సాక్షి ప్రతినిధి, కాకినాడ :ఉభయ గోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు నామినేషన్ల ఘట్టం గురువారంతో ముగిసింది. మొత్తం 16మంది అభ్యర్థులు నామినేషన్లు వేశారు. శుక్రవారం నామినేషన్ల పరిశీలన జరగనుంది. నామినేషన్ల ఉపసంహరణకు వచ్చే నెల 2 వరకూ గడువు ఉంది. అనంతరం బరిలో నిలిచే అభ్యర్థుల తుది జాబితాను ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ హెచ్.అరుణ్‌కుమార్ ప్రకటిస్తారు. నామినేషన్ల దాఖలుకు చివరి రోజైన గురువారం టీడీపీ బలపరచిన కేవీవీ సత్యనారాయణరాజు (చైతన్యరాజు) భారీ ర్యాలీతో తరలివెళ్లి నామినేషన్ దాఖలు చేశారు. అంతకు ఒక రోజు ముందు టీడీపీ రెబల్‌గా బరిలోకి దిగిన ప్రగతి విద్యాసంస్థల అధినేత పరుచూరి కృష్ణారావు అట్టహాసంగా నామినేషన్ వేశారు. యూటీఎఫ్ బలపరిచిన అభ్యర్థిగా పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన రిటైర్డ్ ప్రొఫెసర్ రాము సూర్యారావు ఉపాధ్యాయ వర్గంతో కలిసి నామినేషన్ దాఖలు చేశారు. వీరు కాకుండా మరో 13 మంది నామినేషన్లు దాఖలు చేశారు. మొత్తం 16 మంది అభ్యర్థులు 34 సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు.
పశ్చిమ గోదావరి జిల్లా నుంచి నలుగురు, తూర్పు గోదావరి నుంచి 12 మంది నామినేషన్లు వేసిన వారిలో ఉన్నారు. పార్టీ రహితంగా జరిగే ఎన్నికలైనప్పటికీ టీడీపీ బలపరిచిన అభ్యర్థి చైతన్యరాజు టీడీపీ తరఫున ఒక నామినేషన్ దాఖలు చేశారు. స్వతంత్ర అభ్యర్థిగా మరో నామినేషన్ వేశారు. ఆయన తనయుడు కిమ్స్ ఎండీ శశికిరణ్‌వర్మ మరో నామినేషన్ దాఖలు చేశారు. ముందుచూపుతోనే ఈవిధంగా ఒకటికి మించి నామినేషన్లు వేశారు. మిగిలిన 14 మంది స్వతంత్ర అభ్యర్థులుగా నామినేషన్లు దాఖలు చేశారు. పార్టీ రహితంగా జరిగే ఎన్నికలు కావడంతో పార్టీపరంగా దాఖలైనవి పరిశీలనలో నిలుస్తాయా లేదా అనేది వేచి చూడాలి. గత ఎమ్మెల్సీ ఎన్నికల్లో మాదిరిగానే అభ్యర్థులు వ్యూహ, ప్రతివ్యూహాలకు నామినేషన్ల దాఖలు సమయంలోనే తెరతీశారు. కృష్ణారావు పేరుతో నలుగురు, సత్యనారాయణరాజు పేరుతో రెండు నామినేషన్లు దాఖలవడం ఇందులో భాగమేనంటున్నారు.
‘మండలి’ బరిలో 16 మంది
Published Fri, Feb 27 2015 1:24 AM | Last Updated on Sat, Sep 2 2017 9:58 PM
Advertisement
Advertisement