
హైదరాబాద్: నాలుగు వందల ఏళ్లకు పైగా చరిత్ర కలిగిన ప్రాచీన నగరం హైదరాబాద్. ఇక్కడ హిందూ, ముస్లింలు భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీకగా జీవనం సాగిస్తుంటారు. హైదరాబాద్ పాతనగరం, కొత్త నగరం రాజకీయ పరిస్థితికి భిన్నంగా ఉంటుంది. పాతబస్తీలోని అసెంబ్లీ నియోజకవర్గాల్లో రాజకీయాల ‘ఒరవడే’ వేరు. మేనిఫెస్టోలు, ప్రచార ఆర్భాటాలు ఇక్కడ నడవవు. బలమైన ముస్లిం, హిందుత్వ సామాజిక ఎజెండాలే ఇక్కడి పార్టీల ‘జెండా’లవుతాయి. ‘మజ్లిస్’గా అందరి నోళ్లలో నానే ఆల్ ఇండియా మజ్లిస్–ఎ–ఇత్తేహదుల్ ముస్లిమీన్ (ఏఐఎంఐఎం).. పాతబస్తీ నియోజకవర్గాలపై చెరగని ముద్ర వేసుకుంది. మత రాజకీయాలే ఇక్కడి ఎన్నికల ఫలితాలను శాసిస్తాయి. హిందూ, ముస్లిం ఎజెండాలతో ఇక్కడ మజ్లిస్, బీజేపీ రాజకీయంగా తలపడుతున్నా.. ఫలితం మాత్రం వన్ సైడ్‌గా ఉంటోంది. దశాబ్దాలుగా ఇక్కడ పట్టు కోసం బీజేపీ, బీఆర్‌ఎస్ పోటీ పడుతూనే ఉన్నాయి.
మజ్లిస్‌కు కంచుకోటలే..
పాతబస్తీలోని గోషామహల్ మినహా మిగిలిన చార్మినార్, యాకుత్‌పురా, బహదూర్‌పురా, కార్వాన్, చాంద్రాయణగుట్ట, నాంపల్లి, మలక్‌పేట అసెంబ్లీ నియోజవర్గాలు మజ్లిస్‌కు కంచు కోటలే. ఇక్కడ దశాబ్దాలుగా మజ్లిస్ తిరుగులేని శక్తిగా రాజకీయాలను శాసిస్తోంది. ఈ ఎన్నికల్లోనూ ఆ పార్టీ తిరిగి పట్టు నిలుపుకోవడం దాదాపు ఖాయమని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. కొన్ని దశాబ్దాలుగా బీజేపీ హిందుత్వ ఎజెండాతో మజ్లిస్ కంచుకోటను బద్దలు కొట్టి పాగా వేసేందుకు ప్రయతి్నస్తూనే ఉంది. మజ్లిస్ నుంచి చీలి సొంత కుంపటి పెట్టుకున్న ఎంబీటీ కూడా ఢీ అంటూ సర్వశక్తులూ ఒడ్డుతోంది. అయినప్పటికీ ప్రతీ ఎన్నికల్లో నామమాత్ర ప్రభావమే చూపుడం సర్వసాధారణమైంది. వాస్తవంగా ఈ నియోజకవర్గాల్లో ముస్లింల ఓట్లు అధికం. అధికారంలో ఉన్న పార్టీ.. ప్రతి ఎన్నికల వేళ స్నేహపూర్వక పోటీ పేరుతో బలహీన అభ్యర్థులను రంగంలోకి దింపడం మజ్లిస్‌కు కలిసివస్తోంది. పదేళ్ల ముందు కాంగ్రెస్‌తో, ఆ తర్వాత బీఆర్‌ఎస్‌తో మజ్లిస్ దోస్తీ కొనసాగిస్తోంది.
