తెలంగాణలోనే ఖరీదైన ఎన్నికలు..! రసవత్తరంగా సిర్పూర్‌ పాలిటిక్స్‌ | - | Sakshi
Sakshi News home page

తెలంగాణలోనే ఖరీదైన ఎన్నికలు..! రసవత్తరంగా సిర్పూర్‌ పాలిటిక్స్‌

Published Thu, Oct 12 2023 5:08 AM | Last Updated on Thu, Oct 12 2023 1:55 PM

- - Sakshi

రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్‌ను ఈసీ ప్రకటించడంతో పోలీస్‌శాఖ భద్రతను కట్టుదిట్టం చేస్తోంది. గతంతో పోలిస్తే ఈసారి ఎన్నికలు హోరాహోరీగా సాగుతాయనే అంచనాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఎన్నికల అధికారులు, పోలీసు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు జిల్లాలోని రెండు నియోజకవర్గాల్లో అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. జిల్లా సరిహద్దుల్లో విస్తృత తనిఖీలు చేపట్టేందుకు చెక్‌పోస్టులు ఏర్పాటు చేశారు.

కౌటాల(సిర్పూర్‌): కుమురంభీం జిల్లాకు ఓ వైపు మహారాష్ట్ర సరిహద్దుగా ఉంది. మరో వైపు ఆదిలా బాద్‌, మంచిర్యాల జిల్లాలు ఉన్నాయి. మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలో మావోయిస్టుల ప్రభావం అధికంగా ఉంటుంది. గతంలో సిర్పూర్‌లో మవోయిస్టుల దాడులతో ఎన్నికలు నిలిపివేసిన సందర్భాలూ ఉన్నాయి. ముఖ్యంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 1999లో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో సిర్పూర్‌ నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి పా ల్వాయి పురుషోత్తంను కాగజ్‌నగర్‌ పట్టణంలోని తన కార్యాలయంలోనే మవోయిస్టులు కాల్చి చంపి న ఘటన అప్పట్లో తీవ్ర కలకలం సృష్టించింది. జి ల్లాలో పోలీసులు, మావోయిస్టుల మధ్య కాల్పులు జరిగిన సంఘటనలు సైతం అనేకం ఉన్నాయి.

అడపాదడపా మవోయిస్టు సానుభూతిపరులంటూ పో లీసులు కొందరిని పట్టుకుని కేసులు నమోదు చే స్తున్న విషయం తెలిసిందే. దీంతో ఈసారి ఎన్నికల వేళా ఎలాంటి అలజడులు లేకుండా పోలీసుశాఖ కట్టుదిట్టమైన చర్యలకు దిగింది. అన్నిశాఖలను సమన్వయం చేసుకుంటూ ముందస్తు ఏర్పాట్లు చేస్తోంది. మంగళవారం నుంచి అంతర్రాష్ట్ర, అంతర్‌ జిల్లా చెక్‌పోస్టుల వద్ద తనిఖీలను ప్రారంభించారు. దీనికి తోడు అసెంబ్లీ ఎన్నికలు బహిష్కరించాలని మావోయిస్టు రాష్ట్ర కమిటీ పిలుపునివ్వడంతో పోలీసులు మరింత అప్రమత్తమయ్యారు.

ఖరీదైన ఎన్నికలు..!
పార్లమెంట్‌, అసెంబ్లీ, సర్పంచ్‌, ఎంపీటీసీ, మున్సి పల్‌, కార్పొరేషన్‌.. ఇలా ప్రతీ ఎలక్షన్‌ ఖరీదైపోయింది. అసెంబ్లీ ఎన్నికలు వీటికి మినహాయింపు ఏమీ కాదు. డబ్బులు పంచడం ఏ స్థాయికి చేరిదంటే.. ‘మాకు నోట్లు అందలేదంటూ..’ కొంతమంది ఓటర్లు బహిరంగంగానే రోడ్లపైకి వచ్చి మరీ ఆందోళనకు దిగే వరకు వెళ్లింది. రాష్ట్రంలో జరిగే ఎన్నికలు ఈసారి మరింత ఖరీదైనవిగా చరిత్రలో నిలుస్తాయని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. ఇందులో భాగంగానే కాస్ట్‌లీ ఎన్నికలు జరిగే ప్రాంతాలను పోలీస్‌శాఖ, ఎన్నికల అధికారులు ఇప్పటికే గుర్తించినట్లు సమాచారం. రాష్ట్రంలో టాప్‌ టెన్‌ కాస్ట్‌లీ ఎన్నిక సెగ్మెంట్లను గుర్తించగా.. అందులో ఆశ్చర్యకరంగా సిర్పూర్‌ నియోజకవర్గం సైతం ఉండడం గమనార్హం. బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ ఇక్కడి నుంచే బరిలో ఉండడంతో ఎన్నికలు రసవత్తరం కానున్నాయి.

చెక్‌పోస్టులు ప్రారంభం
కేంద్ర ఎన్నికల సంఘం తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ ప్రకటించడంతో సోమవారం నుంచే జిల్లాలో ఎన్నికల కోడ్‌ అమల్లోకి వచ్చింది. ఆసిఫాబాద్‌, సిర్పూర్‌ నియోజకవర్గాల్లో ఎన్నికలు జరగనున్నాయి. నవంబర్‌ 3న నోటిఫికేషన్‌ జారీ అవుతుండగా, అదే నెల 30న పోలింగ్‌ జరగనుంది. జిల్లా వ్యాప్తంగా మొత్తం 4,47,634 మంది ఓటర్లు ఉండగా 597 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేశారు. 74 సమస్యాత్మక కేంద్రాలు, 46 మావోయిస్టు ప్రభావిత కేంద్రాలపై ప్రత్యేక నిఘా ఉంచనున్నారు. ఎన్నికల నిర్వహణకు ఎలాంటి ఆటంకాలు ఎదురు కాకుండా పోలీస్‌ శాఖ ఆధ్వర్యంలో జిల్లాలో ఏడు చెక్‌పోస్టులు ఏర్పాటు చేశారు. వాంకిడి, సిర్పూర్‌(టి)లోని హుడ్కిలి, వెంకటాపూర్‌, చింతలమానెపల్లి మండలంలోని గూడెం వద్ద అంతర్రాష్ట్ర చెక్‌పోస్టులు, రెబ్బెన, తాండూర్‌ మధ్య, దహెగాంలోని కల్వాడ, జైనూర్‌లో అంతర్‌ జిల్లా చెక్‌పోస్టులను ప్రారంభించారు. ఎన్నికల కోడ్‌ దృష్ట్యా వాహనాల రాకపోకలపై నిఘా ఉంచి విస్తృత తనిఖీలు చేపడుతున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement