ఓటేస్తం.. ఏమిస్తరు.. ఫోన్‌ పే ఉందా... | - | Sakshi
Sakshi News home page

ఓటేస్తం.. ఏమిస్తరు.. ఫోన్‌ పే ఉందా...

Published Tue, Nov 21 2023 8:54 AM | Last Updated on Tue, Nov 21 2023 9:37 AM

- - Sakshi

హైదరాబాద్: ఉప్పల్‌లోని ఓ అపార్ట్‌మెంట్‌లో అన్ని ఫ్లాట్‌లలో మొత్తం 33 ఓట్లు ఉన్నాయి. ఆ ఓట్ల కోసం ప్రధాన పార్టీల అభ్యర్థులు, ప్రతినిధులు తరచూ సంప్రదిస్తూనే ఉన్నారు. దీంతో తమ అపార్ట్‌మెంట్‌ నిర్వహణ కోసం రూ.4 లక్షలు ఇచ్చే పార్టీకే ఓట్లు వేస్తామని చెప్పారు. ఒక ప్రధాన పార్టీ అందుకు సిద్ధమైంది. ఆ డబ్బులతో అపార్ట్‌మెంట్‌కు పెయింటింగ్‌ వేయించాలని భావిస్తున్నట్లు అపార్ట్‌మెంట్‌ కమిటీ సభ్యులు ఒకరు చెప్పారు.

► హిమాయత్‌నగర్‌ ప్రాంతంలోని ఒక మధ్యతరగతి కాలనీలో ఉన్న ఒక అపార్ట్‌మెంట్‌కు ప్రధాన పార్టీ 25 మద్యం సీసాలు, రూ.3 లక్షలు అందజేసినట్లు ఆ అపార్ట్‌మెంట్‌ నివాసి ఒకరు తెలిపారు. ఆ 3 లక్షల రూపాయలతో అపార్ట్‌మెంట్‌లో ఒక క్రీడా సౌకర్యాన్ని అభివృద్ధి చేయనున్నట్లు పేర్కొన్నారు. మరో రెండు, మూడు ప్రధాన పార్టీల నుంచి కూడా ఎంతో కొంత డిమాండ్‌ చేయాలనుకుంటున్నట్లు చెప్పారు. ఇలా ఉప్పల్‌, హిమాయత్‌నగర్‌ వంటి ఒకటి రెండు ప్రాంతాల్లోనే కాదు గ్రేటర్‌ అంతటా ప్రలోభాల పంపిణీ కార్యక్రమం జోరుగా సాగుతోంది. కాలనీలుగా, అపార్ట్‌మెంట్‌లుగా ఓటర్లను సమావేశపరిచి డిమాండ్‌లను ఆహ్వానిస్తున్నారు.

► ఈ క్రమంలో ఓటర్ల సంఖ్యకు, అపార్ట్‌మెంట్‌ల అవసరాలకు అనుగుణంగా ఒక్కో చోట నుంచి ఒక్కో విధమైన డిమాండ్‌లు బరిలో నిలిచిన అభ్యర్థుల ముందుకు వస్తున్నాయి. కొన్నిచోట్ల ఈ డిమాండ్‌లు తలకు మించిన భారంగా ఉన్నట్లు వివిధ పార్టీలకు చెందిన నాయకులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ప్రతిరోజూ అభ్యర్థుల వెంట నడిచే అనుచరులు మొదలుకొని అపార్ట్‌మెంట్‌ల ప్రతినిధుల వరకు తమ డిమాండ్‌లను ‘పెద్ద మొత్తం’లో పార్టీల ముందుంచుతున్నారు. ఈ డిమాండ్‌లను భర్తీ చేసే క్రమంలో అంచనాలకు మించి ఖర్చు చేయాల్సి వస్తోందని వివిధ పార్టీలకు చెందిన నాయకులు చెబుతున్నారు.

