
హైదరాబాద్: ఒక సామాన్యుడిగా జీవితాన్ని ప్రారంభించిన సీతయ్య గుప్తా నగర అభివృద్ధికి అసామాన్య కృషి చేశారు. రాజకీయ, సామాజిక సేవా రంగాల్లో ఆయన సేవలు అజరామరం. ఆంధ్ర మహాసభ, స్టేట్ కాంగ్రెస్ చేపట్టిన స్వాతంత్రోద్యమాల్లో క్రియాశీలకంగా పని చేశారు. హైదరాబాద్ సంస్థానం విముక్తి సత్యాగ్రహ ఉద్యమాల్లో పాల్గొన్నారు. మరోవైపు వర్తక రంగంలో వ్యాపారుల సంక్షేమానికి పాటుపడ్డారు. ఎమ్మెల్యేగా, అంచనాల సంఘాల సభ్యుడిగా, కాంగ్రెస్ పార్టీలో ముఖ్య నేతగా ఎంతో పేరు తెచ్చుకున్నారు. రంగారెడ్డి జిల్లా బహదూర్‌గూడకు చెందిన సీతయ్య గుప్తా తన 16వ ఏట ఉపాధి కోసం హైదరాబాద్‌కు వచ్చి ఉస్మాన్‌గంజ్‌లోని ఒక వ్యాపారి వద్ద ఉద్యోగంలో చేరారు. క్రమంగా వ్యాపారంపై పట్టు పెంచుకున్నారు.
ఈ సమయంలో మాడపాటి హనుమంతరావుతో కలిసి ఉస్మాన్‌గంజ్ ధర్మశాల నిర్మాణానికి కృషి చేశారు. 1938 ఏప్రిల్ 16న ధూల్‌పేట మత ఘర్షణలకు వ్యతిరేకంగా ‘ఆర్యసమాజ్ సత్యాగ్రహ’ ఉద్యమంలో పాల్గొన్నారు. 1957లో జరిగిన సాధారణ ఎన్నికలు ఆయన ప్రస్థానంలో మైలురాయి. అప్పటి సీఎం నీలం సంజీవరెడ్డి సలహాపై ముషీరాబాద్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలుపొందారు. 1962 ఎన్నికల్లో బేగంబజార్ నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 1963లో సీఎల్‌పీ కార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తించారు. అంచనాల సంఘం సభ్యుడిగా పనిచేశారు.
ఆయన జీవితంలో రాజకీయం ఒక భాగమైతే సేవ అసలు లక్ష్యం. అనేక ధార్మిక సంస్థలు స్థాపించి తర్వాత తరాలకు సేవలందించేలా ఏర్పాట్లు చేశారు. ఆర్య వైశ్యుల అభ్యున్నతికి సంస్థల స్థాపనతో పాటు, వాసవి సహకార సంఘాలు ఏర్పాటు చేశారు. వైశ్యుల సంక్షేమానికి నిరంతరం శ్రమించిన ఆయన జులై, 1939లో పీల్‌ఖానాలో వైశ్య హాస్టల్ ప్రారంభించారు. కాచిగూడలో నిర్మించిన అతిపెద్ద వైశ్య హాస్టల్ నిర్మాణానికి ఎంతో కృషి చేశారు. 1997లో ఆయన కన్నుమూశారు. హైదరాబాద్ నగర రాజకీయ, సేవా రంగాల్లో తనదైన ముద్ర వేసిన సీతయ్య గుప్తా.. నగర చరిత్రలో ఓ సువర్ణాధ్యాయం.
Comments
Please login to add a commentAdd a comment