కార్వాన్‌లో కౌసర్
మజ్లిస్ ఎమ్మెల్యే కౌసర్ మొయినుద్దీన్ హ్యాట్రిక్ కోసం తహతహలాడుతున్నారు. మరోసారి కౌసర్ బరిలో దిగే అవకాశాలున్నాయి. మజ్లిస్‌కు గట్టి ఓటు బ్యాంకు ఉన్నా.. హిందుత్వ ఎజెండా కూడా బలంగానే ఉంది.. ఆ వర్గం ఓట్లన్నీ బీజేపీ, బీఆర్‌ఎస్, కాంగ్రెస్ పారీ్టల మధ్య చీలిపోవడం మజ్లిస్‌కు కలిసివస్తుంది. ఇప్పటికే బీఆర్‌ఎస్ కృష్ణయ్య అభ్యరి్థత్వాన్ని ఖరారు చేయగా, కాంగ్రెస్, బీజేపీలు అభ్యర్ధులను ప్రకటించాల్సి ఉంది.
బలమైన బలాల..
మలక్‌పేట నియోజకవర్గంలో ఇప్పటికే హ్యాట్రిక్ కొట్టిన మజ్లిస్ మరోసారి పచ్చ జెండా ఎగురవేసేందుకు సిద్ధంగా కనిపిస్తోంది. సిట్టింగ్ ఎమ్మెల్యే అహ్మద్ బిన్ బలాల తిరిగి రంగంలోకి దిగే అవకాశాలు ఉన్నాయి. బీజేపీకి సంస్థాగతంగా బలంగానే ఉన్నప్పటికీ బలమైన అభ్యర్థి రంగలోకి దిగితే తప్ప మజ్లిస్‌ను ఢీ కొట్టడం అసాధ్యమని రాజకీయ పరిశీలకులు పేర్కొంటున్నారు. కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పరిస్థితి అంతంత మాత్రమే. బీఆర్‌ఎస్ తీగల అజితా రెడ్డి అభ్యర్థిత్వాన్ని ఖరారు చేయగా.. కాంగ్రెస్, బీజీపీలు తమ అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది.
డబుల్ ధమాకా కోసం
చాంద్రాయణగుట్ట నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మజ్లిస్ ద్వితీయ అగ్రనేత అక్బరుద్దీన్ ఒవైసీ డబుల్ హ్యాట్రిక్ లాంఛనమే. ఈ నియోజకవర్గం ఆది నుంచి మజ్లిస్‌కు కంచుకోట. ఇక్కడ కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌తో పాటు బీజేపీ కూడా గట్టి పోటీనిచ్చే పరిస్థితి కనిపించదు. ఎంబీటీ సైతం గతంలో తలపడి ఆశలు వదులుకుంది. రికార్డు స్థాయి మెజార్టీతో వన్‌సైడ్ ఫలితం ఈ నియోజకవర్గం ప్రత్యేకత. ఇప్పటికే బీఆర్‌ఎస్ సీతారాం రెడ్డి అభ్యరి్థత్వాన్ని ఖరారు చేసి రంగలోకి దింపగా, కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులు ఖరారు కాలేదు.
‘చార్మినార్’ ఆవిర్భావం నుంచీ ఆధిపత్యం..
చార్మినార్ నియోజకవర్గం మజ్లిస్‌కు అనుకూలం. నియోజకవర్గం ఆవిర్భావం నుంచి మజ్లిస్ ఆధిపత్యమే కొనసాగుతోంది. ప్రస్తుతం సీనియర్ శాసన సభ్యుడు ముంతాజ్ అహ్మద్‌ఖాన్ ఇక్కడి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఐదు పర్యాయాలు యాకుత్‌పురా నుంచి గత పర్యాయం చారి్మనార్ నుంచి ఆయన ఎన్నికయ్యారు. ఈసారి ఆయన పోటీకి దూరంగా ఉండే అవకాశాలున్నట్లు ప్రచారం సాగుతోంది. ఒకవేళ ఆయన పోటీకి దూరంగా ఉంటే ఆయన స్థానంలో మజ్లిస్ శాసనసభా పక్ష నేత అక్బరుద్దీన్ కుమారుడు నూరుద్దీన్‌ను బరిలో దింపాలని పార్టీ యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే బీఆర్‌ఎస్ నుంచి ఇబ్రాహీం లోడి అభ్యరి్థత్వాన్ని ఖరారు చేయగా, కాంగ్రెస్, బీజేపీ ప్రకటించాల్సి ఉంది. ఇక్కడ కాంగ్రెస్, బీజేపీ, బీఆర్‌ఎస్ పరిస్థితి అంతంత మాత్రమే. ముస్లిం ఓట్లు అధికంగా ఉండటంతో పాటు హిందుత్వ వాదం కూడా బలంగా ఉంది. మజ్లిస్, కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీలు ముస్లిం ఓట్లను చీల్చుకుంటే.. తాము లబ్ధి పొందవచ్చని బీజేపీ భావిస్తోంది. ఇందుకోసం బలమైన అభ్యర్థిని రంగంలోకి దింపాలని యోచిస్తోంది.
బహదూర్‌పురాలో దశాబ్దాలుగా..
బహదూర్‌పురా నియోజకవర్గంలో దశాబ్దాలుగా మజ్లిస్ ప్రాతినిధ్యమే. ఇక్కడ మౌజం ఖాన్ సీనియర్ ఎమ్మెల్యే. వయసు రీత్యా మరోసారి ఆయనకు టికెట్ దక్కడం అనుమానమే అన్న ప్రచారం సాగుతోంది. ఆయన స్థానంలో కొత్త అభ్యర్ధి బరిలో దిగే అవకాశాలు లేకపోలేదు. మజ్లిస్ పార్టీ సంస్థాగతంగా బలంగా ఉంది. ప్రతీసారి బీజేపీ, కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీలు పోటీ దిగినా.. ప్రభావం నామమాత్రమే. ఆయా రాజకీయ పక్షాలు సైతం ముస్లిం అభ్యర్థులను రంగంలోకి దింపినా.. పోటీ మాత్రం మజ్లిస్‌కు దరిదాపుల్లో కనిపించదు. భారీ మెజార్టీతో వార్‌వైన్‌సైడ్‌గా ఉంటుంది. ఇప్పటికే బీఆర్‌ఎస్ అలీ బక్రీ అభ్యర్థిత్వాన్ని ప్రకటించగా.. కాంగ్రెస్, బీజేపీ పార్టీల ప్రకటించాల్సి ఉంది. అయితే ఆయా పార్టీల నుంచి టికెట కోసం పోటీ తీవ్రంగానే ఉంది.
అంతా అనుకూలమే
యాకుత్‌పురా అసెంబ్లీ నియోజకవర్గం మజ్లిస్‌కు పూర్తి స్థాయిలో అనుకూలంగా ఉంటుంది. గత ఎన్నికల్లో మజ్లిస్‌ను ఢీకొట్టేందకు ఎంబీటీ శతవిధాలా ప్రయత్నించి విఫలమైంది. బీజేపీకి ఇక్కడ తన వర్గం ఓట్లపై పట్టుంది. కానీ, మజ్లిస్‌కు గట్టి పోటీ ఇవ్వలేకపోతోంది. గత ఎన్నికల్లో సీనియర్ ఎమ్మెలే అహ్మద్ పాషా ఖాద్రీ పోటీ చేసి ఘన విజయం సాధించారు. ఈసారి తిరిగి పోటీ చేయడం అనుమానమే. మరో అభ్యర్థి రంగంలోకి దిగే అవకాశాలున్నాయి. బీఆర్‌ఎస్ సామ సుందర్ రెడ్డి అభ్యర్థితాన్ని ఖరారు చేయగా, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు తమ అభ్యర్థులను ఖరారు చేయలేదు.
నాంపల్లిలో నువ్వా.. నేనా..?
నాంపల్లి నియోజకవర్గంలో గట్టి పోటీ ఎదుర్కొని మజ్లిస్ బయటపడుతూ వస్తోంది. జాఫర్ హుస్సే మేరాజ్ రెండుసార్లు ప్రాతినిధ్యం వహించారు. ఈసారి అభ్యర్థి మార్పు ఉంటుందని ప్రచారం సాగుతోంది. మాజీ మేయర్ మాజీద్ హుస్సేన్ పోటీలో దిగే అవకాశాలున్నాయి. మజ్లిస్ చేతిలో మూడు పర్యాయాలు ఓటమి చవి చూసిన ఫిరోజ్ ఖాన్ ఈసారి కూడా కాంగ్రెస్ నుంచి బరిలో దిగే అవకాశాలున్నాయి. అధికార బీఆర్‌ఎస్‌తో పాటు బీజేపీ సైతం తమ అభ్యర్థులను ఇప్పటివరకు ప్రకటించలేదు.
Comments
Please login to add a commentAdd a comment