ఇబ్రహీంపట్నం రూరల్: కమ్యూనిస్టుల ఆశలు అడియాసలయ్యాయి. త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు సీట్లు మినహా 115 నియోజకవర్గాల్లో బీఆర్‌ఎస్ అభ్యర్థులనుప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో వామపక్ష పార్టీలు తర్జనభర్జనలో పడ్డాయి. మునుగోడు ఉప ఎన్నికలో భాగంగా బీఆర్‌ఎస్‌తో కలిసి పని చేసిన వామపక్ష పార్టీలకు భంగపాటు తప్పలేదు. నిన్న మొన్నటి వరకు పొత్తు ఉంటుందని భావించాయి. సీఎం కేసీఆర్ ఒకేసారి పూర్తిస్థాయిలో అభ్యర్థులను ప్రకటించడంతో ఆశలు ఆవిరయ్యాయి.
ఇబ్రహీంపట్నం సీటుపై గంపెడాశలు..
పొత్తులో భాగంగా సీపీఎం ఇబ్రహీంపట్నం అసెంబ్లీ సెగ్మెంట్‌ను తీసుకోవాలని భావించింది. ఏడాది కాలంగా నియోజకవర్గంలో వివిధ కార్యక్రమాలను జోరుగా సాగించింది. సీపీఎం రాష్ట్ర మహాసభలను సైతం తుర్కయంజాల్‌లో నిర్వహించి పెద్ద ఎత్తున ప్రచారం సాగించింది. గతంలో ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో పాషా నరహరి హత్య అనంతరం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌తో పొత్తులో భాగంగా కొండిగారి రాములు 1989, 1994లో రెండు పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2004లో జరిగిన ఎన్నికల్లో మస్కు నర్సింహ సీపీఎం నుంచి విజయం సాధించారు. జిల్లాలో ఆ పార్టీకి ఇబ్రహీంపట్నం కంచుకోటగా ఉండేది. బీఆర్‌ఎస్‌తో పొత్తుపొడిస్తే తప్పనిసరి ఈ సీటు అడగాలని భావించారు. కానీ హ్యాట్రిక్ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి పేరునే మరోసారి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించడంతో కంగుతిన్నారు.
ఆలోచనలో పడ్డ వామపక్షాలు..
నియోజకవర్గంలో వామపక్షాలకు 2018లో 9వేలకు పైచిలుకు ఓట్లు వచ్చాయి. రాష్ట్రంలోనే సీపీఎం పోటీ చేసిన నియోజకవర్గాల్లో అత్యధిక ఓట్లు ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలోనే వచ్చాయి. అదే బలంతో ప్రజాపోరాటాలు చేస్తూ ప్రజల్లో ఉన్నారు. ఈసారి ఎలాగైనా పోటీ చేయాలని భావించినా బీఆర్‌ఎస్‌తో పొత్తు కుదరకపోవడంతో ఆలోచనలో పడ్డారు. కాంగ్రెస్‌తో కలిసి పనిచేస్తారో, లేక సొంతంగా పోటీ చేస్తారో వేచి చూడాలి.
Comments
Please login to add a commentAdd a comment