
హైదరాబాద్: వాళ్లు రోజువారీ కూలీలే కానీ రకరకాల రాజకీయ జెండాలు, రంగురంగుల ప్లకార్డులు పట్టుకొని తిరుగుతారు. ఎన్నికల ప్రచారాన్ని హోరెత్తిస్తారు. ఎన్నికల కదనరంగంలో మోహరించిన అభ్యర్థులకు వందిమాగధులు, మందీమార్బలం, కార్యకర్తల బలం లేకపోయినా అన్ని విధాలుగా అండగా నిలుస్తారు. అభ్యర్థుల ‘బలాన్ని’ చాటుతారు. వాళ్లే రాజకీయ పారీ్టల ప్రచారానికి ర్యాలీలు నిర్వహించే అడ్డా కూలీలు. ఇటీవల వరకు భవన నిర్మాణాలు, రోడ్డు పనులు చేసేందుకు అడ్డాలపై పడిగాపులు కాసిన వలస కూలీలకు అకస్మాత్తుగా డిమాండ్ వచ్చేసింది.
దీంతో ఇప్పుడు గ్రేటర్‌లో ఏ అడ్డాకు వెళ్లినా కూలీలు కనిపించడం లేదు. అంతా ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్నారు. కొంతమంది నెలరోజుల పాటు ఏదో ఒక పార్టీ దగ్గర కూలీ మాట్లాడుకొని జై కొడుతుండగా, మరికొందరు మాత్రం ఏ రోజు ఏ పార్టీ ప్రచారానికి పిలిచినా వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నారు. అంతేకాదు.. రాజకీయ పారీ్టలకు ఈ ప్రచార కూలీలను చేరవేసేందుకు మేస్త్రీలు, చిన్నపాటి కాంట్రాక్టర్‌లు కూడా రంగంలోకి దిగారు.
పారీ్టలతో బేరసారాలు మాట్లాడుకొని కూలీలను సరఫరా చేస్తున్నారు. కేవలం ప్రచారాలు, ర్యాలీలు, ప్రదర్శనలే కాదు. బహిరంగ సభలకు సైతం కూలీలను సరఫరా చేసే టీమ్‌లు ఇప్పుడు గట్టిగానే పని చేస్తున్నాయి. ఇటు ఉప్పల్ నుంచి అటు టోలీచౌకీ, లంగర్‌హౌస్ వరకు, కర్మన్‌ఘాట్ నుంచి మేడ్చల్ వరకు వందలాది అడ్డాల్లో పని కోసం ఎదురు చూసే వేలాది మంది రాజకీయ పార్టీలకు కూలీ కార్యకర్తలుగా పని చేస్తున్నారు.
అందుబాటులో అన్ని సదుపాయాలు..
ప్రచారంలో పరుగులు పెట్టే కూలీలకు రోజువారీ వేతనంతో పాటు ఉదయం నుంచి సాయంత్రం వరకు అన్ని సదుపాయాలు లభిస్తుండటంతో ఏ పార్టీ వెనుక చూసినా గుంపులకొద్దీ కనిపిస్తున్నారు. ప్రతి రోజు రూ.500 చొప్పున వేతనంతో పాటు ఉదయం టిఫిన్, మధ్యాహ్నం భోజనం, రాత్రికి మందు బాటిల్ కూడా ఇవ్వడంతో కూలీలు పోటీ పడుతున్నారు. ‘రోజంతా రెక్కలు కొట్టుకున్నా కూలీ దొరకడం లేదు. జెండా పట్టుకొని తిరిగితే చాలు డబ్బులతో పాటు, భోజనం కూడా లభిస్తుంది, ఇంకేం కావాలి’అని సికింద్రాబాద్‌లో ఉండే సుదర్శన్ చెప్పారు.
► సికింద్రాబాద్, సీతాఫల్‌మండి, వారాసిగూడ, గాంధీ హాస్పిటల్ తదితర ప్రాంతాలకు చెందిన వందలాది మంది అడ్డా కూలీలు ఇప్పుడు పార్టీల ప్రచారంలోనే ఉన్నట్లు చెప్పారు. మహిళలు కూడా ఈ ఎన్నికల ఉపాధి కోసం పోటీ పడుతున్నారు. ఆయా పారీ్టల నాయకులు కొందరు ముందు నడిస్తే జెండాలు పట్టుకొని, కండువాలు ధరించి వాళ్ల వెనుక నినాదాలు ఇస్తూ నడవటమే అడ్డా కూలీల పని. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు, తిరిగి సాయంత్రం నుంచి రాత్రి ఎనిమిదింటి వరకు ప్రచారం కొనసాగిస్తున్నారు.
► కొద్ది రోజుల క్రితం వరకు కూడళ్లలో మోహరించి ఉండే కూలీలు ఇప్పుడు రాజకీయ పారీ్టల ఎన్నికల శిబిరాల వద్దకు వచ్చి చేరుతున్నారు. దీంతో ఏ పార్టీ ఎన్నికల కార్యాలయం చూసినా సందడిగానే కనిపిస్తోంది. ‘ఏ పార్టీకైనా కనీసం వంద మంది కూలీలను సప్లయ్ చేయడం కూడా కష్టంగా మారింది. రాజకీయ పారీ్టల నుంచి ఆర్డర్లు వస్తున్నాయి. కానీ వాళ్లు ఆశించిన స్థాయిలో అందజేయలేకపోతున్నాం’ అని రామంతాపూర్‌కు చెందిన ఓ కాంట్రాక్టర్ తెలిపారు. ఏ రోజుకు ఆ రోజు కూలీలను పోగు చేసి పంపించాల్సి వస్తుందని చెప్పారు.
ఎక్కువగా ఉత్తరాది వారే..
బతుకమ్మ, దసరా ఉత్సవాల నేపథ్యంలో తెలంగాణకు చెందిన వలస కూలీలంతా సొంత ఊళ్లకు తరలివెళ్తున్నారు. పైగా ఎన్నికల సీజన్ కావడంతో సొంత ఊళ్లల్లో కూడా డిమాండ్ ఉంటుందని భావిస్తున్నారు. ఈ క్రమంలో నగరంలో తెలంగాణకు చెందిన కూలీల కొరత ఏర్పడింది.శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, తదితర ఉత్తరాంధ్ర జిల్లాలకు చెందిన కూలీలు, కొందరు ఉత్తర భారతానికి చెందినవారిని కూడా ప్రచారానికి తీసుకోవాల్సివస్తోందని ఒక రాజకీయ పార్టీ ప్రతినిధి చెప్పారు. ‘వాళ్ల భాషతో మనకు ఇబ్బంది లేదు. మేం ఇచ్చే నినాదాలను వల్లె వేస్తే చాలు.‘జిందాబాద్’ అన్నా సరే. కావాల్సిందల్లా పెద్ద ఎత్తున గుంపు కనిపించడమే కదా’ అన్నారు. ఏమైతేనేం పార్టీల ప్రచారం అడ్డా కూలీలకు ‘పండగే’ కదా.
Comments
Please login to add a commentAdd a comment