హైదరాబాద్: నగరంలోని పాతబస్తీలో పాగా వేసేందుకు మజ్లిస్–బచావో –తహరిక్ (ఎంబీటీ) పార్టీ వ్యూహత్మకంగా అడుగులేస్తోంది. మూడు దశాబ్దాల కిందటి వైభవం కోసం పడరాని పాట్లు పడుతోంది. రాజకీయ శత్రుపక్షమైన ఆల్ ఇండియా మజ్లిస్ ఏ–ఇత్తేహదుల్ ముస్లిమీ(ఏఐఎంఐఎం)ను మట్టి కరిపించడమే లక్ష్యంగా శక్తియుక్తులను ఒడ్డుతోంది. మజ్లిస్ తరహాలో నిరంతరం ప్రజాసేవలో నిమగ్నమైనా ఎన్నికలలో ఆ పారీ్టకి పరాభవం తప్పడం లేదు. ఎప్పటి మాదిరిగా పార్టీ సీనియర్ బాధ్యులను కాకుండా ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో విద్యావంతులైన యువతకు పెద్ద పీట వేసి కొన్ని అసెంబ్లీ సెగ్మెంట్లలోనైనా పాగా వేయాలని యోచిస్తోంది.
ప్రధానంగా మజ్లిస్ పార్టీ వైఫల్యాలను ఎండగట్టడంతోపాటు పాతబసీలో అక్షరాస్యత, అభివృద్దిపై ఫోకస్ పెట్టి ఓటర్లను తమ వైపు తిప్పుకునేందుకు ఎంబీటీ ప్రయత్నాలు ముమ్మరం చేసింది. అందులో భాగంగా ముస్లిం సామాజికవర్గంలో మార్పు కోసం ఎన్నికల బరిలో దిగేందుకు విద్యావంతులైన యువకులు ముందుకు రావాలని పిలుపునిస్తోంది. ముఖ్యంగా ఐటీ, ఇంజనీరింగ్, మెడికల్ రంగాలకు చెందిన యువత ముందుకు వచ్చి ఎన్నికల ప్రక్రియలో పాల్గొనే వరకు వ్యవస్థను సరిదిద్దలేమని పేర్కొంటోంది. పోటీకి ఆసక్తిగల అభ్యర్థులు పాతబస్తీ చంచల్‌గూడలోని ఎంబీటీ ప్రధాన కార్యాలయంలో సంప్రదించాలని సూచిస్తోంది.
పట్టు వదలకుండా..
పాతబస్తీలో మజ్లిస్ పార్టీని దెబ్బతీసి గట్టెక్కేందుకు ఎంబీటీ పట్టు వదలని విక్రమార్కునిలా ప్రయత్నాలు చేస్తూనే ఉంది. గతంలో పార్టీ ప్రాతినిధ్యం వహించిన చాంద్రాయణగుట్ట, యాకుత్‌పురా అసెంబ్లీ స్థానాలు దక్కించుకునేందుకు వరుసగా ఎన్నికల్లో ప్రయతి్నస్తూ విఫలమవుతోంది. మూడు దశాబ్దాల క్రితం అప్పటి ఎఐఎంఐఎం అధినేత సుల్తాన్ సలావుద్దీన్ ఒవైసీతో ఏర్పడ్డ విభేదాలతో అమానుల్లాఖాన్ నాయకత్వంలో 1993లో ఏర్పడిన మజ్లిస్–బచావ్ తహరీక్ (ఎంబీటీ) 1994లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో తొలి విజయం సాధించింది. మజ్లిస్ కంచు కోటలైన చాంద్రాయణగుట్ట, యాకుత్‌పురా అసెంబ్లీ స్థానాల్లో ఎంబీటీ విజయకేతనం ఎగురవేసింది.
అయితే 1999 ఎన్నికల్లో ఎంబీటీ తన బలాన్ని నిలుపుకోలేకపోయింది. రాజకీయ పరిస్థితులు తారుమారయ్యాయి. పార్టీ అధినేత అమానుల్లా ఖాన్ వరుసగా ఐదు పర్యాయాలు విజయం సాధించిన చాంద్రాయణగుట్ట నుంచి ఓటమి చవిచూడక తప్పలేదు. మరోవైపు ముంతాజ్ అహ్మద్‌ఖాన్, విరాసత్ రసూల్ ఖాన్ కూడా ఎంఐఎం గూటికి చేరారు.
ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో చాంద్రాయణ గుట్ట అసెంబ్లీ నియోజకవర్గం నుంచి క్రమంగా అమానుల్లాఖా¯న్ పెద్ద కుమారుడు ఖయ్యూంఖాన్, యాకుత్‌పురా నుంచి ఫర్హాతుల్లా ఖాన్, మిగతా నియోజకవర్గాల నుంచి అభ్యర్థులు బరిలో దిగి గట్టిపోటీ ఇచ్చినప్పటికీ స్వల్ప ఓట్ల తేడాతో ఓటమి చవిచూశారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో చాంద్రాయణగుట్ట సెగ్మెంట్‌పై ఆశలు వదలుకొని యాకుత్‌పురాపై దృష్టి సారించినా..అక్కడా పరాభవం తప్పలేదు. అయితే ఈసారి సరికొత్త వ్యూహంతో విద్యావంతులైన యువతను రంగంలోని దింపాలని మరోమారు ఎంబీటీ గెలుపు ప్రయత్నాలు ముమ్మరం చేసింది.
Comments
Please login to add a commentAdd a comment