పదవితో మారేదేమీ ఉండదు | BRS Working President KTR in Meet the Press | Sakshi
Sakshi News home page

పదవితో మారేదేమీ ఉండదు

Published Sun, Oct 29 2023 5:13 AM | Last Updated on Sun, Oct 29 2023 5:13 AM

BRS Working President KTR in Meet the Press - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి వెనుకబడిన వర్గానికి చెందిన నేతను తొలగించిన బీజేపీ తెలంగాణలో తాము అధికారంలోకి వస్తే బీసీని ముఖ్యమంత్రిగా చేస్తామని అంటోందని భారత్‌ రాష్ట్ర సమితి వర్కింగ్‌ ప్రెసిడెంట్, మంత్రి కేటీ రామారావు ఎద్దేవా చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వయంగా ఓబీసీ కేటగిరీకి చెందిన వాడైనా బీసీ జనగణన చేపట్టడం లేదని, ఒక వ్యక్తికి పదవి వచ్చినంత మాత్రాన పెద్దగా మారేదేమీ ఉండదని అన్నారు. బీసీ సీఎం అయినంత మాత్రాన బీసీలకు న్యాయం జరగదని, కులం కంటే గుణం చాలా ముఖ్యమని వ్యాఖ్యానించారు.

కేంద్రంలో ఓబీసీలకు ప్రత్యేక శాఖ ఏర్పాటు చేయాలని 2014 డిసెంబర్‌లోనే సీఎం కేసీఆర్‌ బీసీ ప్రతినిధి బృందాన్ని ఢిల్లీకి తీసుకెళ్లారని గుర్తుచేశారు. ముదిరాజ్‌లకు రూ.1,000 కోట్ల విలువైన చేప పిల్లలు ఉచితంగా ఇవ్వడం ద్వారా రూ.30 వేల కోట్ల విలువైన మత్స్య సంపద సృష్టించామని తెలిపారు. పదవుల కంటే పథకాలు, జాతి ఉద్ధరణ ముఖ్యమని అన్నారు. వచ్చే ఎన్నికల్లో ఓటమి నెపాన్ని బీసీలపై నెట్టేందుకే బీసీ సీఎం నినాదాన్ని బీజేపీ ఎత్తుకుందనే అనుమానం వ్యక్తం చేశారు. తెలంగాణ యూనియన్‌ ఆఫ్‌ వర్కింగ్‌ జర్నలిస్ట్స్‌ (టీయూడబ్ల్యూజే) ఆధ్వర్యంలో శనివారం బషీర్‌బాగ్‌లోని దేశోద్ధారక భవన్‌లో నిర్వహించిన ‘మీట్‌ ది ప్రెస్‌’లో కేటీఆర్‌ పలు అంశాలపై స్పందించారు.  

బీజేపీకి 110 స్థానాల్లో డిపాజిట్లు దక్కవు 
‘బీఆర్‌ఎస్‌ తొమ్మిదిన్నరేళ్లుగా మార్పు కోసం రాజకీయాలు చేస్తోంది. కానీ విపక్ష పార్టీలు మాత్రం ప్రభుత్వాలను మార్చేందుకు పనిచేస్తున్నాయి. పదేళ్లలో బీజేపీ తెలంగాణకు ఇచ్చిందేమీ లేదు. అయితే దాడులు లేదంటే అబద్ధాలతో మోసం చేస్తోంది. సోషల్‌ మీడియా అబద్ధపు వార్తలకు బీజేపీ ఫ్యాక్టరీలా మారింది. వాట్సాప్‌ యూనివర్సిటీ ద్వారా విష ప్రచారం చేస్తోంది. ఆ పార్టీకి అసెంబ్లీ ఎన్నికల్లో 110 స్థానాల్లో డిపాజిట్లు దక్కవు..’అని కేటీఆర్‌ చెప్పారు.  

టీపీసీసీ అధ్యక్షుడు జైలుకు వెళ్లొచ్చు.. 
‘కాంగ్రెస్‌కు ఇప్పటికే 11 మార్లు అధికారం ఇచ్చిన ప్రజలు మరోమారు అప్పగించేందుకు సిద్ధంగా లేరు. గతంలో ఆరు సూత్రాలు అంటూ మోసగించిన కాంగ్రెస్‌ ఇప్పుడు ఆరు గ్యారంటీలతో మరోమారు అదే తీరును ప్రదర్శిస్తోంది. కర్ణాటకలో ఐదు గంటల పాటు కరెంటు ఇవ్వలేక లెంపలు వేసుకుంటోంది. దేశానికి ఆ పార్టీ తెల్ల ఏనుగులా తయారైంది. రాష్ట్రంలో పగ, కక్ష సాధింపు రాజకీయాలకు పాల్పడితే టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఈపాటికి జైల్లో ఉండేవాడు. ఇప్పటికీ ఆయన జైలుకు వెళ్లొచ్చు..’అని అన్నారు.  

తొలుత మహారాష్ట్రలో జెండా ఎగరేస్తాం 
‘ఇతర పార్టీలను బలహీన పరచడం, మేము బలపడటం లక్ష్యంగా బీఆర్‌ఎస్‌లోకి చేరికలను ప్రోత్సహిస్తున్నాం. జాతీయ పార్టీగా తొలుత మహారాష్ట్రలో జెండా ఎగురవేసిన తర్వాత ఇతర రాష్ట్రాలకు విస్తరిస్తాం. బీజేపీ జాతీయ స్థాయిలో అధికారంలోకి వచ్చేందుకు సుమారు 30 ఏళ్లు పట్టింది..’అని గుర్తు చేశారు. 

కేసీఆర్‌కు దీటైన నేతలు లేరు 
‘సీఎం కేసీఆర్‌కు దీటైన నాయకుడు తెలంగాణలో ఎవరూ లేరు. పాలనలో అనేక విప్లవాత్మక మార్పులు తెచ్చిన కేసీఆర్‌కు మంచి ట్రాక్‌ రికార్డు ఉంది. ప్రజలు ఆయన నాయకత్వాన్నే కోరుకుంటున్నారు. పదేళ్ల పాలనలో బీఆర్‌ఎస్‌ కొత్త నమూనా ఆవిష్కరించడం ద్వారా ఎన్నో అద్భుతాలు ఆవిష్కృతం అయ్యాయి.

రాష్ట్రంలో స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వాన్ని ఆచరిస్తున్నాం. లింగ, కుల, మత వివక్ష లేకుండా పాలన సాగుతోంది. అభివృద్ధి, సంక్షేమానికి నడుమ సమతూకం పాటిస్తున్నాం. అప్పులను రాష్ట్రంలో ఉత్పాదక రంగం, మౌలిక వసతులపై వెచ్చించాం. అన్ని రంగాల అభివృద్ధితో రాష్ట్రం, ప్రజల సంపద పెరిగింది. మా కంటే గొప్పగా ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేసిన ప్రభుత్వాలు ఏవీ లేవు..’అని కేటీఆర్‌ పేర్కొన్నారు.  

మేడిగడ్డపై ప్రతిపక్షాలది పైశాచికానందం 
‘మేడిగడ్డ బ్యారేజీ గత ఏడాది 28 లక్షల క్యూసెక్కుల రికార్డు స్థాయి వరదను కూడా తట్టుకుని నిలిచింది. ప్రాజెక్టులో లోపాలు ఏవైనా ఉంటే సంబంధిత ఏజెన్సీ ద్వారానే మరమ్మతు పనులు జరుగుతాయి. ప్రజలపై ఎంత మాత్రం భారపడదు. ఎన్నికల సమయంలో ప్రతిపక్ష పార్టీలు బట్ట కాల్చి మామీదేయడం సరికాదు. గతంలో అన్నారం పంప్‌హౌస్‌ మునిగిన సమయంలోనూ ప్రతిపక్షాలు పైశాచిక ఆనందం పొందాయి..’అని కేటీఆర్‌ విమర్శించారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement