జూబ్లీహిల్స్‌ నియోజకవర్గంలో... కాంగ్రెస్‌కు పూర్వవైభవం లభించేనా? | Ticket Fight in Jubilee Hills Assembly Constituency Congress party | Sakshi
Sakshi News home page

జూబ్లీహిల్స్‌ నియోజకవర్గంలో... కాంగ్రెస్‌కు పూర్వవైభవం లభించేనా?

Published Thu, Aug 10 2023 10:41 AM | Last Updated on Thu, Aug 10 2023 11:35 AM

Ticket Fight in Jubilee Hills Assembly Constituency Congress party - Sakshi

కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ ఘన విజయం ఆ పార్టీ తెలంగాణ శ్రేణుల్లో నూతన ఉత్సాహాన్ని నింపిందనడం నిరి్వవాదాంశం. అయితే జూబ్లీహిల్స్‌ నియోజకవర్గంలో మాత్రం కాంగ్రెస్‌ కార్యకర్తలు, ద్వితీయ శ్రేణి నేతల్లో నిరాశనిస్పృహలే కని్పస్తున్నాయి. ప్రధానంగా నియోజకవర్గంలో పార్టీని నడిపించే యోధుడు ఆశించిన స్థాయిలో చురుగ్గా లేకపోవడమే కారణమంటూ పార్టీ శ్రేణులు వ్యాఖ్యానిస్తున్నాయి. 

హైదరాబాద్: ఒకప్పుడు రాష్ట్రంలోనే అతి పెద్ద నియోజకవర్గం అది. జనహృదయ నేత పి.జనార్ధన్‌రెడ్డి (పీజేఆర్‌) అంటే ఖైరతాబాద్‌... ఖైరతాబాద్‌ అంటేనే పీజేఆర్‌ అనే విధంగా ఉండేది. గెలుపోటములతో సంబంధం లేకుండా ఆయన ప్రజల నడుమే ఉండేవారనడం.. ప్రజామద్దతు ఆయనకే ఉండేదనడం అతిశయోక్తికాదు. 

పీజేఆర్‌ అకాల మరణంతో ఆయన తనయుడు పి.విష్ణువర్ధన్‌రెడ్డి ప్రాతినిధ్యం వహించినా పీజేఆర్‌కు ఉన్న ఓర్పు, నేర్పు లేకపోవడంతో కాంగ్రెస్‌ పార్టీకి కంచుకోటగా ఉన్న ప్రస్తుత జూబ్లీహిల్స్‌ నియోజకవర్గం ప్రాంతంలో క్రమేపీ ఆ పార్టీ తన ప్రాబల్యాన్ని కోల్పోతూ వచ్చింది. ఇప్పటికీ పీజేఆర్‌ అభిమానులు, కాంగ్రెస్‌ నాయకులు పటిష్టంగా ఉన్నా సమర్థవంతంగా నడిపించే నాయకులు లేక పార్టీ చతికిల పడిపోయింది. దీంతో దశాబ్దాలకాలం పాటు వెన్నంటి నడిచిన కేడర్‌కు దిక్కులేకుండా పోయింది. 

► అధికార పార్టీ ఒత్తిడిని తట్టుకోలేక మెజారిటీ నాయకులు పార్టీలు మారినా.. ఉన్న కొంత మంది పీజేఆర్‌ను మరువలేక పార్టీని వదలలేక పార్టీలోనే కొనసాగుతున్నారు. 

► పీజేఆర్‌ తనయుడు మాజీ ఎమ్మెల్యే పీవీఆర్‌ కేవలం ఎలక్షన్స్‌ ముందు మాత్రమే జూబ్లీహిల్స్‌ నియోజకవర్గంలో పర్యటిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. పీవీఆర్‌కు సత్తా ఉన్నా నియోజకవర్గంలో సమస్యలు, పార్టీలో యువతను సంఘటితం చేస్తూ పార్టీలో చురుకుగా పాల్గొనకపోవడం పెద్ద సమస్యగా మారింది. పి.విష్ణువర్ధన్‌రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు చాలా చురుకుగా ఉండి, ఎప్పుడూ నియోజకవర్గంలోనే ఉంటూ అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టారు. క్రమేపీ ఆయనలోని మార్పుల వల్ల పార్టీ బలహీనంగా మారింది.  

► ఆయన నివాసం కూడా దోమలగూడలో ఉండటంతో కార్యకర్తలు, నేతలకు ఒకింత సమస్యగానే మారింది. దీంతో కొత్త నాయకత్వం వైపు పలువురు సీనియర్‌ నేతలు ఎదురుచూపులు చూస్తున్నారు. ఇంతవరకూ పెద్దాయనపై ఉన్న గౌరవంతో ఈ నియోజకవర్గం పార్టీ స్థితిగతులపై దృష్టి సారించిన పార్టీ హైకమాండ్‌ మారుతున్న రాజకీయ పరిస్థితులపై సీరియస్‌గా దృష్టి సారించినట్లు సమాచారం. 

గతంలో... 
దివంగత పీజేఆర్‌ ఖైరతాబాద్‌ నియోజకవర్గం నుంచి ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొంది తన సత్తా చాటుకున్నారు. జాతీయ స్థాయి నాయకుల మన్ననలు పొందారు. ఆయన మరణాంతరం జరిగిన ఉప ఎన్నికల్లో పీజేఆర్‌ తనుయుడు విష్ణువర్ధన్‌రెడ్డి విజయం సాధించారు. ఆ తరువాత నూతనంగా ఏర్పాటైన జూబ్లీహిల్స్‌ నియోజకవర్గం నుంచి మరోసారి పి.విషువర్ధన్‌రెడ్డి విజయం సాధించారు. మొత్తంగా ఏడుగురు కార్పొరేటర్లలో నలుగురు కాంగ్రెస్‌ కార్పొరేటర్లు విజయం సాధించారు. ఆ తరువాత జరిగిన శాసనసభ ఎన్నికల్లో విష్ణువర్ధన్‌రెడ్డి వరుస అపజయాలను మూటగట్టుకున్నారు. 

► టీ పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్‌రెడ్డి పగ్గాలు చేపట్టాక పార్టీలో నూతనోత్తేజం వస్తుందని అశించిన పార్టీ కేడర్‌కు నిరాశే మిగిలింది.
 
► మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్‌రెడ్డి పనితీరుతో ఎలాంటి మార్పు రాకపోవడంతో పార్టీని బతికించుకోవడం కోసం తమ ఉనికిని కాపాడుకోవడం కోసం కొత్త నాయకత్వం వైపు చూడక  తప్పడంలేదని సీనియర్లు భావిస్తున్నారు. 

► సీనియర్‌ నేతలను సంప్రదించకుండా ఏక పక్షంగా నియామకాలు చేపట్టంపై అసంతృప్తి చెందిన నేతలు నియోజకవర్గంలో పార్టీ ప్రక్షాళన కోసం శ్రీకారం చుట్టారు. 

అజహరుద్దీన్‌ పర్యటనలో ఆంతర్యమేమిటో? 
కాంగ్రెస్‌ పార్టీ ముఖ్య నేత, టీం ఇండియా మాజీ సారథి మహ్మద్‌ అజహరుద్దీన్‌ బుధవారం జూబ్లిహిల్స్‌ నియోజకవర్గంలో పర్యటించారు. ముఖ్య నేతలను కలుసుకొని వివిధ అంశాలపై చర్చించినట్లు సమాచారం. నియోజకవర్గంలో అభ్యర్థులు గెలుపోటముల్లో ముస్లిం ఓట్లే కీలకం అయిన నేపథ్యంలో కాంగ్రెస్‌ పార్టీ అధిష్టానం అజహరుద్దీన్‌ను బరిలోకి దింపితే ఎలా ఉంటుందో అనే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం.

పార్టీ ఢిల్లీ అధిష్టానం సూచనల మేరకే అజహరుద్దీన్‌ పర్యటన సాగిందని ఆయా పార్టీ వర్గాలు చెబుతున్నాయి. జూబ్లీహిల్స్‌ నియోజకవర్గ బరిలో అధిష్టానం మాజీ ఎమ్మెల్యే పీవీఆర్‌కు మరో అవకాశం ఇస్తుందా.. కొత్త నేతలకు అవకాశం ఇస్తుందా అనేది కాలమే నిర్ణయించాలి.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement