందించారు. పవర్‌పాయింట్ ప్రజెంటేషన్‌లాంటి ఓరియంటేషన్ కార్యక్రమాలకు శాసనసభను వేదికగా చేసుకోవడం సభ గౌరవాన్ని తగ్గించడమేనని, దీనిని తాము వ్యతిరేకిస్తున్నామని చెప్పారు. సభ అధ్యక్షునిగా ఇలాంటి కార్యక్రమాలకు అనుమతించొద్దని కోరారు. ఇప్పుడు అనుమతిస్తే భవిష్యత్తులో ఇలాంటి సంప్రదాయం కొనసాగే అవకాశముందని పేర్కొన్నారు.
సభ మొత్తానికి బాధ్యత వహించాలి
శాసన, కార్యనిర్వాహక, న్యాయ వ్యవస్థలకు విధులు, అధికారాలు, పరిధిని విభజిస్తూ స్పష్టమైన పరిధులను నిర్ణయించారని, తన పరిధిలోపల అన్ని వ్యవస్థలు వాటికవే ఉన్నతంగా పనిచేస్తాయని, వాటి మధ్య పరస్పర ఘర్షణకు ఎలాంటి అవకాశం లేనేలేదని వారు వివరించారు. సభా నాయకుడైన సీఎం అధికార పార్టీ సభ్యులకే పరిమితం కాకుండా ప్రతిపక్షంతో పాటు సభ మొత్తానికి బాధ్యత వహించాల్సి ఉంటుందని సీఎల్పీ నేతలు వివరించారు.
పార్లమెంటును రాష్ట్రాల శాసనసభలకు తల్లిగా పరిగణిస్తారని, సమాచార సాంకేతిక పరిజ్ఞానాన్ని సభ్యులు సమర్థవంతంగా వినియోగించుకోవడానికి పార్లమెంటు లో ప్రయత్నిస్తున్నారని వివరించారు. అయినా ఒక సభ్యుడు ఎలక్ట్రానిక్ ఫార్మాట్ ద్వారా ప్రసంగం చేయడానికి అనుమతించిన సంఘటనలు పార్లమెంటు చరిత్రలో ఎక్కడా లేవన్నారు. అన్ని అంశాలను గమనంలో ఉంచుకుని, ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని కోరారు.
సభ ఔన్నత్యాన్ని తగ్గించొద్దు
Published Wed, Mar 30 2016 1:56 AM | Last Updated on Mon, Oct 8 2018 3:41 PM
Advertisement