ఓట్లు ఉత్తగనే ఎందుకేస్తాం..
‘అధికారం, అక్రమార్జనే లక్ష్యంగా ఎన్నికల్లో గెలిచేందుకు వాళ్లు పోటీపడుతున్నారు. అలాంటప్పుడు ఉచితంగా ఓట్లు ఎందుకు వేయాలి’ జవహర్‌నగర్‌ ప్రాంతానికి చెందిన ఓ చోటా నాయకుడి వాదన ఇది. గ్రామీణ ప్రాంతాల నుంచి ఉపాధి కోసం హైదరాబాద్‌కు వచ్చి శివారు ప్రాంతాల్లో నివాసం ఏర్పాటు చేసుకొన్న వందలాది కాలనీలకు అక్కడికక్కడే చోటా మోటా నాయకులు పుట్టుకొస్తున్నారు. ప్రధాన పార్టీలతో బేరాలుడుతున్నారు. ఇప్పుడు అన్ని చోట్ల ఇదో దందాగా మారింది. ప్రధాన పార్టీలకు చెందిన హేమాహేమీలను సైతం ముగ్గులోకి దించేస్తున్నారు. కాలనీలు, బస్తీల్లో ఉండే ఓటర్ల సంఖ్య మేరకు రూ.10 లక్షల నుంచి రూ.50 లక్షల వరకు కూడా డిమాండ్‌ చేస్తున్నారు.

ఈ క్రమంలో అభ్యర్థుల అనుచరులుగా చలామణి అయ్యే వ్యక్తులు కూడా కాలనీ సంఘాలకు మద్ధతుగా నిలిచి అనంతరం వాటాల చొప్పున పంచుకుంటున్నట్లు నాగారం ప్రాంతానికి చెందిన ఒక ఉపాధ్యాయుడు విస్మయం వ్యక్తం చేశారు. చాలా చోట్ల ఈ డిమాండ్‌లు, పంపకాల కార్యక్రమం బాహాటంగానే కొనసాగుతున్నట్లు పేర్కొన్నారు. ఎన్నికలు దగ్గరపడుతుండటంతో అభ్యర్థులు కూడా ఈ నాయకులను తోసిరాజని ముందుకు వెళ్లలేని పరిస్థితి నెలకొంది. ‘ఎన్నికల సంఘం చెప్పినట్లుగా అభ్యర్థులు రూ.40 లక్షలు మాత్రమే ఖర్చు చేయాల్సివస్తే నాలుగు కాలనీల ఓట్లు కూడా రాలే పరిస్థితి లేదు’ అని సైనిక్‌పురికి చెందిన ఓ మహిళా సంఘం ప్రతినిధి అభిప్రాయపడ్డారు. మద్యం, నగదు పంపిణీ అన్ని చోట్ల రూ.కోట్లల్లోనే ఉందన్నారు.

అభ్యర్థులను బెంబేలెత్తిస్తున్న బేరసారాలు
అపార్ట్‌మెంట్‌లు, కాలనీల్లో ప్రలోభాల పంపిణీ ఇలా ఉంటే ఓటర్లకు నేరుగా డబ్బులు వేసేందుకు ఆన్‌లైన్‌ యాప్‌లను విరివిగా వినియోగిస్తున్నారు. గూగుల్‌పే, ఫోన్‌పేల ద్వారా జోరుగా నగదు చేరిపోతోంది. అభ్యర్థులకు ఆయా ప్రాంతాల్లో ఉండే బలాబలాలను బట్టి ఒక్కో ఓటుకు రూ.3000 నుంచి రూ.5000 వరకు అందజేస్తున్నారు. నలుగురు ఓటర్లు ఉన్న ఇంటికి రూ.12000 నుంచి రూ.18000 వరకు చేరుతున్నట్లు సమాచారం.

‘గత ఎన్నికల్లో ఇచ్చినట్లుగానే ఈ ఎన్నికల్లో కూడా ఇవ్వాల్సిందే కదా. ఒకసారి లెక్క డిసైడ్‌ అయిందంటే ఎప్పుడైనా అదే ఉంటుంది కదా’ అని రామంతాపూర్‌కు చెందిన వాకర్స్‌ అసోసియేషన్‌ ప్రతినిధి ఒకరు అభిప్రాయపడ్డారు. నిన్నా మొన్నటి వరకు సభలు, సమావేశాలు, ప్రచారంపై ఎక్కువ దృష్టి సారించిన పార్టీలు ఇప్పుడు ప్రలోభాలపై సీరియస్‌గా దృష్టి పెట్టాయి. మహిళలను, కుల సంఘాలు, కాలనీ సంఘాలను విడివిడిగా ఏర్పాటు చేసి గంపగుత్తగా సంఘాలకే డబ్బులు అందజేస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement