హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో నగదు తరలింపుపై సిటీ పోలీసులు డేగకన్ను వేశారు. కేవలం రాజకీయ సంబంధిత సొమ్మే కాదు.. భారీ మొత్తంలో తీసుకువెళ్తున్న వారినీ విడిచిపెట్టడం లేదు. గురువారం సాయంత్రం గుడిమల్కాపూర్ రోడ్‌లో తనిఖీలు చేసిన ఆసిఫ్‌నగర్ అధికారులు రెండు వాహనాల్లో తరలిస్తున్న రూ.1,78,30,000 స్వాధీనం చేసుకున్నారు. ఈ నగదు తీసుకువెళ్తున్న ఇరువురూ ప్రవాస భారతీయులుగా (ఎన్నారై) గుర్తించామని శుక్రవారం సౌత్ వెస్ట్ జోన్ డీసీపీ బి.బాలస్వామి వెల్లడించారు. వివరాలు ఇలా ఉన్నాయి..
► షేక్‌పేట్‌లోని గుల్షన్ కాలనీకి చెందిన అన్నదమ్ములు మహ్మద్ షానవాజుద్దీన్, మహ్మద్ షాబుద్దీన్ కొన్నేళ్లుగా సౌదీలో వ్యాపారం చేస్తున్నారు. ఎన్నారైలు అయిన వీరు ఇటీవల నగరానికి వచ్చారు. శివార్లలో ఉన్న ఓ భూమి కొనుగోలు చేయడానికి బేరసారాలు పూర్తి చేశారు. అగ్రిమెంట్ ఆఫ్ సేల్ తర్వాత కొంత మొత్తం అడ్వాన్స్‌గా చెల్లించారు. శుక్రవారం మిగిలిన రూ.1.78 కోట్లు ఇచ్చి రిజిస్ట్రేషన్ చేయించుకోవాల్సి ఉంది. దీనికోసం గురువారం తమ ఖాతాలు ఉన్న బ్యాంక్‌కు వెళ్లారు.
బ్యాంక్ మేనేజర్ వారించినా..
► సాధారణ సమయాల్లోనే అంత మొత్తం నగదు రూపంలో ఇవ్వడం కష్టసాధ్యమని, ప్రస్తుతం ఎన్నికల సీజన్ నడుస్తుండటంలో ఇవ్వకూడదని, ఒకవేళ ఇచ్చినా పోలీసుల తనిఖీల్లో చిక్కితే స్వాధీనం చేసుకుంటారని బ్యాంకు మేనేజర్ వారించారు. తమ డబ్బు తాము డ్రా చేసుకుంటామని, ఇచ్చి తీరాలంటూ వాగ్వాదానికి దిగిన ఇరువురూ ఆ మొత్తం బ్యాంకు నుంచి తీసుకున్నారు. ఇలా డ్రా చేసిన నగదును ఇరువురూ తమ కార్లలో పెట్టుకుని బయలుదేరారు.
కార్లలో తనిఖీ చేయగా..
► ఎన్నికల తనిఖీల్లో భాగంగా ఆసిఫ్‌నగర్ ఏసీపీ ఎల్.రాజావెంకట్‌రెడ్డి ఆదేశాల మేరకు ఇన్‌స్పెక్టర్ జి.వెంకటేశ్వర్లు నేతృత్వంలోని బృందం అనేక చోట్ల వాహన తనిఖీలు చేస్తోంది. గురువారం సాయంత్రం గుడిమల్కాపూర్ రోడ్‌లోని సాయిబాబా దేవాలయం వద్ద ఈ తనిఖీలు చేపట్టారు. అటుగా వచ్చిన ఇన్నోవా, ఆమ్నీ కార్లను ఆపి తనిఖీ చేశారు. రెండింటిలోనూ కలిపి రూ.1,78,30,000 కనిపించడంతో ఈ మొత్తం స్వాధీనం చేసుకున్నారు. తదుపరి దర్యాప్తు నిమిత్తం కేసును ఆదాయపు పన్ను శాఖకు పంపారు. వీరిద్దరూ తమ వద్ద ఉన్న అగ్రిమెంట్ ఆఫ్ సేల్, బ్యాంకు డ్రా పత్రాలు చూపించారు.
► నిబంధనల ప్రకారం రూ.2 లక్షలకు మించి నగదు రూపంలో లావాదేవీలు చేయకూడదు. దీనికి తోడు ఇది ఎన్నికల సీజన్ కావడంతో ఇంత మొత్తం తరలించకూడదు. ఈ నగదును వీరు ప్రలోభాలకు వాడకపోయినా... వీరికి భూమిని అమ్మిన వ్యక్తో లేక అతడి నుంచి తీసుకున్న మరొకరో ఇలా దుర్వినియోగం చేసే అవకాశం లేకపోలేదు. రసీదు ఉన్నప్పటికీ.. స్వాధీనం చేసుకున్న భారీ మొత్తాలను ఆదాయపు పన్ను శాఖకు అప్పగిస్తాం అని ఓ అధికారి వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment