జనసేనతో కటీఫ్‌.. ఓటమి కన్నా ఆ అవమానమే ఎక్కువగా! | Reason Behind BJP Break Ties With Jana Sena | Sakshi
Sakshi News home page

జనసేనతో బీజేపీ కటీఫ్‌.. ఓటమి కన్నా ఆ అవమానమే ఎక్కువగా!

Published Fri, Dec 15 2023 5:13 PM | Last Updated on Fri, Dec 15 2023 7:04 PM

Reason Behind BJP Break Ties With Jana Sena - Sakshi

‘‘బీజేపీతో మాది బలమైన బంధం. భవిష్యత్తులో రెండు పార్టీలు కలిసే ఉమ్మడి కార్యక్రమాలు నిర్వహిస్తాయి..’’ పవన్‌ ఎంతో కాన్ఫిడెంట్‌గా పలుసార్లు చేసిన ప్రకటన ఇది. అయితే బీజేపీ మాత్రం పవన్‌ విషయంలో ఇంత కాన్ఫిడెంట్‌గా లేదు. అయినప్పటికీ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కోసం పొత్తుగా ముందుకు వెళ్లింది. ఇప్పుడేమో.. భవిష్యత్తు ఎన్నికల్లో ఎలాంటి పొత్తు ఉండబోవని కరాఖండిగా చెప్పేసింది. అయితే.. జనసేనతో కటీఫ్‌కు గల కారణం తెలిసిపోయింది!.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల సమీక్ష తర్వాత.. సీట్లతో పాటు ఓటింగ్‌ శాతం పెరిగిందని బీజేపీ నేతలు సంతోషంగా ప్రకటన చేశారు. కానీ, అది నామ్‌ కే వాస్తే ప్రకటన మాత్రమే!. ఓటమిలో పవన్‌ పార్టీతో పొత్తు ప్రభావం చూపించిందని అటు ఢిల్లీ పెద్దలు, ఇటు రాష్ట్ర కీలక నేతలు కూడా ఒక అంచనాకి వచ్చారు. అధికారం కైవసం చేసుకోవడం సంగతి పక్కనపెడితే.. ఎక్కువ సీట్లు గెలిచే బీజేపీ అవకాశాల్ని పవన్‌ సారధ్యంలోని జనసేన పార్టీ ఘోరంగా దెబ్బ తీసిందనేది అంచనా సారాంశం!!.

🔸ప్చ్‌.. ఒంటరిగా పోటీ చేసి ఉంటేనా?
అసెంబ్లీ ఎన్నికల్లో గ్రేటర్‌ పరిధిలో కనీసం రెండు మూడు సీట్లు గెల్చుకునే బీజేపీ.. 2018 టైంలో ముందస్తు ఎన్నికలతో దారుణంగా నష్టపోయింది!. అయితే ప్రభుత్వ వ్యతిరేకత బలంగా ఉందని నమ్మిన కాషాయం పార్టీ.. తెలంగాణలో ఎక్కువ సీట్లు గెలవొచ్చని, పైగా జీహెచ్‌ఎంసీ(2020) ఫలితాలతో గ్రేటర్‌లో కచ్చితంగా నాలుగైదు సీట్లు ఖాయమని అనుకుంది. కానీ.. అంతమంది (47) కార్పొరేటర్లు ఉండి కూడా కనీసం ఇంపాక్ట్‌ చూపించలేకపోయింది. గ్రేటర్‌లో తమ అంచనాలు తప్పడంలో జనసేనతో పొత్తు కూడా కారణమేనని బీజేపీ అనుకుంటోంది. పవన్‌ పార్టీతో కాకుండా సొంతంగా పోటీ చేసి ఉంటే.. గ్రేటర్‌లో బీజేపీ నాలుగైదు సీట్లు గెలిచి ఉండేదేమోనని విశ్లేషకుల అభిప్రాయం.   

🔸అంటీముట్టనట్లు!
అసెంబ్లీ ఎన్నికలు ఫలితాలు వచ్చాక.. తెలంగాణ కొత్త ప్రభుత్వానికి శుభాకాంక్షలు తెలియజేశాడు పవన్‌. కానీ, పొత్తు పార్టీతో మాత్రం తొలి నుంచే అంటీముట్టనట్లే ఉంటూ వస్తున్నాడు. ఓటమి గల కారణాలపై కనీస విశ్లేషణ జరపలేదని పార్టీ శ్రేణులే అసంతృప్తితో ఉండగా.. రాష్ట్ర బీజేపీ నేతలతో, మరోవైపు కనీసం బీజేపీ అగ్రనేతలతో కనీసం ఫోన్‌లో కూడా పవన్‌ మాట్లాడలేని పరిస్థితిలో ఉన్నాడా? అని బీజేపీ శ్రేణులు నిలదీస్తున్నాయి. ఎన్నికల ప్రచారం విషయంలోనూ పవన్‌ సీరియస్‌గా లేకపోవడంతో.. పవన్‌ ఉద్దేశపూర్వకంగానే ఇలా చేస్తున్నాడా? అనే చర్చా నడిచింది. 


🔸ఆ అవమానం ఎందుకనుకుందో!
తెలంగాణ ఎన్నికల్లో 32 సీట్లలో పోటీ చేసి తీరతామనే ప్రకటన నుంచి.. బీజేపీతో పొత్తు, బీజేపీ అసంతృప్తుల రచ్చ, తదనంతరం 8 సీట్లలో పోటీ చేసింది. ఆ టైంలోనే కొల్లాపూర్‌ ఇండిపెండెంట్‌ అభ్యర్థి కర్నె శిరీష(బర్రెలక్క)ను పోలుస్తూ.. పవన్‌ను ఏకిపారేశారు పలువురు.  ఒంటరి పోరు అంటే ఎలా ఉంటుందో ఆ అమ్మాయిని చూసి నేర్చుకోవాలంటూ సూచించారు. కట్‌ చేస్తే.. 

రాజకీయ ప్రత్యర్థులు, ఆఖరికి నెట్‌లో  ఎన్నికల ఫలితాల్లో జనసేనను మామూలుగా ట్రోల్‌ చేయలేదు. ఎనిమిది మంది జనసేన అభ్యర్థులకు డిపాజిట్లు దక్కలేదు. ఆ టైంలో బర్రెలక్క కంటే ఓట్లు తక్కువ వచ్చాయనే పాయింట్‌ మీద తెలంగాణ పౌర సమాజం సెటైర్లు, విమర్శలు గుప్పించింది. తాజాగా.. పలాస బహిరంగ సభలో ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సైతం ఇదే అంశాన్ని ప్రస్తావించి మరీ పవన్‌ కల్యాణ్‌ను ఏకిపారేశారు. ఇంత అవమానాలు ఎదుర్కొంటున్న వ్యక్తితో వచ్చే ఎన్నికల్లోనూ పొత్తుకు వెళ్తే.. ఇలాంటి ఫలితాలే వస్తాయనే అంచనాకి వచ్చింది కమలం పార్టీ.

🔸చీప్‌గా చూసిన ప్రజలు
కేడర్‌ వద్దని వారించినా.. చివరకు పార్టీ రాష్ట్ర కార్యాలయం ముందు అసంతృప్తులు నిరసనలను వ్యక్తి చేసినా సరే జనసేనతో పొత్తుకు వెళ్లింది బీజేపీ అధిష్టానం. కానీ, ఊహించని రేంజ్‌లో దెబ్బ తింది. పదేళ్లుగా జనసేన పార్టీ, ఆ పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్‌ వెలగబెడుతుంది ఏంటో తెలుగు రాష్ట్రాల ప్రజలకు తెలుసు. అలాంటి వ్యక్తితో పొత్తును భరించగలరా?. పవన్‌తో స్టేజ్‌ మీద కూర్చున్నప్పడు తెలంగాణ ప్రజలు ఆ పార్టీని కూడా చీప్‌గా చూడకుండా ఉండగలరా?. ఆ సంగతి పక్కనపెడితే.. పవన్‌తో, జనసేన పార్టీతో ప్రజాకర్షణ, పొలిటికల్‌మైలేజ్‌ లాంటివేం ఈ ఎన్నికల్లో తమకు కలిసిరాలేవని, ఇక మీదటా రాకపోవచ్చనే కంక్లూజన్‌కి బీజేపీ హైకమాండ్‌ వచ్చింది. అందుకే పొత్తు తెంచుకోవాలని తెలంగాణ బీజేపీకి సూచించి ఉండొచ్చు.  

అన్నింటికి మించి.. పవన్‌ కల్యాణ్‌ తెలుగు రాజకీయాల్లో అపరిచితుడు. జనసైనికులు మాత్రమే కాదు తన నిలకడలేమితో  ఒకానొక దశలో బీజేపీని సైతం అయోమయంలో పడేశాడు పవన్‌. టీడీపీతో చెట్టాపట్టాలేసుకుంటూ.. పేదల వ్యతిరేకిగా ముద్రపడిన చంద్రబాబులాంటి  పెత్తందారి లీడర్‌కు మద్ధతుగా నిలుస్తూ వస్తున్నాడు.  అదే సమయంలో బీజేపీతో బలమైన దోస్తీ అంటూ ప్రకటనలు ఇచ్చాడు. తద్వారా.. పవన్‌ను ఏమీ అనలేని దైన్యంలో బీజేపీ ఉందా? అనే అనుమానం తెలుగు ప్రజల్లో ఏర్పడింది. ఆ అపోహను తొలగించే యత్నంలో భాగంగానే అనైతిక బంధంలో ఉన్న పవన్‌కు బీజేపీ కటీఫ్‌ చెప్పేసిందా? అనే కోణంలోనూ చర్చ నడుస్తోంది ఇప్పుడు.
 

వీడియో: పవన్‌ నీచుడు.. అందుకే మా రాజీనామా

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement