
బంజారాహిల్స్: ఎప్పటికై నా అసెంబ్లీలో అడుగు పెట్టి అధ్యక్షా.. అనాలనే కోరికతో పట్టువదలని విక్రమార్కుడిలా ఖైరతాబాద్ బడా గణేష్ ప్రాంతంలో నివసించే వ్యాపారి షాబాద్ రమేష్ ఈ ఎన్నికల్లో కూడా పోటీకి సై అన్నారు. తెలంగాణలోనే మొట్ట మొదటి నామినేషన్ తానే వేయాలని ప్రణాళిక రూపొందించుకొని ఆ మేరకు జ్యోతిష్యులను సంప్రదించి శుక్రవారం ఉదయం 11.06 గంటల సమయంలో ఖైరతాబాద్ స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు.
కేవలం అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రమే పోటీ చేస్తారీయన. 1994 నుంచి ఇప్పటి వరకు 7సార్లు నామినేషన్లు వేశారు.అయిదేళ్ల పాటు ఇంట్లో ఏర్పాటు చేసే గల్లాపెట్టెలో చిల్లర డబ్బులు వేస్తూ నామినేషన్ వేసే రోజున ఆ మొత్తాన్ని లెక్కపెట్టి అందులో నామినేషన్ పత్రాల డాక్యుమెంటేషన్ ఖర్చులు, డిపాజిట్ రూ.10 వేలు చెల్లిస్తారు. భార్య కస్తూరి హారతి ఇచ్చి నామినేషన్‌కు పంపించగా ఆయన ఖైరతాబాద్‌లోని ఆర్‌వోకు నామినేషన్ పత్రాలు అందజేశారు. నియోజకవర్గ అభివృద్ధే లక్ష్యంగా పని చేస్తానని నామినేషన్ల అనంతరం తెలిపారు.
ఆయన మొదటిసారి నామినేషన్ దాఖలు చేసినప్పుడు ఇద్దరు కొడుకులకు ఓటు హక్కు లేదు. ఇప్పుడు ఆయన ఇద్దరు కొడుకులు అఖిల్, అక్షయ్ ఇద్దరికీ ఓటు హక్కు రావడంతో తన ఓటు బ్యాంకు మరింత పెరిగిందని ఆనందం వ్యక్తం చేశారు. 2014లో జరిగిన ఎన్నికల్లో షాబాద్ రమేష్‌కు 387 ఓట్లు రాగా, 2018లో జరిగిన ఎన్నికల్లో 384 ఓట్లు వచ్చాయి. ఎప్పటికై నా ఖైరతాబాద్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచి తీరుతానని పెద్ద గణేష్ సాక్షిగా ఆయన శపథం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment