Ranga Reddy District: ఇద్దరు సీఎంలు, ముగ్గురు హోంమినిస్టర్లు మనవారే | - | Sakshi
Sakshi News home page

Ranga Reddy District: ఇద్దరు సీఎంలు, ముగ్గురు హోంమినిస్టర్లు మనవారే

Published Thu, Oct 26 2023 7:58 AM | Last Updated on Thu, Oct 26 2023 8:46 AM

- - Sakshi

సాక్షి, రంగారెడ్డి జిల్లా: ఉమ్మడి ఏపీ, తెలంగాణ రాజకీయాల్లో ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు ఓ ప్రత్యేక గుర్తింపు ఉంది. అనేకమంది ఉద్ధండులకు నిలయంగా ఈ జిల్లా నిలిచింది. హైదరాబాద్‌ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా పనిచేసిన బూర్గుల రామకృష్ణారావు షాద్‌నగర్‌ (ఒకప్పడు మహబూబ్‌ నగర్‌ జిల్లా, ఇప్పుడు రంగారెడ్డి జిల్లాలో భాగం) నియోజకవర్గం నుంచే గెలుపొందారు. ఉమ్మడి ఏపీ ముఖ్యమంత్రిగా పనిచేసిన మర్రి చెన్నారెడ్డి కూడా ఉమ్మడి జిల్లాలోని వికారాబాద్‌ నుంచి ఒకసారి, మేడ్చల్‌ నుంచి మరోసారి గెలుపొందారు. కేంద్రమంత్రిగా పనిచేసిన దివంగత నేత సూదిని జైపాల్‌రెడ్డి కూడా ప్రస్తుత రంగారెడ్డి జిల్లా పరిధిలోని కల్వకుర్తి నియోజకవర్గం నుంచి 4 సార్లు గెలుపొందారు. టీడీపీ వ్యవస్థాపకుడు, దివంగత మాజీ సీఎం ఎన్‌టీఆర్‌ తొలిసారిగా ఓటమిని చవిచూసింది ఇక్కడే. ఆయనపై గెలుపొందిన చిత్తరంజన్‌దాస్‌ చెన్నారెడ్డి మంత్రివర్గంలో చోటు దక్కించుకున్నారు.

మేడ్చల్‌ నియోజకవర్గం..
మేడ్చల్‌ నియోజకవర్గానికి ఇప్పటివరకు 14 సార్లు ఎన్నికలు నిర్వహించగా పది మంది ఎమ్మెల్యేలుగా ప్రాతినిధ్యం వహించారు. వీరిలో ఒకరు ముఖ్యమంత్రిగా.. మరో ఐదుగురు మంత్రులుగా పనిచేశారు. వీరిలో సుమిత్రాదేవి (1967–72) జిల్లా నుంచి తొలి మంత్రిగా పనిచేశారు. ఆ తర్వాత మర్రిచెన్నారెడ్డి 1978లో కాంగ్రెస్‌ నుంచి గెలుపొంది ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఆయన మొత్తం ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. వికారాబాద్‌, తాండూరు నుంచి రెండేసి సార్లు, సనత్‌నగర్‌ నుంచి ఒకసారి, మేడ్చల్‌ నుంచి ఒకసారి విజయం సాధించారు. ఆ తర్వాత ఉమా వెంకట్రామిరెడ్డి(1983, 1989) కాంగ్రెస్‌ నుంచి, సురేందర్‌రెడ్డి(1985) టీడీపీ నుంచి పోటీచేసి గెలుపొందడమే కాకుండా ఆయా ప్రభుత్వాల్లో మంత్రులుగా పనిచేశారు. ఆ తర్వాత 1994 నుంచి 2004 వరకు టీడీపీ నుంచి వరుసగా మూడుసార్లు తూళ్ల దేవేందర్‌గౌడ్‌ గెలుపొందారు. ఆయన హోం, రెవెన్యూశాఖ మంత్రిగా పనిచేశారు. ప్రస్తుత కార్మికశాఖ మంత్రిగా కొనసాగుతున్న మల్లారెడ్డి సైతం మే డ్చల్‌ నియోజకవర్గం నుంచి గెలుపొందారు.

చేవెళ్ల నియోజకవర్గం..
చేవెళ్ల నియోజకవర్గానికి 1962 నుంచి ఇప్పటివరకు 14సార్లు ఎన్నికలు నిర్వహించగా తొమ్మిది మంది ఎమ్మెల్యేలుగా పనిచేశారు. వీరిలో 1985 నుంచి వరుసగా నాలుగు సార్లు (టీడీపీ నుంచి మూడు, కాంగ్రెస్‌ నుంచి ఒకసారి) గెలుపొందిన పి.ఇంద్రారెడ్డి ఉమ్మడి ఏపీలోని ఎన్‌టీఆర్‌ కేబినెట్‌లో హోంశాఖ మంత్రిగా పనిచేశారు. ఆయన అకాల మరణం తర్వాత ఆ స్థానానికి (2000) నిర్వహించిన ఉపఎన్నికల్లో ఆయన సతీమణి సబితారెడ్డి గెలుపొందారు. ఆమె 2004లో కాంగ్రెస్‌ నుంచి మళ్లీ విజయం సాధించి తొలి మహిళా హోంమంత్రి(దేశంలోనే తొలి మహిళా హోంమంత్రి)గా పనిచేశారు. దంపతులిద్దరూ ఒకే నియోజకవర్గం నుంచి గెలుపొండమే కాకుండా ఒకే శాఖకు మంత్రిగా పనిచేయడం విశేషం. 2009లో కాంగ్రెస్‌ అభ్యర్థిగా మహే శ్వరం నియోజకవర్గం నుంచి గెలుపొందిన సబితారెడ్డి గనులు భూగర్భవనరుల శాఖ మంత్రిగా పనిచేశారు.2018లో అదేస్థానంలో కాంగ్రెస్‌ అభ్య ర్థిగా విజయం సాధించి.. ఆ తర్వాత అధికార బీఆర్‌ఎస్‌లో చేరి విద్యాశాఖ మంత్రిగా కొనసాగుతున్నారు.

పరిగి నియోజకవర్గం..
పరిగి నియోజకవర్గానికి ఇప్పటివరకు 15సార్లు ఎన్నికలు జరిగగా.. 12 మంది రెడ్డి సామాజికవర్గం వారే విజయం సాధించారు. మూడుసార్లు మైనార్టీ(ముస్లిం) అభ్యర్థులు గెలుపొందారు. 1967లో స్వతంత్ర అభ్యర్థిగా కమతం రామిరెడ్డి గెలుపొందారు. ఆ తర్వాత 1972, 1989లో ఆయనే కాంగ్రెస్‌ నుంచి గెలుపొందారు. జలగం వెంగళ్‌రావు, నేదురుమల్లి జనార్ధన్‌రెడ్డి, కోట్ల విజయభాస్కర్‌రెడ్డి కేబినెట్లో.. కమతం రాంరెడ్డి వివిధ శాఖలకు మంత్రిగా పనిచేశారు. 1978, 1983లో పరిగిలో కాంగ్రెస్‌ అభ్యర్థిగా గెలుపొందిన ఎ.షరీ్‌ఫ్‌ చెన్నారెడ్డి, టంగుటూరి అంజయ్య కేబినెట్లలో మంత్రిగా పనిచేశారు. ఆ తర్వాత టీడీపీ నుంచి ఐదుసార్లు(1985, 1994, 1999, 2004, 2009) గెలుపొందిన హరీశ్వర్‌రెడ్డి డిప్యూటీ స్పీకర్‌గా పనిచేశారు. ప్రస్తుతం ఆయన కొడుకు కొప్పుల మహేశ్‌రెడ్డి పరిగి ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు.

వికారాబాద్‌, తాండూర్‌లో..
వికారాబాద్‌లో ఇప్పటివరకు 16 సార్లు ఎన్నికలు నిర్వహించగా ఎనిమిది మంది ఎమ్మెల్యేగా పనిచేశారు. చంద్రశేఖర్‌ కొంతకాలం చంద్రబాబు కేబినెట్‌లో మంత్రిగా పనిచేయగా, గడ్డం ప్రసాద్‌ కిరణ్‌కుమార్‌రెడ్డి మంత్రి వర్గంలో పనిచేశారు. ఇక్కడ నుంచి గెలుపొందిన రామస్వామి కూడా మంత్రిగా పనిచేశారు. ఉమ్మడి ఏపీ సీఎంగా పనిచేసిన మర్రిచెన్నారెడ్డి కూడా ఇదే నియోజకవర్గం నుంచి రెండుసార్లు గెలుపొందారు. తాండూరుకి ఇప్పటివరకు 15 సార్లు ఎన్నికలు నిర్వహించగా.. ఏడుగురు ఎమ్మెల్యేలుగా పనిచేశారు. వీరిలో మాణిక్య రావు, మర్రి చెన్నారెడ్డి, పట్నం మహేందర్‌రెడ్డి మంత్రులుగా పనిచేశారు. ప్రస్తుతం ఇక్కడి నుంచి పైలెట్‌ రోహిత్‌రెడ్డి ఎమ్మెల్యేగా ప్రాతినిథ్యం వహిస్తున్నారు.

షాద్‌నగర్‌ నియోజకవర్గం..
షాద్‌నగర్‌ నియోజకవర్గానికి ఇప్పటివరకు 15 సార్లు ఎన్నికలు నిర్వహించగా.. 11 మంది ఎమ్మెల్యేలుగా పనిచేశారు. 1952లో కాంగ్రెస్‌ నుంచి గెలుపొందిన బూర్గుల రామకృష్ణారావు హైదరాబాద్‌ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా, కేరళ గవర్నర్‌గా పనిచేశారు. ఇక్కడి నుంచి నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన డాక్టర్‌ పి.శంకర్‌రావు గతంలో కోట్ల విజయ భాస్కర్‌రెడ్డి మంత్రివర్గంలో పనిచేశారు.అలాగే 2009లో కంటోన్మెంట్‌ నుంచి గెలుపొందికిరణ్‌కుమార్‌రెడ్డి మంత్రివర్గంలో పనిచేశారు.

తొలి మహిళా హోంమంత్రిగా సబితారెడ్డి
అలాగే చేవెళ్ల నుంచి గెలుపొందిన పటోళ్ల ఇంద్రారెడ్డి, సబితారెడ్డి దంపతులిద్దరూ ఉమ్మడి ఏపీలో హోంమంత్రులుగా పనిచేశారు. అయితే దివంగత నేత, మాజీ సీఎం డా.వైఎస్సార్‌ కేబినేట్‌లో దేశంలోనే తొలి మహిళా హోంమంత్రిగా సబితారెడ్డి రికార్డులకెక్కారు. ఇదే జిల్లాకు చెందిన తూళ్ల దేవేందర్‌గౌడ్‌ సైతం ఉమ్మడి ఏపీలో హోంమంత్రిగా పనిచేశారు. ప్రస్తుతం మహేశ్వరం నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న సబితారెడ్డి విద్యాశాఖ మంత్రిగా, మేడ్చల్‌ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న చామకూర మల్లారెడ్డి కార్మికశాఖ మంత్రిగా కొనసాగుతున్నారు. ఉమ్మడి జిల్లాలో 17 నియోజకవర్గాలు ఉండగా.. వీటిలో 10 స్థానాల్లోని అభ్యర్థులకు ఇప్పటివరకు ఆయా మంత్రివర్గాల్లో అవకాశం లభించింది. అయితే రాజేంద్రనగర్‌, ఎల్బీనగర్‌, ఉప్పల్‌, కుత్బుల్లాపూర్‌, కూకట్‌పల్లి, శేర్‌లింగంపల్లి, మల్కాజ్‌గిరి నియోజకవర్గాలకు ఇప్పటి వరకు ఏ మంత్రివర్గంలోనూ చోటు లభించకపోవడం గమనార్హం.

కల్వకుర్తి నియోజకవర్గం..
కల్వకుర్తి నియోజకవర్గానికి ఇప్పటి వరకు 17 సార్లు ఎన్నికలు నిర్వహించగా 11 మంది ఎమ్మెల్యేలుగా పనిచేశారు. కేంద్ర మాజీ మంత్రి, దివంగత సూదిని జైపాల్‌రెడ్డికి రాజకీయ భిక్ష పెట్టింది ఈ నియోజకవర్గమే. 1969, 1972లో కాంగ్రెస్‌ నుంచి, 1978,1983లో జనతా పార్టీ నుంచి జైపాల్‌రెడ్డి నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. మహబూబ్‌నగర్‌ నుంచి రెండుసార్లు, మిర్యాలగూడ నుంచి రెండు సార్లు ఎంపీగా గెలుపొంది కేంద్రమంత్రిగా పనిచేశారు. టీడీపీ వ్యవస్థాపకుడు, మాజీ ముఖ్యమంత్రి ఎన్‌టీఆర్‌.. 1989లో ఇక్కడి నుంచి ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. ఎన్‌టీఆర్‌ను ఓడించిన చిత్తరంజన్‌దాస్‌కు చెన్నారెడ్డి మంత్రివర్గంలో చోటు లభించింది.

ఇబ్రహీంపట్నం నియోజకవర్గం
ఇబ్రహీంపట్నం నియోజకవర్గానికి ఇప్పటివరకు 16 సార్లు ఎన్నికలు నిర్వహించగా.. 11 మంది ఎమ్మెల్యేలుగా పనిచేశారు. వీరిలో 1957–67 వరకు ఎమ్మెల్యేగా కొనసాగిన ఎంఎన్‌ లక్ష్మీనర్సయ్య సహా 1978లో కాంగ్రెస్‌ నుంచి గెలుపొందిన సుమిత్రాదేవి, 1999లో టీడీపీ నుంచి గెలుపొందిన కొండ్రు పుష్పలీల మంత్రులుగా పనిచేశారు. ప్రస్తుతం ఇక్కడ మంచిరెడ్డి కిషన్‌రెడ్డి(బీఆర్‌ఎస్‌) ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement