హైదరాబాద్: కాషాయ పార్టీలో జనసేనతో పొత్తు చిచ్చు రేపుతోంది. నగరంలో మూడు సీట్ల కోసం జనసేన పార్టీ పట్టుబడుతోంది. కమలం పార్టీ నేతలు మాత్రం అవి వదులుకోవడానికి ససేమిరా అంటున్నారు. శేరిలింగంపల్లి, కూకట్‌పల్లి, మల్కాజిగిరి స్థానాలు పొత్తులో భాగంగా తమకు వదిలేయాలని జనసేన ఒత్తిడి చేస్తోంది. శేరిలింగంపల్లి నుంచి బీజేపీ అభ్యర్థిగా రవి యాదవ్‌ను రంగంలోకి దింపాలని మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి నేరుగా అధిష్టానం పెద్దలను డిమాండ్ చేశారు. ఒకవైపు బీజేపీ మ్యానిఫెస్టో కమిటీ చైర్మన్ వివేక్ పార్టీకి రాజీనామా చేయడం.. అదే సమయంలో కొండా అధిష్టానం పెద్దలకు అల్టిమేటం జారీ చేయడం ఉత్కంఠకు కారణమవుతోంది.
చేవెళ్ల పార్లమెంట్ పరిధిలో తాను చెప్పిన వారికే టికెట్లు ఇవ్వాలని కొండా పట్టుబడుతున్నారు. చివరకు శేరిలింగంపల్లి బీజేపీ అభ్యర్థిని మూడో జాబితాలో అయినా ప్రకటిస్తారా? మరికొన్ని రోజులు పెండింగ్‌లోనే ఉంచుతారా? అన్నది ఆసక్తి కరంగా మారింది. కూకట్‌పల్లి సీటుపై జనసేన భారీ ఆశలు పెట్టుకుంది. ఈ స్థానం ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలేది లేదని బీజేపీ స్థానిక నేతలు రాష్ట్ర కార్యాలయంలో ఆందోళన చేశారు. జనసేన పొత్తులో భాగంగా ఈ స్థానాన్ని బీజేపీ వదిలేస్తుందన్న సమాచారంతో వడ్డేపల్లి రాజేశ్వరరావు, మాధవరం కాంతారావు ఆ పార్టీకి రాజీనామా చేశారు. లోకల్ కేడర్ ఒత్తిడికి అధినాయకత్వం తలోగ్గుతుందా? లేదా? అన్నది తేలాల్సి ఉంది.
మల్కాజిగిరి అసెంబ్లీ స్థానంలో గతంలో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన మాజీ ఎమ్మెల్సీ రామచందర్ రావు ఈసారి పోటీ నుంచి తప్పుకున్నారు. బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు భాను ప్రకాష్, మాజీ ఎమ్మెల్యే ఆకుల రాజేందర్ తదితరులు బీజేపీ నుంచి టికెట్ కోసం ఆశిస్తున్నారు. బీజేపీ మాత్రం మల్కాజిగిరి సీటు జనసేనకు పొత్తులో వదిలేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.
మిగతా సీట్లపై క్లారిటీ?
హైదరాబాద్, సికింద్రాబాద్, మల్కాజిగిరి, చేవెళ్ల పార్లమెంట్ పరిధిలో అసెంబ్లీ స్థానాలపై మూడో జాబితాలో క్లారిటీ రానుంది. ఇప్పటికే బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం తెలంగాణ మూడో జాబితాకు ఆమోద ముద్ర వేసింది. పార్టీ రాష్ట్ర సారథి కిషన్ రెడ్డి సీఈసీ ఆమోదించిన అభ్యర్థులకు ఫోన్ చేసి అభినందనలు తెలుపుతున్నారు. ముషీరాబాద్‌కు హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ తనయ బండారు విజయలక్ష్మి, అంబర్‌పేటకు గౌతమ్ రావు పేర్లు ఖరారైనట్లు తెలిసింది.
జూబ్లీహిల్స్ టిక్కెట్ కోసం కీర్తి రెడ్డి, విక్రమ్ గౌడ్, దీపక్ రెడ్డి పోటీ పడుతున్నారు. సికింద్రాబాద్‌కు బండ కార్తీక రెడ్డి, కంటోన్మెంట్‌కు మాజీ మంత్రి శంకర్ రావు కుమార్తె సుస్మిత పేర్లను వివేక్ ప్రతిపాదించారు. వివేక్ పార్టీ వీడటంతో కంటోన్మెంట్ స్థానానికి తులసీ విజయ రాం పేరు తెర మీదకు వచి్చంది. రాజేంద్రనగర్ అసెంబ్లీ స్థానం తోకల శ్రీనివాస్ రెడ్డి పేరు ఖరారు చేశారు. ఎల్బీనగర్ సీటు తనకే ఇవ్వాలని సామ రంగారెడ్డి పట్టుబడుతున్నారు. గ్రేటర్ పరిధిలో మెజార్టీ సీట్లు మూడో జాబితాలో వెలువడే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment