30 People Preparing For Their Debut In BRS Ahead Of Assembly Elections In Telangana - Sakshi
Sakshi News home page

BRS Party: కొత్త ముఖాలు.. కోటి ఆశలు! 

Published Sat, Jul 1 2023 2:48 AM | Last Updated on Fri, Jul 28 2023 4:42 PM

30 people preparing for their debut in brs - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో భారత్‌ రాష్ట్ర సమితి తరఫున బరిలో దిగాలని ఉవ్విళ్లూరుతున్న ఔత్సాహిక నేతలు టికెట్‌ కోసం ముమ్మర ప్రయత్నాలు సాగిస్తున్నారు. పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆశీస్సుల కోసం ఆరాటపడుతున్నారు. ముఖ్యంగా సిట్టింగ్‌ ఎమ్మెల్యేలు కొందరికి ఈసారి అవకాశం లభించకపోవచ్చనే వార్తల నేపథ్యంలో పార్టీలో కొత్త ముఖాలు అభ్యర్థిత్వంపై ఆశతో విస్తృతంగా లాబీయింగ్‌ చేస్తున్నాయి.

క్షేత్రస్థాయిలో సొంత కేడర్‌ను తయారు చేసుకోవడం వంటి ఏర్పాట్లు కొనసాగిస్తూనే కేసీఆర్‌ దృష్టిలో పడేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీ రామారావు, మంత్రి హరీశ్‌రావు, ఎమ్మెల్సీ కవిత, ఎంపీ సంతోశ్‌తో పాటు కేసీఆర్‌కు అత్యంత సన్నిహితంగా ఉండే నేతల ద్వారా టికెట్‌ వేట కొనసాగిస్తున్నారు.

దాదాపుగా సిట్టింగ్‌ ఎమ్మెల్యేలందరితో పాటు సుమారు 40 మంది ఎంపీలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్లు, జిల్లా పరిషత్‌ల చైర్మన్ల వంటి కీలక పదవుల్లో ఉన్న నేతలు టికెట్‌ కోసం పోటీ పడుతున్నారు. వీరు కాకుండా మరో 30 మంది అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ తరఫున అరంగేట్రం చేసేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు.

సిట్టింగ్‌ ఎమ్మెల్యేలపై స్థానికంగా వ్యతిరేకత, రాష్ట్ర, జిల్లా స్థాయిలో సామాజికవర్గ సమీకరణాలు, ఆర్థిక స్థితిగతులు తదితరాలు.. టికెట్‌ వేటలో తమకు అనుకూలిస్తాయని లెక్కలు వేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే కొందరు ఆశావహులు అధినేత కేసీఆర్‌ దృష్టిలో పడేందుకు ఇటీవలి మహారాష్ట్ర పర్యటనకు తమ అనుచరులతో సహా తరలివెళ్లారు.  

సిట్టింగులకు దక్కని స్థానాల్లో.. 
ప్రస్తుత శాసనసభలో మొత్తం 119 మంది సభ్యులకు గాను 103 మంది ఎమ్మెల్యేలు బీఆర్‌ఎస్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కాగా సిట్టింగ్‌ ఎమ్మెల్యేలకు మళ్లీ పార్టీ టికెట్‌ దక్కుతుందని కేసీఆర్‌ పలు సందర్భాల్లో ప్రకటించినా.. పనితీరు సరిగా లేని వారిని పక్కన పెడతామనే సంకేతాలు కూడా ఇచ్చారు. ఈ నేపథ్యంలో సుమారు 15 నుంచి 20 మంది సిట్టింగులకు వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్‌ దక్కదని బీఆర్‌ఎస్‌ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

మరోవైపు ఈ నెలాఖరులో సుమారు 75 శాతం స్థానాల్లో అభ్యర్థుల పేర్లపై స్పష్టత వచ్చే అవకాశముందని అంటున్నారు. ఇప్పటికే పలువురు సిట్టింగ్‌ ఎమ్మెల్యేలతో పాటు ఇతరులను కలుపుకొని సుమారు 20 మందికి టికెట్‌ ఖరారుపై  కేసీఆర్, కేటీఆర్‌లు సంకేతాలు ఇచ్చారు.

కాగా సిట్టింగ్‌ ఎమ్మెల్యేల మార్పిడికి అవకాశమున్న చోట తమకు అవకాశం ఇవ్వాలని కొత్తగా టికెట్‌ ఆశిస్తున్న నేతలు కోరుతున్నారు. కేసీఆర్, కేటీఆర్‌ గతంలోనే తమకు హామీ ఇచ్చారని కొందరు చెప్తుండగా, మరికొందరు తమ పనితీరు, గెలుపు అవకాశాలను పరిగణనలోకి తీసుకుని టికెట్‌ ఇవ్వాలని కేసీఆర్‌ను కోరుతున్నారు.  

ఆశగా ఎదురుచూపులు 
కొత్తగా బీఆర్‌ఎస్‌ టికెట్‌ ఆశిస్తున్న నేతల్లో ప్రధానంగా గడాల శ్రీనివాసరావు (కొత్తగూడెం), మన్నె గోవర్ధన్‌రెడ్డి (ఖైరతాబాద్‌), మోతె శోభన్‌రెడ్డి (సికింద్రాబాద్‌), రేణికుంట్ల ప్రవీణ్‌ (బెల్లంపల్లి), మిట్టపల్లి సురేందర్‌ (మానకొండూరు), మైనంపల్లి రోహిత్‌ (మెదక్‌), చల్లా నారాయణరెడ్డి (మంథని) మరికొందరు ఉన్నారు. మన్నెం రంజిత్‌ యాదవ్‌ (నాగార్జునసాగర్‌), కందుల సంధ్యారాణి (రామగుండం), బొద్దుల లక్ష్మీనర్సయ్య అలియాస్‌ లక్ష్మణ్‌ (పెద్దపల్లి), వలిదాస్‌ జగదీశ్వర్‌గౌడ్‌ (శేరిలింగంపల్లి), నీలం మధు ముదిరాజ్‌ (పటాన్‌చెరు), ఢిల్లీ వసంత్‌ (జహీరాబాద్‌) ఈ జాబితాలో ముందు వరుసలో ఉన్నారు.

రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ సంచాలకుడు గడాల శ్రీనివాసరావు ఇప్పటికే క్షేత్ర స్థాయిలో సన్నద్ధతను ప్రారంభించారు. గాయకుడు మిట్టపల్లి సురేందర్‌ మానకొండూరు నుంచి టికెట్‌ కోసం ఇప్పటికే కేసీఆర్‌ను కలిసినట్లు సమాచారం. నాగార్జునసాగర్‌ ఉప ఎన్నికలో టికెట్‌ను ఆశించిన మన్నెం రంజిత్‌ యాదవ్‌ తనకు అవకాశం దక్కుతుందనే ధీమాతో నియోజకవర్గంలో విçస్తృతంగా పర్యటిస్తున్నారు.

రాష్ట్ర స్థాయిలో సామాజికవర్గ సమీకరణాలు తమకు అనుకూలిస్తాయని కందుల సంధ్యారాణి (పెఱిక), బొద్దుల లక్ష్మీనర్సయ్య (పద్మశాలి), నీలం మధు (ముదిరాజ్‌) భావిస్తున్నారు. ఇటీవల పటాన్‌చెరు పర్యటన సందర్భంగా ప్రగతిభవన్‌కు రావాల్సిందిగా మధుకు కేసీఆర్‌ సూచించినట్లు తెలిసింది. ఇప్పటికే బీఆర్‌ఎస్‌తో సన్నిహితంగా ఉంటున్న ఢిల్లీ వసంత్‌ పార్టీలో చేరికకు సంబంధించి షోలాపూర్‌ పర్యటన సందర్భంగా కేసీఆర్‌ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement