హైదరాబాద్: పాతబస్తీ రాజకీయాలను శాసించే మజ్లిస్ పార్టీలో సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్ గుబులు పట్టుకుంది. ఈసారి ముగ్గురు సిట్టింగులకు ఉద్వాసన పలికే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే పార్టీ అధిష్టానం ఇద్దరు ఎమ్మెల్యేలకు రిటైర్మెంట్ ప్రకటించాలని నిర్ణయం తీసుకోగా, తాజాగా మరో ఎమ్మెల్యేకు సైతం రిటైర్మెంట్ ఇవ్వాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది. కాగా.. మరో ఎమ్మెల్యేకు మాత్రం సీటు మార్పు ఉంటుందని ప్రచారం సాగుతోంది. ఇప్పటికే అధికార టీఆర్‌ఎస్‌తో పాటు కాంగ్రెస్ పార్టీ కూడా అసెంబ్లీ అభ్యర్థులను ప్రకటించగా మజ్లిస్ పార్టీ మాత్రం అభ్యర్థులను ఇంకా ఖరారు చేయలేదు.
మరో రెండు మూడు రోజుల్లో ప్రకటించే అవకాశాలున్నట్లు పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. మొత్తం ఏడు సిట్టింగ్ స్థానాల్లో రెండు మినహా మిగతా స్థానాల అభ్యర్థిత్వాలపై చివరి వరకు ఉత్కంఠ కొనసాగడం సర్వసాధారణమే. పార్టీ నిర్ణయం రాజకీయ పరిశీలకులకే అంతుపట్టని విధంగా ఉంటోంది. పార్టీ అధినేత అసదుద్దీన్ ఒవైసీ నిర్ణయమే ఫైనల్. పార్టీ రాజకీయ వ్యూహంలో భాగంగానే ఈసారి సీనియర్ ఎమ్మెల్యేల వయోభారం దృష్ట్యా మార్పు అనివార్యంగా కనిపిస్తోంది. వారి స్థానంలో కొత్తగా యువతరానికి అవకాశం కల్పించాలని పార్టీ నిర్ణయించినట్లు తెలుస్తోంది.
రిటైర్మెంట్ బాటలో..
ఎన్నికల రిటైర్మెంట్ బాటలో సీనియర్ ఎమ్మెల్యేలు ఉన్నట్లు తెలుస్తోంది. పాత బస్తీలోని సిట్టింగ్ ఎమ్మెల్యేలు అహ్మద్ పాషా ఖాద్రీ, ముంతాజ్ ఖాన్, మౌజం ఖాన్‌లకు ఈసారి ఎన్నికల్లో పోటీ చేసే చాన్స్ లభించే అవకాశాలు కనిపించడం లేదు. ప్రస్తుతం చార్మినార్ అసెంబ్లీ స్థానం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ముంతాజ్ ఖాన్ ఎమ్మెల్యేగా డబుల్ హ్యాట్రిక్ కొట్టారు. యాకుత్‌పురా నుంచి ఐదు పర్యాయాలు, చార్మినార్ నుంచి ఒక పర్యాయం ఎన్నికయ్యారు. అహ్మద్ పాషా ఖాద్రీ నాలుగుసార్లు చార్మినార్ నుంచి, ఒకసారి యాకుత్‌పురా నుంచి ఎన్నికయ్యారు. బహదూర్‌పురా నుంచి మౌజం ఖాన్ నాలుగుసార్లు ఎన్నికయ్యారు. ఈ ముగ్గురు ఎమ్మెల్యేలకు రిటైర్మెంట్ ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయి.
కొత్త వారికి చాన్స్..
మజ్లిస్ పార్టీలో ఈసారి కొత్తవారి అభ్యర్థిత్వాలు ఖరారయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. నాంపల్లి సిట్టింగ్ ఎమ్మెల్యే జాఫర్ హుస్సేన్ మేరాజ్‌కు ఈసారి స్థాన చలనం జరిగే అవకాశాలు ఉన్నాయి. ఆయన అభ్యర్థిత్వాన్ని యాకుత్‌పురా స్థానానికి మార్చి నాంపల్లి స్థానానికి మాజీ మేయర్ మాజీద్ హుస్సేన్ అభ్యర్థిత్వాన్ని పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. చార్మినార్ నుంచి అక్బరుద్దీన్ ఒవైసీ కుమారుడు నూరుద్దీన్ లేదా కుమార్తె ఫాతిమా అభ్యర్థిత్వం ఖరారయ్యే అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ బహదూర్‌పురా సిట్టింగ్ ఎమ్మెల్యేకు రిటైర్మెంట్ ప్రకటిస్తే అక్కడి నుంచి మరో మాజీ మేయర్ జుల్పేఖార్ అలీ లేదా మరో యువనేత అభ్యర్థిత్వాన్ని పరిశీలించే అవకాశాలు లేకపోలేదని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment