కాజీపేట: ఎన్నికలు వచ్చాయంటే హనుమకొండ జిల్లాలోని అనేక గ్రామాల్లో గతంలో భయం భయంగా ఉండేది. ఒకవైపు ఎన్నికలను బహిష్కరించాలని మావోయిస్ట్ నక్సలైట్ల పిలుపు. ఎన్నికల్లో పాల్గొనా లని పోలీసుల కవాతుల మధ్య పల్లె జనాల వెన్నులో వణుకు పుట్టేది. ఎన్నికలు జరగనీయొద్దని నక్సల్స్.. ఎలాగైనా ఎన్నికలు జరిపించాలని పోలీ సుల పట్టు మధ్య గ్రామస్తులు నలిగిపోయే వారు. ఎన్నికలు ముగిసి ప్రశాంతత ఏర్పడే వరకు బిక్కుబిక్కుమంటూ కాలంగడిపే పరిస్థితులు ఉండేవి.
తుపాకుల నీడన ఎన్నికలు..
నగరానికి కూతవేటు దూరంలోనే ఉన్న అనేక గ్రామాలు నక్సల్స్ ప్రభావితంగా ఉండేవి. కాజీపేట పట్టణానికి చెందిన క్రాంతిరణదేవ్ అలియాస్ బక్కన్న, మాచర్ల ఏసోబు, కడారి రాములు తదితరుల నేతృత్వంలో శివారు గ్రామాలన్నీ ఎన్నికలకు దూరంగానే ఉండేవి. కాజీపేటకు చుట్టూ పది కిలోమీటర్ల దూరంలోనే ఉన్న పల్లెల్లో ఎన్నికల బహిష్కరణకు పిలుపునిచ్చి విజయవంతం చేయాలని అన్నలు ప్రయత్నించేవారు. భట్టుపల్లి, తరాలపల్లి, రాంపేట, అయోధ్యపురం, టేకులగూడెం, దర్గా కాజీపేట, కొండపర్తి తదితర గ్రామాల్లో చిన్న, పెద్ద తారతమ్యం లేకుండా నక్సల్స్‌కు అండగా నిలిచేవారు.
ప్రస్తుతం మావోయిస్టు పార్టీలో రాష్ట్ర కమిటీలో కీలకంగా వ్యవహరిస్తున్న మాచర్ల ఏసోబు అలియాస్ కైలాసం స్వగ్రామం టేకులగూడంలో పరిస్థితులు భయానకంగా ఉండేవి. నక్సల్స్‌కు షెల్టర్ జోన్లుగా పిలిచే ఈ గ్రామాల్లో ఎన్నికలు నిర్వహించడమంటే పోలీసులు, అధికారులకు సాహసమనే చెప్పాలి. పోలింగ్ బూతుల వద్ద గ్రామ పరిసరాల్లో భారీగా పోలీసులను మోహరింపజేసి ఎన్నికలను నిర్వహించిన సందర్భాలు అనేకం. కొన్ని సమయాల్లో సాయుధ పోలీసులు ఇంటింటికి తిరుగుతూ ఓటర్లను పోలీంగ్ కేంద్రాలకు తరలించేవారంటే పరిస్థితి ఏవిధంగా ఉండేదో.. అర్ధం చేసుకోవచ్చు.
ఎన్నికల సమయంలో ఏ ఒక్క రాజకీయ నాయకుడు గ్రామాల్లో ప్రచారం చేసిన దాఖలాలు కనిపించేవి కావు. పోలీసులు ఎన్నికలకు నెలరోజుల ముందుగా నక్సల్స్ ప్రభావిత గ్రామాల్లో భారీగా కూంబింగ్ నిర్వహించి ఒకే.. అన్న తర్వాతే ఎన్నికల నిర్వాహణకు గ్రీన్ సిగ్నల్ పడేది. నక్సల్స్ ప్రభావిత గ్రామాల్లోని కొన్ని పోలింగ్ బూతుల్లో ఎన్నికల ఏజెంట్‌గా ఉండేందుకు పలాన పార్టీకి ఓటు వేయాలని ఓటర్లకు చెప్పేందుకు ఇంటింటికీ తిరిగి ఓట్లు అడిగేందుకు సాహసించేవారు కాదంటే అతిశయోక్తికాదు.
Comments
Please login to add a commentAdd a comment