హైదరాబాద్: నామినేషన్లు దాఖలు చేయడానికి ఐదు రోజుల గడువు మాత్రమే ఉంది. అయినప్పటికీ గ్రేటర్ పరిధిలోని అనేక నియోజకవర్గాల్లో అభ్యర్థులు ఖరారు కాకపోవడంతో ఆయా పార్టీల నుంచి టికెట్లను ఆశిస్తున్న వారు ఆందోళనలో ఉన్నారు. బీఫాం చేతికొచ్చేంత వరకు ఏ క్షణాన ఏ ముప్పు ముంచుకొస్తుందోనని బిక్కుబిక్కుమంటున్నారు. ఆ పార్టీ ఈ పార్టీ అని కాకుండా నాలుగు ప్రధాన పారీ్టల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. అధికార బీఆర్‌ఎస్ ఆగస్టులోనే అభ్యర్థులను ప్రకటించినప్పటికీ నాంపల్లి, గోషామహల్ స్థానాలను పెండింగ్‌లో ఉంచింది.
నేటికీ వాటికి అభ్యర్థులనే ప్రకటించలేదు. టికెట్లు ప్రకటించిన వారిలో బీఫాంల పంపిణీ కూడా దాదాపుగా పూర్తి కావచ్చినప్పటికీ, పాతబస్తీ పరిధిలోని చారి్మనార్, చాంద్రాయణగుట్ట, మలక్‌పేట, బహదూర్‌పురా, యాకుత్‌పురా, కార్వాన్ అభ్యర్థులకు ఇంతవరకు బీఫారాలను జారీ చేయలేదు. దాంతో బీఫాం చేతికందేంత వరకు ఎప్పుడేం జరుగుతుందోనన్న ఆందోళనలో అభ్యర్థులున్నారు. ఇక గోషామహల్, నాంపల్లి అభ్యర్థుల ఎంపికపై ఉత్కంఠ వీడలేదు. అభ్యర్థుల ఖరారుపై అధిష్టానం తేల్చకపోవడంతో ఆశావహుల్లో గుండెల్లో రైళ్లు పరుగిడుతున్నాయి.
ఎంఐఎంలో మూడు పెండింగ్
నగర రాజకీయాల్లో కీలకపాత్ర పోషించే ఎంఐఎం తొమ్మిది స్థానాల్లో పోటీ చేస్తున్నట్లు ప్రకటించినప్పటికీ, బహదూర్‌పురా, రాజేంద్రనగర్, జూబ్లీహిల్స్‌లకు ఇంకా అభ్యర్థులను ఖరారు చేయలేదు. అభ్యర్థుల ఖరారుకు మరో రెండు, మూడు రోజులు పట్టే అవకాశం కనిపిస్తోంది.
కాంగ్రెస్‌లోనూ రెండు
కాంగ్రెస్ పార్టీ సైతం పాతబస్తీలోని చార్మినార్‌తో పాటు గ్రేటర్ పరిధిలో కలిసి ఉన్న పటాన్‌చెరు నియోజకవర్గానికి అభ్యర్థని వెల్లడించలేదు.
బీజేపీకి జనసేనతో కిరికిరి
ఇక మరో ప్రధాన ప్రతిపక్షం బీజేపీ సైతం నాలుగు నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. ఆపార్టీ జనసేనతో పొత్తు కుదుర్చుకోవడంతో దానికి ఏయే సీట్లు కేటాయిస్తారోనన్న టెన్షన్‌తో బీజేపీ ఆశావహులున్నారు. అత్యధిక ఓటర్లున్న శేరిలింగంపల్లి, కూకట్‌పల్లి, మల్కాజిగిరి, మేడ్చల్‌తోపాటు కంటోన్మెంట్ నియోజకవర్గాలకు అభ్యర్థులను వెల్లడించాల్సి ఉంది.
∙జనసేన శేరిలింగంపల్లి, కూకట్‌పల్లి స్థానాలను కోరుతున్నట్లు తెలిసి బీజేపీ శ్రేణులు గందరగోళంలో మునిగాయి. ఎట్టకేలకు శేరిలింగంపల్లి సెగ్మెంట్‌ను జనసేనకు వెళ్లకుండా ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి అధిష్టానంతో జరిపిన సంప్రదింపులు ఫలించినట్లు సమాచారం. వివిధ కారణాలతో నగరంలోని నాలుగు ప్రధాన పారీ్టలు అభ్యర్థులను ప్రకటించకపోవడంతో ఎప్పుడు ఎలాంటి పరిణామాలు చోటుచేసుకోనున్నాయోననే చర్చ జరుగుతోంది.
Comments
Please login to add a commentAdd a comment